మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఓరియంట్ సిమెంట్ కర్మాగారానికి ఎలా అనుమతులు వచ్చాయి.?

 ఓరియంట్ ఆధీనంలో వందలాది ఎకరాల ఆదివాసుల భూములు ఉన్నాయని తేల్చిన రెవెన్యూ,సర్వే అధికారులు.

 నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా ఆదివాసుల భూములకు పరిహారం ఉద్యోగాలు ఇవ్వని ఓరియంట్ యాజమాన్యం.

 భూ నిర్వాసితులకు  ఉద్యోగాలు,పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన  పట్టించుకోని యాజమాన్యం. 

- ప్రజాభిప్రాయ సేకరణలో తమకు న్యాయం చేయాలని నిర్వాసిత గిరిజనులు జిల్లా కలెక్టర్ కు వేడుకలు.





 ఓరియంట్ కబ్జాలో భూములు కోల్పోయి పరిహారం ఉద్యోగాలు అందక పేదరికంలో తల్లాడిల్లుతున్న నిర్వాసిత ఆదివాసి కుటుంబాలు 


Scv News Kasipet:--

అడవి తల్లి బిడ్డలైయినా ఆదివాసులు నివసించే అటవీప్రాంతం పై 1/70 ఏజెన్సీ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం సర్వ హక్కులను కల్పించింది. ఏజెన్సీ పరిధిలోని గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరుల ఎవరు భూములు కొనుగోలు చేయవద్దని, పక్కా నిర్మాణాలు ఇండ్లు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవద్దని ఆ చట్టం చెబుతోంది. ఏజెన్సీ చట్టం అమలులో ఉన్న దేవపూర్ ప్రాంతంలో  ఆసియాలోనే అతిపెద్ద  సిమెంట్ కర్మాగారం నిర్మాణానికి బిర్లా  యాజమాన్యంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇచ్చాయి అనేది చాలామందికి అంతుపట్ట లేని విషయం...

భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోని అటవీ ప్రాంతాల్లోని అడవులు గుట్టలు కొండల్లో లభించే ఖనిజ సంపద లపై సర్వే చేసి గుర్తించారు. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన సున్నపురాయి, ఇనుము,బాక్సైట్, రాగి, ఎర్రమట్టి, బొగ్గు ఖనిజ సంపద ఎక్కడెక్కడ లభిస్తుందో బ్రిటిషర్లు సర్వే చేసి గుర్తించి ఖనిజ సంపద వారి హయాంలోనే తరలించడం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత దేశం పురోగతి లో వెళ్లాలంటే అటవీ ప్రాంతంలో లభించే విలువైన సహజ, ఖనిజ సంపదను ఆధారంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని మన పాలకులు నిర్ణయించారు. అటవీ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆదివాసులకు అటవీ ప్రాంతంలో హక్కులు కల్పించే 1/70 చట్టం అడ్డంకిగా మారింది.

అటవీ ప్రాంతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజనులను అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలంటే  అక్కడ దొరికే సహజ సంపదల తో పరిశ్రమలను ఏర్పాటు చేసి గిరిజన గూడాల  అభివృద్ధితో పాటు, నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి ఇప్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచవచ్చని పాలకులు నిర్ణయానికి వచ్చారు. ఇదే సాకుతో కేంద్ర ప్రభుత్వం గిరిజను ల హక్కులను  కాపాడే 1/70  చట్టానికి సవరణలు తెచ్చి అను మతులు ఇవ్వడం ప్రారంభించింది. దీనిలో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలో 1978-79 సంవత్సరాల్లో బిర్లాయాజమాన్యం  ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఏర్పాటుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా ల నుండి అనుమతులను పొందింది. ఓరియంట్ కర్మాగారం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ బాధ్యతను అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అప్పచెప్పారు. కలెక్టర్ పర్యవేక్షణలో నిర్మల్ ఆర్డీవో లక్షేట్ పెట్ తహసిల్దార్ సమక్షంలో భూ సేకరణ జరిగింది. భూసేకరణకు ముందే దేవాపూర్ వాసులు, భూనిర్వాసితులు తమకు తగిన నష్టపరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని ఆందోళనకు దిగి సర్వేను అడ్డుకున్నారు. అప్పుడు భూమి ధర నిర్ణయము ఉపాధి విషయమై   రాష్ట్ర ప్రభుత్వానికి ఓరియంట్ యాజమాన్యానికి చర్చలు జరిపి ఒక  ఒప్పందం చేసుకున్నాయి. మెమో 813/ID/81-2 తేదీ 7-7-1981.ఈ ఒప్పందం ప్రకారం

