మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఓరియంట్ కర్మాగారం ఏర్పడి నాలుగు దశాబ్దాలు గడిచిన భూ నిర్వాసితులకు అన్యాయమే.

ఓరియంట్ ఆధీనంలో గిరిజన భూములు ఉన్న పరిహారం ఉద్యోగాలు ఇవ్వని యాజమాన్యం. 

- ఏజెన్సీ ప్రాంతంలో నుండి సహజ సంపదతో కోట్ల లాభాలు గడిస్తున్న పరిసర ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోని ఓరియంట్ యాజమాన్యం.

- సున్నపురాయి  గని లీజు ప్రజాభిప్రాయ సందర్భంగా  ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పడ్డ ఓరియంట్ సిమెంటు కర్మాగార చరిత్ర,నాలుగు దశాబ్దాలుగా  భూ నిర్వాసితులైన  ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాల పై, ప్రజా గొంతుక  Scv News అందిస్తున్న ప్రత్యేక కథనాలు.

 దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారం.



Scv News Kasipet:--

 నైజాం ప్రభుత్వ హాయము నుండి దశాబ్దాలుగా  చుట్టూ దట్టమైన అడవులు కొండల మధ్యలో పకృతి ఒడిలో కాసిపేట మండలం దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ని  గోండు, నాయకపోడు తెగ గిరిజనులు నివసిస్తూన్నారు.. సారవంతమైన నల్లరేగడి భూముల్లో  వర్షాధార పంటలు పండిస్తూ అటవి ఉత్పత్తులను మైదాన ప్రాంతాలకు తీసుకువెళ్లి  అమ్ముకొని జీవనం సాగించేవారు. దేవాపూర్ గుట్టల్లో అపారమైన నాణ్యమైన  సున్నపురాయి నిల్వలు పుష్కలంగా ఉండేవి. ఈ సహజవనరులను చూసి   1978 ప్రాంతంలో సున్నపురాయి ముడి సరుకు గా వాడుకుని సిమెంట్ ఉత్పత్తి చేసేందుకు బిర్లా యాజ మాన్యం ముందుకు వచ్చింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అను మతులు పొంది భూ సేకరణ చేసి దేవాపూర్ ఏజెన్సీ గ్రామంలో 1981లో  ఆసియాలోనే అతిపెద్ద సిమెంట్ కర్మాగారం నిర్మించి ఉత్పత్తి ప్రారంభించింది. 

ఓరియంట్ యాజమాన్యం పరిశ్రమ ఏర్పాటు ముందు ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధితో పాటు గిరిజన గూడాలను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని  ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని సిమెంటు పరిశ్రమను ఏర్పాటు చేశారు. యాజమాన్యం ఉత్పత్తి ప్రారంభించి నాలుగు దశాబ్దాలు గడుస్తు కోట్లాది రూపాయల లాభాలార్జిస్తున్న తాను ప్రభుత్వంతో చేసుకున్న  ఒప్పందాలను తుంగలో తొక్కింది. భూ  నిర్వాసితుల హక్కులు, పరిసర గ్రామాల అభి వృద్ధి, నిరుద్యోగుల ఉపాధిని విస్మరించింది. లాభార్జన ధ్యేయం గా ఈ ప్రాంతంలోని నాణ్యమైన సున్నపురాయి ముడి సరుకును  క్లింకర్ గా మార్చి ఇతర రాష్ట్రాలలో పరిశ్రమలకు తరలించి ప్రతి ఏటా వేలాది కోట్ల లాభాలను  ఆర్జిస్తు న్నది. అందులో ఒక్క శాతం కూడా తమ గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం లేదని స్థానికులు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నారు. దీంతో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు వల్ల తమ ప్రాంతం అభివృద్ధి పథంలోకి వచ్చి, తమకు ఉపాధి లభిస్తుందని గిరిజనుల, నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి.

