మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఆదర్శ సేంద్రియ రైతు పెంటయ్యకు వ్యవసాయ శాఖ సన్మానం.

 అసలైన సేంద్రియ  రైతులను గుర్తించి సత్కరించిన వ్యవసాయశాఖ. 

 - హర్షం వ్యక్తం చేస్తున్న మండల రైతాంగం. 


Scv News Kasipeta:--

 పంట పొలాలలో నిత్యం కష్టపడి సేంద్రీయ వ్యవసాయం చేసే నిజమైన రైతులను గుర్తించి వ్యవసాయ శాఖ అధికారులు సత్కరించడం పట్ల రైతులో ఆనందోత్సవాలు వేల్లి విరుస్తున్నాయి. నిజమైన రైతులను అవార్డులతో సత్కరించడంతో  వారి స్ఫూర్తితో  మరి కొంతమంది యువ రైతులు ముందుకు వచ్చి వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ సేంద్రీయ వ్యవసాయాన్ని జిల్లాలలోని వివిధ  మండలంలో విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడిచే బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం రైతులు ఇటీవల  జగిత్యాల జిల్లాలో ని పోలాసలోని వ్యవసాయ పరిశోధన సంస్థలో రైతులకు రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా  గత సంవత్సరం సేంద్రియ  వ్యవసాయ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులకు అవార్డులను అందజేశారు. కాసిపేట మండలం సండ్రల్ పహాడ్ గ్రామానికి చెందిన  దాడి పెంటయ్య ను ఉత్తమ సేంద్రియ రైతుగా ఎంపిక చేయడం పట్ల మండల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది.

 మండలంలో ఆదర్శ సేంద్రియ రైతు పెంటయ్య.

 పెంటయ్య తనతో పాటు తోటి  రైతులకు సహాయ సహకారాలు అందించాలని  సామాజిక స్పృహ కలిగిన ఆదర్శ రైతు.గత పదేళ్లుగా మండలంలోని వివిద గ్రామాలలో రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు.  వ్యవసాయ అధికారుల సూచనలతో గ్రామాలలోని రైతులకు సలహాలు ఇస్తూ తాను స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. తన స్వగ్రామంలో  తనకు ఉన్న మూడు ఎకరాల పొలంలో రసాయనిక ఎరువులు వాడకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా భూసారాన్ని పరిరక్షించే సేంద్రియ పద్ధతిలో పశువుల ఎరువు, పచ్చి రొట్టె ఎరువులు,జీవన ఎరువులతో వరి, పెసర,కంది మొక్కజొన్న పత్తి పంటలు సాగు చేస్తున్నారు. పండిన పంటలను వ్యాపారులకు అమ్మకుండా వరి, కంది, పెసర పంటలను నేరుగా  బియ్యం పప్పులుగా తయారు చేసి వినియోగదారులకు సేంద్రియ పంటలను అందజేస్తూ అందరి అభిమానాన్ని చురగొంటున్నాడు. చిరు సంచులను తయారు చేసి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేరుగా రైతులకు విత్తనాలు విక్రయిస్తూ ఎంతో సహాకారం అందిస్తున్నాడు. 

 ఉత్తమ రైతు అవార్డుల ఎంపికలో తప్పును సరిదిద్దుకున్న వ్యవసాయ శాఖ.

మండలంలో గతంలో వ్యవసాయ శాఖ అసలైన సేంద్రియ రైతులను గుర్తించ కుండా పైరవీలతో  కొంతమంది రైతులను రాష్ట్రస్థాయి అవార్డుకు  ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. మొక్కుబడిగా కొన్ని రోజులు సేంద్రియ వ్యవసాయం చేసి మానివేసిన వారికి  రాష్ట్రస్థాయిలో సేంద్రీయ ఉత్తమ రైతు అవార్డులను ఇచ్చి అబాసు పాలయ్యా రు. రాష్ట్ర ఉత్తమ అవార్డు  తీసుకున్న రైతు అవార్డును వారి సొంత ప్రచారాలకే వాడుకోవడమే తప్ప  తోటి రైతులకు స్ఫూర్తిదాయకంగా ఉండే సేంద్రియ వ్యవసాయం చేసిన  దాఖలాలు లేవు. వ్యవసాయ శాఖ అధికారులు తమ తప్పులు సరిదిద్దుకుని ఇన్నాళ్లకు  సేంద్రియ వ్యవసాయాన్ని మండలంలో  ప్రచారం చేస్తూన్న ఆదర్శ రైతు పెంటయ్య సేవలను గుర్తించి  సన్మానించడం పట్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.