* దేవాపూర్ ఏజెన్సీ పరిధిలోని గిరిజన గూడాలను ఓరియంట్ యాజమాన్యం  దత్తత తీసుకుని రహదారులు, రక్షిత మంచినీటి పథకాలు లాంటి  మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉచిత విద్య, వైద్యం అందించాలని ఒప్పందాం  చేసుకున్నాయి.

* ఓరియంట్  సిమెంటు కర్మాగారం లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం.

* గిరిజన యువతకు సిమెంట్ పరిశ్రమలో పనిచేసేందుకు అవసరమైన పనులలో శిక్షణ కల్పించి ఉద్యోగాలు ఇవ్వాలి.స్థానిక గిరిజన,గిరిజనేతర యువకులు చదువుకొని ఉంటే వారికి ఉద్యోగాలు ఇవ్వాలి.సిమెంటు కాలుష్యం వల్ల పంటలు దెబ్బతింటే రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి.

 భూ సేకరణకు సంబంధించిన వివాదాలన్ని వివాదాలన్ని నిర్మల్ ఆర్డిఓ పరిధిలోని పరిష్కరించు కోవాలని ఒప్పందం కుదుర్చు కున్నాయి.

ఓరియంట్ లో భూసేకరణ ఇలా జరిగింది..

 భూసేకరణలో ఆదివాసీలకు జరిగిన తీవ్ర మోసం...

దేవాపూర్ లో ఓరియంట్ సిమెంట్ కర్మాగారం నిర్మాణం కోసం బిర్లా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1978- 79 లో  అధికారికంగా భూసేకరణ చేసింది. మొదట పరిశ్రమ నిర్మాణం కోసం 194 ఎకరాలు, టౌన్ షిప్ ఏర్పాటు కోసం  250 ఎకరాలు, లారీ అవార్డు రైల్వే కోసం 12 ఎకరాలు మొత్తం 456ఎకరాలు అధికారికంగా సేకరించింది. ప్రస్తుతము ఓరియంట్ ఆధీనంలో మూడు వేల ఎకరాల వరకు ఉందని సర్వేలో జిల్లా రెవెన్యూ అధికారులు తేల్చారాని ఓరియంట్ భూనిర్వాసితులు ఆరోపిస్తున్నారు. మిగతా 2500 ఎకరాలు అనధికారికంగా అప్పటి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని, ప్రలోభాలకు  గురిచేసి ఓరియంట్ యాజమాన్యం  ఆక్రమించింది అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

భూ సేకరణ సమయంలో రెవెన్యూ అధికారుల మాయాజాలంతో పట్టా దారులైన ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ ప్రాంతం లోని వందల ఎకరాల భూమీ ఒకే సర్వే నెంబర్ 84 లో ఉండడం రెవెన్యూ అధికారులకు అనుకూ లించింది. ఈ నంబర్ ను వేసి కాస్తులో లేనివారికి, దొంగ పట్టాలు సృష్టించి  గిరిజనులకు అన్యాయం చేశారు. కర్మాగారంలో 16 ఎకరాల భూములు పోయిన పట్టాదారు లకు ఒక్క ఉద్యోగం మాత్రమే ఇచ్చి, ఎకరం భూమిని గుంటలలో పది మందిపై  పట్టాలు సృష్టించి 10 ఉద్యోగాలు యాజమాన్యం ద్వారా పొందారు. పరిహారం మాత్రం రెవెన్యూ అధికారులు స్వాహా చేశారు. కొంత మంది గిరిజనులకు 16 ఎకరాల భూములు పోయిన ఉద్యోగాలు, నష్ట పరిహారం అందలేదు. కొంత మంది రెండు గుంటల భూమి పోయి కూడా ఉద్యోగాలు పొందిన ఉదంతాలు ఉన్నాయి.

