మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

నాగరికుల చేతిలో మోసపోయిన కుర్రెఘడ్ఆదివాసిలు.

 నాగరిక ప్రపంచంలోని ప్రభుత్వ యంత్రాంగం మాటలు నమ్మి అడవిని విడిచి మోసపోయిన   కుర్రేగడ్ ఆదివాసి కుటుంబాలు.

ప్రజాస్వామ్యం పై నమ్మకంతో దశాబ్దాలుగా  ప్రతి ఎన్నికల్లో ఒకరోజు ముందు  దట్టమైన అడవులు,కొండలు దిగివచ్చి ఓటు హక్కును వినియోగించు కున్న ప్రజాస్వామ్య ప్రతీకలు వాళ్ళు .

- దశాబ్దాలుగా ప్రకృతి ఒడిలో పోడు వ్యవసాయం చేసుకుని  హాయిగా జీవించిన అడవి తల్లి బిడ్డలువాళ్ళు .

- 15 ఏళ్ల క్రితం వేసవికాలంలో   కలుషిత నీరు తాగి ఐదుగురు మృతి చెందడం ఆదివాసి గూడెం పాలిట శాపమైంది.

 -  కలుషిత నీరు గ్రామాన్ని చిన్నాభిన్నం చేసి ఆదివాసీలకు నిలవనీడ లేకుండా చేసింది. 

- బాహ్య ప్రపంచంలోకి వస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి కుర్రెగడ్ గ్రామాన్ని  మైదాన ప్రాంతాలకు తరలించిన అధికార యంత్రాంగం .

- కుర్రేగడ్ లో అడవులు నరికి పోడు వ్యవసాయం చేసిన ఆదివా సుల 500 ఎకరాల వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకుని మొక్కలు పెంచుతున్నఅటవీ శాఖ.

- దానికి బదులుగా ఎకరం భూమి కూడా కుర్రేగాడ్ ఆదివాసులకు పంపిణీ చేయని అటవీ శాఖ. 

- గ్రామాన్ని తరలించి 15 ఏళ్లు గడుస్తున్నా అప్పటి హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని ప్రభుత్వ యంత్రాంగం. 

-  జీవనోపాధి లేక ఆకలి బాధలతో తల్లడిల్లుతున్న కుర్రేగాడ్ ఆదివాసి కుటుంబాలు. 

-  పాలకుల మాటలు నమ్మి అడవిని విడిచి మైదానానికి వచ్చి  మోసపోయామని ఆదివాసుల ఆవేదన.

 -  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పదేళ్ల ప్రభుత్వంలో కూడా కుర్రేగడ్ గిరిజన గూడాన్ని పట్టించుకోని పాలకులు.

కుర్రే గాడ్ వాసుల కన్నీటి గాధ పై   'Scv News' అందిస్తున్న ప్రత్యేక కథనం.. 

 అధికార యంత్రాంగం చేతిలో మోసపోయిన కుర్రేగడ్ గిరిజన కుటుంబాలు.

 కుర్రేగడ్  పునరావాస గ్రామము, గిరిజన కుటుంబాలు.

 కుర్రేఘాట్ గ్రామాన్ని ఖాళీ చేసి వచ్చి మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్నప్పుడు అప్పటి అధికారులు ప్రజాప్రతినిధులు పరామర్శిస్తున్న పాత చిత్రాలు.