గత నాలుగు దశాబ్దాలుగా దేవాపూర్ పరిసర గ్రామాల అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందంగా తయారైంది. పరిసర ప్రాంత గిరిజనుల అభివృద్ధి కాదు కదా, సిమెంటు పరిశ్రమ ఉన్న దేవాపూర్ గ్రామ అభివృద్ధిని కూడా  పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర అసంతృప్తిలో వున్నారు. కర్మాగార నిర్మాణంలో భూములు పోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం, ఉద్యోగాలు నేటికీ అందలేదు. సిమెంటు పరిశ్రమ ద్వారా వెదజల్లే కాలుష్యంతో పరిసర  గిరిజన గ్రామాలలో సారవంతమైన నల్లరేగడి భూములు నిస్సారమైన పంటలు పండక కరువు కాటకా లతో తల్లడిల్లుతున్నారు. సిమెంట్ దుమ్ము దులిని పీల్చి ఆస్తమా, కిడ్నీ,క్షయ వాదులతో గిరిజనులు బాధపడుతు న్నారు. వారికి  కనీస వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. సిమెంట్ పరిశ్రమలో గుత్తేదారుల ద్వారా వేలాది మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కూలీలకు ఉపాధి కల్పిస్తూ, స్థానిక నిరుద్యోగ యువతను పట్టించు కోవడం లేదు. కర్మాగార నిర్మాణ సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం భూనిర్వాసితులకు నష్టపరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని, పరిసర గ్రామాల అభివృద్ధి పట్టించు కోవాలని గత నాలుగు దశాబ్దాలుగా గిరిజనులు ఉద్యమిస్తూనే ఉన్నారు. తమకు  న్యాయం కావాలని కోర్టుల చుట్టూ తిరిగి వారికీ అనుకూలంగా తీర్పులు వచ్చిన  వాటిని అమలు చేయడంలో ఓరియంట్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

దేవాపూర్ ప్రాంత ఆదివాసుల చరిత్ర గురించి తెలుసుకుందాం..!

భూమి,భుక్తి,విముక్తి కోసం ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ కొండల్లో 1940 ప్రాంతంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజన పోరాట యోధుడు  కొమురం భీం తిరుగుబాటు చేశారు. కొమురం భీం సాయుధ పోరాటం తెలంగాణలోని నైజాం ప్రభుత్వంతో పాటు, దేశంలోని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వా న్ని కూడా వణికించిం ది. కుమ్రంభీం తిరుగుబాటుకుకారణం, అదిలాబాద్ అటవి ప్రాంతంలోని గిరిజనులలో నెలకొన్న అసంతృప్తి గల కారణాలను తెలుసుకొని వాటికి పరిష్కారం మార్గం చూపాలని నైజాం ప్రభుత్వం నిర్ణయించుకుంది. బ్రిటన్ కు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త హేమన్ డార్ఫ్ దంపతులను ఆదిలాబాద్ అడవులకు పరిశీలనకు పంపారు. హేమన్ డార్ఫ్ దంపతులు ఉట్నూరు సమీపంలోని మార్లవాయి గిరిజన గూడం కేంద్రంగా ఆదిలాబాద్ జిల్లా లోని అటవీ ప్రాంతాలు అన్ని తిరిగి గిరిజనుల సమస్యలను తెలుసుకుని గిరిజనుల అసంతృప్తికి ప్రధాన కారణం భూమి సమస్యని  గుర్తించి నైజాం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అడవి తల్లి బిడ్డలైన గిరిజనులకు అటవీ ఆధారమని, అడవిని నరికి పోడు వ్యవసాయం చేసే గిరిజను లను అటవీశాఖ అధికారులు అడివి నుండి వెళ్లగొట్టే  ప్రయత్నా లు చేయడం వల్లనే గిరిజనులు తమ జీవన్మరణ సమస్యగా గుర్తించి  చేసేదిలేక తిరుగుబాటు చేశారని తేల్చారు. కాబట్టి అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులను మచ్చిక చేసుకోవాలంటే భూమిని పంపిణీ చేయాలని నైజాం సర్కారు హేమన్ డార్ఫ్  దంపతులు సూచించారు. వారి సూచనల మేరకే అదిలాబాద్ జిల్లా అడవుల్లో పోడు వ్యవసాయం చేసి నివసించే గిరిజనులకు నైజాం సర్కారు ఒక్కొక్క  కుటుంబానికి 15 నుండి 20 ఎకరాల  భూముల పట్టాలు ఇచ్చింది.