నైజాం ప్రభుత్వ హాయంలో  దేవాపూర్ ప్రాంతంలోని 62  నాయకపోడు, గోండు గిరిజనుల కుటుంబాలకు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందాలనే లక్ష్యంతో  960 భూమిని పంపిణీ చేసింది. సర్వే నెంబర్ 84 లో  1 నుండి 36 వరకు వై నంబర్ల ద్వారా 15,16 ఎకరాల పంపిణీ జరిగింది. నాయకపోడుల కు 15 ఎకరాలు, గోండు తెగ గిరిజనులకు 16 ఎకరాలు పంపిణీ  వేసింది. ఈ భూముల్లో ఓరియంట్ యాజమాన్యం రెవెన్యూ శాఖ ద్వారా 456 ఎకరాలను అధికారికంగా సేకరించి నష్టపరిహారం ఉద్యోగాలను ఇచ్చింది. అనధికారికం గా ఆదివాసీల కు చెందిన మిగతా 514 ఎకరాలు కూడా తాను ఆక్రమించింది. తెలివిగా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైన ఓరియంట్ యాజమాన్యం  భూసేకరణలో ఎకరం, రెండెకరాలు  మాత్రమే స్వీకరించి నష్టపరిహారం ఉద్యోగాలు ఇచ్చామని బుకాయి స్తుంది. 16 ఎకరాల భూమి పట్టాదారులుగా  దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న మిగతా 14, 15 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందని అమాయక ఆదివాసి వేసే ప్రశ్నలకు ప్రభుత్వ అధికారుల వద్ద, ఓరియంట్ యాజమాన్యం వద్ద సమాధానం లేదు. సహజంగా కే సర్వే నంబర్లలో ఉన్న 16 ఎకరాల భూమి ఒకే దగ్గర ఉంటుంది. రెవెన్యూ  అధికారుల మాయాజాలం వల్ల ఒక్కొక్క 16 ఎకరాల  పట్టదారు భూమిలో 30 గుంటలు,ఎకరం మాత్రమే నష్ట పరిహారం రెవెన్యూ అవార్డుల  ద్వారా అధికారికంగా చెల్లించా రు .రెవెన్యూ అధికారులు మిగితా భూమి ఓరియంట్ యాజమానికి అప్పనంగా కట్టబెట్టి లబ్ధిపొందారు.   ఎకరానికి పరిహారం ఇచ్చారు, మిగతా 15 ఎకరాల కు పరిహారం ఏదని అడిగితే మీ భూములు అడవుల్లో గుట్టల్లో ఉన్నాయంటూ రెవెన్యూ, ఓరియంట్ యాజమా న్యం బాధిత భూ నిర్వాసిత గిరిజనులను దాబా ఇస్తున్నారు. రెవెన్యూ,ఓరియంట్ యాజమాన్యం ద్వారా తమకు  తీవ్రమైన అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని 40 ఏళ్లుగా ఆదివాసి బిడ్డలు అలమటిస్తు న్నారు. 

 దశాబ్దాలుగా  సాగు చేసుకున్న తమ భూమి  తమదేనని నిరూపించు కునేందుకు కోర్టును ఆశ్రయించిన దుస్థితిలో ఆదివాసి లు.