Scv News Kasipet:--

 దట్టమైన అడవులు, కొండల మధ్య బాహ్య ప్రపంచానికి దూరంగా పకృతి ఒడిలో  పోడు వ్యవసాయం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకొనే హాయిగా బ్రతికే అడవి తల్లి బిడ్డలు కుర్రే గాడ్ వాసులు.అక్షర జ్ఞానం లేకున్నా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పై నమ్మకంతో ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రతీకలుగా నిలిచిన ఆదివాసి బిడ్డలు వారు.మైదాన ప్రాంతంలో ని గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో నాగరికలుగా పిలవబడే ప్రజలు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించు కునేందుకు బద్ధకించడంతో  50% కూడా పోలింగ్ జరగని  ఈ రోజుల్లో.. ఎన్నికలు వచ్చాయని తెలిసి ఒక్కరోజు ముందే దట్టమైన అడవినుండి కొండలు దిగివచ్చి  సుమారు 30 కిలోమీటర్లు కాలినడకన పోలింగ్ కేంద్రానికి  వచ్చి తమ ఓటు హక్కును వినియోగించు కుని  ప్రజాస్వామ్యా నికి పట్టుకొమ్ములు గా  నిలిచిన అడవి తల్లి బిడ్డలు వాళ్ళు.

దశాబ్దాలుగా దట్టమైన అడవిలో ఎత్తైన కొండల మీద సహజ సిద్ధంగా ఏర్పడ్డ వందలాది ఎకరాల సారవంత మైన నల్లరేగడి భూములలో పోడు వ్యవసాయం చేస్తూ వర్షాధారంగా అన్ని రకాల   పంటలను పండించుకుని హాయిగా జీవనం  సాగించినవారు. గత 15 ఏళ్ల క్రితం వేసవికాలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడి కలుషిత నీరు తాగి గ్రామంలోని అయిదుగురు మృతి చెందడం గిరిజన గూడెం  పాలిట  శాపంగా మారింది. కలుషిత నీరు తాగి ఆదివాసీలు మృతి చెందిన ఘటన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. ఆదివాసుల ప్రాణాలు కాపాడాలని ప్రతిపక్షాలు గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. కుర్రె గాడ్ వాసులను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టేందుకు దట్టమైన అడవి కొండలపైన ఉన్న కుర్రేగడ్ ఆదివాసి గ్రామానికి తరలింది. ప్రభుత్వ యంత్రాంగం వారికి సహాయం చేసేందుకు రవాణా సదుపాయాలు లేకపోవడంతో గ్రామాన్ని చేరు కునేందుకు రెండు రోజుల సమయం పట్టింది.

మారుమూల ప్రాంతంలో ఉన్న కుర్రేగడ్ వాసులకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడం కష్టమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వారికి  వైద్యం,నీటి ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టం కావడంతో   మైదాన ప్రాంతాలకు తరలించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.

పకృతి ఒడిలో తరతరాలుగా అడవి తల్లిని నమ్ముకుని  హాయిగా బ్రతికే ఆదివాసులు అడవి నుండి బయటికి వచ్చేందుకు ససేమిరా అన్నారు. తమకు నీటి సదుపాయం కోసం ఒక బోరుబావు వేస్తే  ఇక్కడే బ్రతుకు తామని ఆదివాసులు అధికారులను వేడుకున్నారు. అప్పటి అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు  వారి వేదనలను పట్టించుకోకుండా మైదాన ప్రాంతంలో మీకు జీవన ఉపాధి కల్పించి అన్ని సదుపాయాలు కల్పిస్తామని నమ్మబలికి బలవంతంగా అడవి నుండి బయటకు తీసుకు వచ్చారు.

కుర్రేగడ్ ఆదివాసులను అడవి నుండి బయటికి తెచ్చి నేటికీ 13 ఏళ్లు గడుస్తున్నా అప్పటి హామీలలో ఒకటి కూడా  నెరవేర్చకుండా అమాయక ఆదివాసి కుటుంబాలను గాలికి వదిలేసారు. సాగు భూమి లేక, తినేందుకు తిండి లేక, కూలి పనులు దొరకక గిరిజన కుటుంబాలు పస్తులతో జీవనం సాగిస్తున్నాయి. హాయిగా అడవి తల్లి నమ్ముకుని జీవించిన తమ పరిస్థితి 'నీటి నుండి తీసి ఒడ్డున వేసిన చేప పిల్లల చందంగా' తయారైందని కుర్రెఘడ్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర వలస పాలకులపై కొట్లాడు తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల తెరాస పాలనలో కూడా తమకు న్యాయం జరగడం లేదనీ తమను పట్టించుకునే వారే లేరని గ్రామస్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