దీనిలో భాగంగానే దేవాపూర్ అటవీ ప్రాంతంలో   ప్రాంతాలలో నివసించే గిరిజను లకు కూడా నైజాం ప్రభుత్వం భూ పంపిణీ చేసింది. దేవాపూర్ పరిసర ప్రాంతంలో  రాంపూర్, జైతుగూడ,గడ్ పూర్, దేవాపూర్, పెద్ద గూడ  గ్రామాలలో  గోండు జాతి గిరిజనులు నివసించే వారు. మద్దిమాడ, దేవాపూర్ లో నాయక్ పోడ్ గిరిజనులు నివసించేవారు. దేవాపూర్ ప్రాంతంలో సర్వే నంబర్ 84 పై వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవి. దేవాపూర్ ప్రాంతంలో అప్పటి రోజుల్లో నివసిస్తున్న 62 గోండు,  నాయకపోడ్ తెగ గిరిజన  కుటుంబాలకు 960 ఎకరాల భూములను నైజాం సర్కారు పంపిణీ చేసింది. ఒక్కొక్క తెగకు 480 ఎకరాలు చొప్పున పంపిణీ చేశారు. మద్దిమాడ, దేవాపూర్ నాయకపు గూడలో నివసించే 32 నాయకపోడు కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 ఎకరాల చొప్పున సర్వే నెంబర్ 84 /4 నుండి,84 /36 వరకు 480 ఎకరాలను పంపిణీ చేశారు. దేవాపూర్, రాంపూర్, పెద్ద గూడ  గ్రామాలకు చెందిన గోండు తెగ గిరిజనుల 30 కుటుంబాలకు ఒక్కొక్క కుటుం బాని కి 16 ఎకరాల చొప్పున  సర్వే నెంబర్ 84/37 నుండి 84 / 66 వరకు 480 ఎకరాలు పంపిణీ చేసి నైజాం ప్రభుత్వం భూమి హక్కు పత్రాలు ఇచ్చారు. అప్పటి నుండి 1979 వరకు దేవాపూర్ ప్రాంత గిరిజనులు సారవంతమైన  నల్లరేగడి భూములు  వర్షాధారం గా కంది, పెసర, తెల్ల జొన్న, మొక్క జొన్న  పంటలు పండించేవారు. వీటితో పాటు సమీపంలోని అటవి ప్రాంతంలో సీజన్ లో దొరికే అటవీ ఉత్పత్తులైన జిగురు, తేనే, ఇప్పపువ్వు, తునికి పండ్లు సేకరించి, వెదురుతో తడకలు, బుట్టలు తయారుచేసి మైదాన ప్రాంతాల సంతలకు  తీసుకువెళ్ళి విక్రయించి జీవనం సాగించేవారు.

గిరిజనుల  అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, గిరిజన గ్రామాలలో కి గిరిజనేతర లైన  షావుకార్లు, వడ్డీ వ్యాపారస్తు లు, భూస్వాములు  తక్కువ ధరలకు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసుకొని దోపిడి చేసేవారు. గిరిజన గూడలలో  జరిగే పెళ్లిళ్లు, దేవుళ్ళ ఖర్చులకోసం  వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు  అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వారి భూములను గుంజు కొనేవారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అటవీ ప్రాంతాల్లో గిరిజనులను వ్యాపారులు, భూస్వాముల దోపిడీ నిరాటంకంగా కొనసాగింది.

అటవీ ప్రాంతాలలో నివసించే అమాయక గిరిజనులను వ్యాపారస్తులు, భూస్వాములు దోపిడీ చేసినందుకు  నిరసనగా దేశవ్యాప్తంగా గిరిజన తిరుగుబాట్లు జరిగాయి. 1968- 69  ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం లో గిరిజన సాయుధ తిరుగుబాట్లు జరిగాయి. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల్లో ని అసంతృప్తి తిరుగుబాటుకు కారణాలను గుర్తించింది. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల దోపిడీ భూ ఆక్రమణలే  ప్రధాన కారణమని గుర్తించి 1/70  ఏజెన్సీ చట్టాన్ని తెచ్చింది. ఈ ఏజెన్సీ చట్టప్రకారం గిరిజనులు నివసించే ప్రాంతంలో గిరిజనేతరులు  భూములను కొనరాదు. పక్కా నిర్మాణాలను చేపట్టడం చట్టరీత్యా నేరం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 1/70 చట్టం వల్ల అటవి ప్రాంతంలో నివసించే గిరిజనులను  గిరిజనేతరుల దోపిడీ, భూ ఆక్రమణల నుండి కొంతమేరకు కాపాడింది. ఏజెన్సీ చట్టం తేవడానికి ముందు గ్రామాలలో ఉన్న వందలాది  ఎకరాల భూములు గిరిజనేతరుల అయిన దొరలు భూస్వాములు చేతుల్లోనే ఉన్నాయి. కాసిపేట మండలం లో కూడా అప్పుడు  గిరిజనులు ఎక్కువగా ఉన్నా  దేవాపూర్,కాసిపేట, ముత్యంపల్లి, ధర్మరావుపేట, మల్కపల్లి గ్రామాలు ఏజెన్సీ గ్రామాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలోని భూములను గిరిజనేతరుల ఎవరు కొనడానికి అమ్మడానికి, వీలులేదు. 1/70 ఏజెన్సీ చట్టం అమాయక గిరిజనుల పాలిట  రక్షణగా నిలిచి వారి భూములను వారి ఉనికి కాపాడుతూ వచ్చింది . అటవీ ప్రాంతాల్లో ఉన్న విలువైన సహజ, ఖనిజ సంపద ల పై దోపిడి దారుల   చూపు పడడంతో పకృతి ఒడిలో జీవనం సాగిస్తూ ఆనందంగా గడిపిన  గిరిజన గూడాల లో కల్లోలం లేచింది.

( ఓరియంట్ కబ్జాలో ఆదివాసుల భూముల గురించి.. -2)