- ఓరియంట్ బాధిత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన అమలుకాని వైనం...

నైజాం ప్రభుత్వ హాయం నుండి సాగు చేసుకుంటున్న తమ భూములు  తామేవే నని చూపించుకునేందుకు హై కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి లోకి దేవాపూర్ ఆదివాసీ గిరిజనులు నెట్టబడ్డారు. హైకోర్టు ఆదివాసీలకు అనుకూలంగా పరిహారం,ఉద్యోగా లు ఇవ్వాలని తీర్పు ఇచ్చిన  దశాబ్దాలుగా అమలు కావడం లేదు.

రీ సర్వే తో  కంపెనీ ఆధీనంలోనే గిరిజనుల భూములు ఉన్నాయని వెల్లడి.

- 14 ఏళ్లు గడుస్తున్న అమలు కాని వైనం.

హైకోర్టు ఆదేశాల మేరకు  భూ నిర్వాసితులైన గిరిజనులు 2008లో జిల్లా రెవెన్యూ సర్వే అధికారికి ఓరియంత ఆధీనంలో ఉన్న తమ భూములకు కొలతలు చేయాలని చాలను కట్టారు. రెండు సంవత్సరాల తర్వాత 2010 నుండి సర్వే అధికారులు కొలతలు ప్రారంభించారు. రీ సర్వేలో వీరి భూములు మొత్తం కంపెనీ ఆధీనంలో ఉన్నట్టు తేలింది. ఓరియంట్ యాజమాన్యం ఒత్తిడితో సర్వే చేసిన పంచనామా రిపోర్టులు ఇంతవరకు నిర్వాసిత రైతులకు అందడం లేదు. 

ప్రస్తుతం ఓరియంట్ కర్మాగారంలో  సేకరించిన భూమి కంటే సుమారు 2500 ఎకరాల భూమి వరకు ఎక్కువ ఉందని    జిల్లా సర్వే, రెవెన్యూ  అధికారులు తేల్చారు. గిరిజనుల పట్టా భూముల తో పాటు  ప్రభుత్వ భూములు, అటవి భూములు కూడా   ఓరియంట్ కబ్జాలో ఉన్నట్లు రీ సర్వే లో వెల్లడైంది. సర్వే అధికారులు ఇచ్చిన రిపోర్టును  వెల్లడించ కుండా రాష్ట్రస్థాయిలో తన పలుకుబడితో  ఓరియంట్ యాజమాన్యం అడ్డుకుంటుందని భూనిర్వాసితులు  ఆరోపి స్తున్నారు. దేవాపూర్ లోని రెండు గిరిజన కుటుంబాలకు మాత్రమే జిల్లా సర్వే అధికారులు ఓరియంట్ కబ్జాలో మీ భూమి ఉందని  పంచనామ రిపోర్టు అందజేశారు. జిల్లా సర్వే అధికారి ఇచ్చిన పంచనామా రిపోర్ట్ ఆధారంగా దాన్ని హైకోర్టులో పిల్ వేయగా వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చి పన్నెండేళ్లు గడుస్తున్న  అమలు కావడం లేదు.ఓరియంట్ యాజమాన్యం తమకు సంబంధం లేదని కలెక్టర్ ద్వారా వస్తేనే ఉద్యోగం, నష్టపరిహారం ఇస్తామని తప్పించుకుంటుంది. రెవెన్యూ అధికారులను ఓరియంట్ యాజ మాన్యం ప్రభావితం చేయడంతో కోర్టు తీర్పు అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని నిర్వా సిత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ప్రజాబిప్రాయ సేకరణకు వస్తున్న జిల్లా కలెక్టర్ తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి కంపెనీ ఆధీనంలోనే తమ భూములు ఉన్నాయని సర్వే అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పరిహారం ఉద్యోగలింపు ఉద్యోగాలు ఇప్పించాలని నిర్వాసిత గిరిజనులు వేడుకుంటున్నారు.