 ప్రస్తుత ఎన్నికల సందర్భంగా దశాబ్దాలుగా  తమ ఓటు హక్కును విధిగా వినియోగించు కుని ప్రజాస్వామ్య ప్రతీకలుగా నిలిచిన కుర్రేగడ్ ఆదివాసుల దీనగాధపై  Scv News అందిస్తున్న ప్రత్యేక కథనం...

అది మే నెల 2010 సంవత్సరం మండు వేసవికాలం. మైదాన ప్రాంతాల్లోనే తాగునీటి కటకటలు ఉన్న కాలం. మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు తాగునీటి సదుపాయం కల్పించాలని ఎన్నో ఏళ్లుగా  అధికారు లకు మొరపెట్టు కుంటున్నారు. అధికార యంత్రాంగం నిలువెత్తు నిర్లక్ష్యంతో పూర్తి బాధ్యత రాహిత్యంతో వ్యవహరించడంతో సంపూర్ణ ఆయుర్దాయంతో జీవితాన్ని గడపాల్సిన ఆదివాసుల్ని అర్థయుషుల్ని చేసింది. గ్రామంలోని నీటి బావుల్లో తాగునీరు ఇంకిపోవడంతో కలుషిత నీరు తాగి అతిసార వ్యాధి బారినపడి  కుర్రేగాడ్ గ్రామంలోని  వల్క లక్ష్మి ( 25), కురుసింగా పాలు బాయ్ ( 28), ఆత్రం లచ్చు బాయ్( 30),లతోపాటు  చిన్నారులు కురిసింగ మోహన్ (3), వల్కా శంకర్( 2) లు మృత్యువాత పడ్డారు. గ్రామంలో నీరు లేక అప్పటికీ 50 పశువుల వరకు మృతి చెందాయి. ఈ ఘటన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం అయింది.

ఆదివాసుల మృతి అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వంలో కలకలం రేపింది. జిల్లా అధికార యంత్రాంగమంతా  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న కుర్రేగాడ్ గ్రామానికి  ప్రభుత్వ యంత్రాంగమంతా  సహాయ సహకారాలు అందించేందుకు తరలి వెళ్ళింది...

అప్పటి కుర్రేగడ్  గిరిజన  గూడెం పరిస్థితి ఇలా ఉండేది...

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం  సోనాపూర్ పంచాయతీలోని  దట్టమైన అడవులు కొండల మీద మండల కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కుర్రేగడ్ గ్రామం ఉండేది. కుర్రే గడ్ వాసులు సోనాపూర్ పంచాయతీ కేంద్రానికి రేషన్ బియ్యానికి రావాలన్నా, ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రావాలన్నా  దట్టమైన అడవులు కొండలు దిగి కాలినడకన  రావాల్సిందే. అత్యవసరమైన పరిస్థితిలో తప్ప మండల కేంద్రానికి వారు వచ్చేవారు కాదు. కాసిపేట మండల కేంద్రం నుండి ఆ గ్రామానికి వెళ్లాలంటే  గట్రావ్ పెళ్లి గ్రామం నుంచి   దట్టమైన అడవుల గుండా ఆరు కొండలు ఎక్కి అందులో పెద్దదైన 120 మీటర్ల ఎత్తు ఉన్న  లోహి భీమన్న కొండ  ఎక్కి  కిందికి దిగితే  కుర్రేగడ్ గ్రామం కనపడేది. ఐదేళ్ల కి ఒకసారి ఎన్నికల సమయంలో పోలింగ్ చిట్టీలు పంపిణీ చేసేందుకు మాత్రమే గ్రామ రెవెన్యూ సహాయకులు ఆ గ్రామానికి వెళ్లేవారు. మరెప్పుడు కూడా ఆ గ్రామాన్ని సందర్శించిన ప్రభుత్వ అధికారులు ఎవరూ ఉండేవారు కాదు.

కుర్రేగాడ్ గ్రామం కొండమీద సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో సహజ సిద్ధంగా ఏర్పడిన సారవంతమైన నల్ల రేగడి భూమి ఉంది. ఈ భూమిని ఆధారంగా వ్యవసాయం చేసుకుంటూ  నైజాం కాలం నుండి కుర్రేగడ్ గ్రామం ఉండేది. అప్పట్లో విష జ్వరాలు సోకి  గిరిజనులు మృతి చెందడంతో గ్రామం ఖాళీ చేసి వారంతా కాసిపేట,తిర్యాని మండలాలకు తరలి వెళ్లారు. తరువాత 1995లో  అక్కడ సారవంతమైన భూములు ఉండి అన్ని రకాల పంటలు పండడంతో కొంతమంది గిరిజనులు అక్కడే తమకు జీవనోపాధి లభిస్తుందని  కుర్రేగడ్ గ్రామానికి తరలి వెళ్లారు.

కాసిపేట తిర్యాని మండలాలకు చెందిన రొంపేల్లి,చిన్నగుడెం, దొడ్డిగూడెం, సోనాపూర్, గడ్ పూర్  గ్రామాలకు చెందిన గిరిజనులు తరలి వెళ్లి స్థిర నివాసం ఏర్పరచు కొని  పోడు వ్యవసాయం ప్రారంభించారు. 2010 మేలో  గ్రామం ఖాళీ చేసే సమయానికి   గోండు గిరిజన తెగకు చెందిన 18 కుటుంబాలు 70 మంది గిరిజను లు నివసిస్తున్నారు. 500 ఎకరాల నల్ల రేగడి భూమిలో  సుమారు 300 ఎకరాల వరకు అడవి నరికి ఒక్కొక్కరు 10 నుండి 20 ఎకరాల వరకు పోడు వ్యవసాయం చేసుకునేవారు. వారిలో కొందరికి అటవీ హక్కుల చట్టం కింద ప్రభుత్వం పట్టాలు కూడా పంపిణీ చేసింది. ఆ భూములపై మంచిరాల సహకార బ్యాంకు నుండి కూడా రుణాలు పొందేవారు. ఆ భూముల్లో వర్షాధారంగా పెసర, కంది, జొన్న మొక్కజొన్న, ఆముదము, పత్తి చిన్న చిన్న కుంటలు తవ్వుకొని దాని కింద వరి పంట సాగు చేసుకుని జీవనం సాగించే వారు.పండిన పంటలను ఎడ్ల బండ్ల ద్వారా మైదాన ప్రాంతాలైన దండేపల్లి, తిర్యాని,కాసిపేట మండలాల  గ్రామాలకు తరలించి వారసంతల్లో విక్రయించి నిత్యవసర వస్తువులు తీసుకుని వెళ్లి ఏ లోటు లేకుండా గిరిజన కుటుంబాలు హాయిగా జీవనం సాగించేవారు.

ప్రతి ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటును వినియోగించిన  ప్రజాస్వామ్య ప్రతీకలు కుర్రేగడ్  గడ్ వాసులు . 

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఆదివాసి గిరిజనులకు ఎనలేని విశ్వాసం ఉండేది. పట్టణ ప్రాంతంలో తమ ఇంటి పక్కనే పోలింగ్ కేంద్రం ఉన్న ఓటు వేసేందుకు బద్దకిస్తున్న పట్టణవాసుల కంటే ఆదివాసులు ఎన్నో రేట్లు నయం. తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు ఒకరోజు ముందే కాలినడకన సోనాపూర్ పంచాయతీ పరిధిలోని తమ బంధువుల ఇండ్లకు చేరుకుని బస చేసేవారు. తెల్లవారుజామున మొదట పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించు కుని తిరిగి తమ గ్రామానికి వెళ్లేవారు. ప్రతి ఏటా తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్న  అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం,కాంగ్రెస్ ప్రభుత్వాలు వారి అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదని అసంతృప్తి ఆ గిరిజనులో ఉండేది.

తమ గ్రామ అభివృద్ధికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం జన్మభూమి గ్రామసభల్లో ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించిన పట్టించుకునే వారు కాదు. తాగునీటి కోసం టిడిపి హాయంలో జన్మభూమి గ్రామ సభలో ఇచ్చిన వినతి మేరకు  2000 సంవత్సరంలో అప్పుడు 40 వేల నిధులు మంజూరు చేశారు.  గ్రామంలో మంచినీటి బావిని తవ్వే స్థలాన్ని చూసేందుకు రెవెన్యూ అధికారులు వెళ్లేందుకు ఎన్నో  ఇబ్బందులు పడ్డారు. చివరకు మంచినీటి బావి తవ్వకం ప్రారంభించి  20 అడుగుల  లోతులో బండ పడడంతో పనులు  నిలిపి వేశారు. మళ్లీ 2008 సంవత్సరంలో బావి తవ్వడం కోసం 80,000 నిధులు మంజూరయ్యాయి. అప్పటి సోనాపూర్ సర్పంచి పెంద్రం రాజు బావిని తవ్వించగా 30 అడుగుల లోతులో నీరు పడింది. ఆ బావిలో వర్షాకాలంలో నీరు ఉండి మార్చిలోగానే  ఎండిపోయేది. గ్రామస్తులంతా అడవిలోని సిర్పూర్ పేపర్ మిల్లు బావి నీటిపైనే ఆధారపడి ఎడ్ల బండ్ల ద్వారా నీటిని తరలించుకుని జీవనం సాగించేవారు. మండు  వేసవిలో అది కూడా ఎండిపోవడం తో కలుషిత నీరు తాగి అతిసార వ్యాధి బారిన పడి ఐదుగురు ఆదివాసులు మృతి చెందారు.  

తాగునీటి సమస్య పరిష్కరించలేక గ్రామాన్ని తరలించిన అధికార యంత్రాంగం.

కుర్రే ఘడ్  గ్రామంలో కలుషిత నీరు తాగి గిరిజనులు మృతి చెందిన విషయం 2010 మే 10న  అప్పటి ఎమ్మెల్యే గుండా మల్లేష్ పత్రికలకు వెల్లడించడంతో విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. జిల్లా యంత్రాంగమంతా హుటాహుటిన రెండు రోజులకు అతి కష్టం మీద కుర్రేగడ్ గ్రామానికి వెళ్లి వైద్య సహాయాలు అందించింది. మారుమూల గ్రామంలో ప్రభుత్వ సిబ్బంది వైద్య సదుపాయం అందించడం కష్టతరంగా మారిందని వీరిని మైదాన ప్రాంతాలకు తరలించి సహాయ సహకారాలు అందించాలని  ప్రభుత్వ సిబ్బంది జిల్లా యంత్రాంగాని కి  నివేదిక ఇచ్చారు. తాము తమ కన్నతల్లి లాంటి అడవిని విడిచి ఎక్కడికి రామని వ్యాధులతో ఇక్కడే మరణించిన సరేనని మొరాయించారు .గ్రామంలో మంచినీటి బావిని లేదా  బోర్ వెల్ వేయిస్తే తమ భూముల్లో వ్యవసాయం చేసుకొని హాయిగా బ్రతుకుతామని కుర్రేగడ్ వాసులు  అధికారులను వేడుకున్న వినలేదు .  అప్పటి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీవో సుజాత శర్మలు అప్పటి బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండ మల్లేష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పెద్దపల్లి ఎంపీ వివేక్, ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, జడ్పీ చైర్మన్ గణపతి  గిరిజన సంఘాల నాయకులతో గ్రామస్తులతో మాట్లాడి అన్ని రకాల సహాయం సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

- అప్పుడు కుర్రేగడ్ గ్రామ గిరిజనులకు ప్రజా ప్రతినిధులు  అధికారులు ఇచ్చిన హామీలు ఇవి..

1) కుర్రే గడ్ వాసులందరికీ అందరికీ ఒకే దగ్గర కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి పంపిణీ ,  వ్యవసాయం చేసుకునేందుకు ఎడ్ల జతలు ఇవ్వడం.

2) అన్ని కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం.

3) స్వయం ఉపాధి పొందేందుకు దుకాణాల కోసం,కాయగూరల సాగుకు, పాడి పరిశ్రమ ఏర్పాటుకు ఐకెపి నుండి రుణాలు ఇప్పించడం.

4) గ్రామానికి వెళ్లే రహదారి ని గ్రామంలో  సిమెంటు రోడ్లను నిర్మించడం.

5) కాలనీలో విద్యార్థులకు విద్యా బోధన కోసం ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయడం.

6) కాలనీలో విద్యుత్ సౌకర్యంతో పాటు రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేయడం.

జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల  మాటలు నమ్మిన కురేగడ్ వాసులు గ్రామాన్ని ఖాళీ  చేసేందుకు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్  అడవిలోకి లారీలను పంపి  గ్రామాన్ని ఖాళీ చేయించి గిరిజన కుటుంబాలన్నింటినీ  మైదాన ప్రాంతానికి తీసుకువచ్చారు. కొన్ని కుటుంబాలు కాసిపేట, తిర్యాని మండలంలోని తమ బంధువుల ఇంటికి వెళ్ళగా ఉన్నవారిని  మండలంలోని మలకపల్లి గిరిజన ఆశ్రమోన్నత  పాఠశాలకు తరలించారు. విద్యార్థులకు వేసవి సెలవులు ఉండడంతో తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. నెల రోజులు ఆశ్రమ పాఠశాలలో వారికివసతి కల్పించి అప్పటి ఆర్డీవో సత్తయ్య, తాసిల్దార్ సల్మాన్ రాజు లు యోగక్షేమాలు చూశారు.రెవెన్యూ అధికారులు నెలరోజుల తరువాత లక్ష్మిపూర్ గ్రామ శివారులో నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి చదును చేసి గ్రామాన్ని ఏర్పాటు చేశారు. 18 కుటుంబాలలో ఐదు కుటుంబాలు వేరే ప్రాంతానికి తరలి వెళ్లడంతో 13 కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు గుంటల చొప్పున ఇంటి స్థలాలను కేటాయించారు. ఇంటి నిర్మాణాలు పూర్తయింతవరకు  తాత్కాలిక షెడ్లను నిర్మించి  అప్పటి ఎంపీ వివేక్  విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రేకులను కప్పి ఆశ్రయం కల్పించారు. మల్కపల్లి గిరిజన  ఆశ్రమ పాఠశాల నుండి గిరిజన కుటుంబాలను లక్ష్మీపూర్ పునరావాస గ్రామానికి  తరలించారు.

లక్ష్మీపూర్ పునరావాస గ్రామంలో  కుర్రెఘడ్ వాసుల అవస్థలు.

కుర్రేగడ్ వాసులను అధికారులు లక్షింపూర్ పునరావాస గ్రామానికి తరలించిన తరువాత అధికారులు ప్రజాప్రతినిధులు వారి యోగక్షేమా లను మరిచిపోయారు.గ్రామంలో విద్యుత్ సదుపాయం రక్షిత మంచినీటి మాత్రమే ఏర్పాటు చేసి మిగతా హామీలను గాలికి వదిలేశారు. గ్రామంలోని 13 కుటుంబాలకు 10 ఇందిరమ్మ ఇండ్లను మాత్రమే మంజూరు చేయించారు. అవి కూడా  గిరిజన కుటుంబాలకు చాలీచాలని చిన్న   ఒక్క గది నిర్మించి ఇచ్చారు. వాటికి కూడా ఇప్పటివరకు ప్లాస్టరింగ్ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

 18 కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున 90 ఎకరాల భూమి పంపిణీ చేస్తానన్న రెవెన్యూ అధికారులు కేవలం 13 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. వెంకటాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిని  వల్క రాము, కురిసింగ మాధవరావు, చిక్రం లచ్చు, వాల్క అంబారావు, సిడం శంకర్,  ఆత్రం బాధిరావు, వల్క మూతిరామ్, లకు కొందరికి రెండు ఎకరాలు మరికొందరికి ఎకరం చొప్పున పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. మీ మిగతా క కుర్రే గడ్ బాధిత ఆదివాసులకు ఇప్పటివరకు గుంట భూమి  చేయలేదు. భూమి అందని పదిమంది బాధిత  గిరిజనులలో  కుర్సింగా భూదే శ్యాం, కుర్సింగ ఇస్రు, ఆత్రం దసరు, కురిసింగ సురేందర్, కురిసింగ లాలు, సిడం సూరు, వల్క జ్యోతిరావు, పెంద్రం  భారీక్ రావు,కురిసింగ ధరుంబాయి, కురిసింగ నాగురావు లు ఉన్నారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత  కూడా వారికి అన్యాయమే జరిగింది.

ఆంధ్ర వలసవాదుల పాలన నుండి విముక్తి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా కుర్రేగడ్ వాసులకు తీవ్ర అన్యాయమే జరిగింది. 10 ఏళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామంలో కనీస సదుపాయాలు కల్పించలేదు. వెంకటాపూర్ ఆర్ అండ్ బి రోడ్డు నుండి గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో చిన్న కాలువ ఉంది దానిపై  కల్వర్టు నిర్మించాలని, గ్రామంలో సిమెంటు రోడ్డు వేయాలని, పిల్లల విద్యా బోధన కోసం పాఠశాల ఏర్పాటు చేయాలని కోరిన పట్టించుకోలేదు. అడవి నుండి మైదాన ప్రాంతానికి తీసుకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీల్లో భాగంగా తమకు భూమి పంపిణీ చేయాలని వ్యవసాయ రుణాలు ఇప్పించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ను ఎన్నో సార్లు కోరిన తమను పట్టించుకోలేదని గ్రామ పటేల్ కుర్షింగా భూదేశాం వాపోయాడు. మైదాన ప్రాంతంలోకి వస్తే మా జీవితాలు బాగుపడతాయని మాకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తారని ఆశపడి కన్నతల్లి లాంటి వాడిని విడిచి వచ్చినందుకు తమకు తీవ్ర అన్యాయం చేశారని గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుర్రేగడ్ లో ఆదివాసుల భూములను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ. ఆ భూముల్లో హరితహారం పేరిట మొక్కల పెంపకం. 

 కుర్రేఘడ్ గ్రామాన్ని  ఖాళీ చేసిన తర్వాత అక్కడి 350 ఎకరాలు గిరిజనులు సాగు చేసుకున్న పంట భూములను అటవీశాఖ స్వాధీనం చేసుకుని హరితహారం పేరిట మొక్కలను పెంచుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా ప్రైవేటు కంపెనీ అటవీ భూమిని తీసుకుంటే దానికి బదులుగా వేరే ప్రాంతాలలో భూమిని కొని అటవీ శాఖకు అప్పచెప్తుంది. భూముల్లో అటవీ శాఖ మొక్కలను పెంచుతుంది. దాని ప్రకారమే తమ భూములు స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ  అదే భూమిని ఇక్కడ తమకు పంపిణీ చేసేలా చూడాలని గత 13 ఏళ్లుగా  జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయాల చుట్టూ తిరిగిన ఎవరూ పట్టించు కోవడంలేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో  వచ్చే ఎన్నికల్లో గెలిచే ఎమ్మెల్యే అయినా  తమకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకొని జీవన ఉపాధి కోసం అప్పటి హామీలో భాగంగా ఐదు ఎకరాల భూమిని పంపిణీ చేసి ఇతర డిమాండ్లు కూడా నెరవేర్చి తమ జీవితాలను మెరుగు పరచాలని  అమాయక ఆదివాసి లు వేడుకుంటున్నారు.

 నాగరిక ప్రపంచంలో ఉన్న మేధావి వర్గం, ప్రజా సంఘాల నాయకులు   మానవతా దృక్పథంతో  అడవిని విడిచి మైదాన ప్రాంతాలకు వచ్చే ఆదివాసులను అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తామని  ప్రభుత్వాల మోసపరిత విధానాలను ఎండగట్టి  కుర్రేగడ్ వాసులకు న్యాయం జరిగేందుకు ఉద్యమించాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ' 'Scv News ' కోరుతుంది.

 ఆదుకుంటారని నమ్మితే మోసం చేశారు.

- కురిసింగా భూదే శ్యామ్.

 కురిసింగా భూదేశ్యం, కూపర్ లింగు ఆలయ పూజారి.

అడవి నుండి బయటికి వస్తే ఆదుకుంటామని చెప్పి పోడు వ్యవసాయం చేసుకుంటూ దట్టమైన అడవి కొండల మీద హాయిగా బ్రతికిన మమ్ములను మైదాన ప్రాంతానికి తీసుకువచ్చి అధికారులు నాయకులు మోసం చేశారు. 13 ఏళ్లు గడుస్తున్న అప్పుడు మాకు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చ లేదు. అడవుల నుంచి వచ్చి ప్రతి ఎన్నికల్లో ఓటు వేసేవారు. కానీ తమకు ప్రభుత్వాలు న్యాయం చేయలేదు, తీవ్ర అన్యాయం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేసేలా చూడాలి.

 కూలి పనులు  దొరకక పస్తులతో గడుపుతున్నాము.

- కురిసింగా ఇశ్రు.

 కుర్షింగా ఇస్రు, కుర్రెగడ్ గ్రామంలో విద్యా వాలంటీ ర్ 

అడివిలోని కుర్రేగాడు గ్రామంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరం 15 నుండి 20 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతికే వాళ్ళం. నేను విద్యా వాలంటరీగా పని చేస్తూ పిల్లలకు విద్యాబోధన చేసేవాన్ని. మైదాన ప్రాంతంలో సకల సదుపాయాలు కల్పిస్తామని అడివి నుండి తీసుకువచ్చి ఇలాంటి సదుపాయాలు కల్పించకుండా తమకు తీవ్ర అన్యాయం చేశారు. భూములు పంపిణీ చేయక ఉపాధి కల్పించక పోవడంతో తమ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమను ఆదుకోవాలి.

 కుర్రే గాడ్ వాసులకు జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నించాలి.

కొమ్ముల బాపు, నాయక్ పోడ్ సేవా   సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.


దట్టమైన అడవిలో నివసించే ఆదివాసులకు ప్రభుత్వపరంగా సహాయం చేయడం కష్టమవుతుందని అధికార యంత్రాంగం మోసపు మాటలు చెప్పి కుర్రేగడ్ గిరిజనులను మైదాన ప్రాంతం తీసుకువచ్చి పట్టించుకోకపోవడం దారుణం.

 13 ఏళ్లు గడుస్తున్నా అడవిలో నుండి తీసుకువచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల వైఫల్యాలకు నిదర్శనం.

 కుర్రేఘాట్ గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు మండలంలోని గిరిజన సంఘాలు,ప్రజా సంఘాలు వారికి మద్దతు ఇచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.