విష జ్వరాలతో గిరిజనగూడాల్లో తల్లడిల్లుతున్న ఆదివాసి కుటుంబాలు.
- గిరిజన గూడాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాలు అందక గిరిజనులు అవస్థలు.
- ఒక్క రోజు ఒక గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న మండల వైద్యశాఖ.
-- డెంగీ జ్వరాలని ప్రైవేట్ ల్యాబ్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని జ్వరాలు లేవని వైద్యాధికారి అనడం పట్ల గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం.
- ఈరోజు గిరిజన గూడాలలో సిపిఎం బృందం, గిరిజన సంఘాల నాయకులు ఎస్సివి న్యూస్ క్షేత్రస్థాయి పర్యటన.
-- గిరిజన గూడాలలో మంచాన పడి జ్వరాలతో అవస్థలు పడుతున్న ఆదివాసీలు.
![]() |
| పెద్దగూడెం, పెద్దాపూర్ గ్రామాల్లో విష జ్వరా లతో మంచానపడ్డ ఆదివాసిలు. |
![]() |
| విష జ్వరాలతో బాధపడుతున్న బాధిత గిరిజనులను పరామర్శిస్తున్న సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సంకే రవి, గిరిజన సంఘాల నాయకులు. |
![]() |
| పారిశుద్ధ్యం లోపించిన గిరిజన గూడాలలో పర్యటిస్తున్న గిరిజన సంఘాల నాయకులు |
Scv News Kasipet:--
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సోనాపూర్, ఘట్రావుపల్లి,వెంకటాపూర్, దేవాపూర్ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలలో విష జ్వరాలతో గిరిజనులు తల్లడిల్లి పోతున్నారు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో గిరిజనులు విష జ్వరాలతో మంచాన పడి అవస్థలు పడుతున్నారు. గ్రామాలలోకి వైద్య సిబ్బంది వచ్చి పరీక్షలు చేయడం లేదని జ్వరంతో బాధపడుతున్న గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విష జ్వరంతో సోనాపూర్ పంచాయతీ పరిధిలోని దొడ్డి గూడ గ్రామానికి చెందిన కుడిమేత జలపతి అనే బాలుడు ఇటీవల మృతి చెందాడు. ఈ విషయం మీడియాలో రావడంతో బుధవారం మండల విద్యాధికారి రవి కిరణ్ ఆధ్వర్యంలో దొడ్డిగూడెం నాయకపు గూడెం లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరాలతో బాధపడుతున్న వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో విష జ్వరాలు లేవని ప్రైవేట్ ల్యాబ్ లో కొంతమంది డెంగు మలేరియా జ్వరాలను రిపోర్ట్ ఇస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గిరిజన గూడాలలోని జ్వరాల విషయమై తెలుసుకునేందుకు మంచిర్యాల జిల్లా సిపిఎం ప్రధాన కార్యదర్శి సంకే రవి ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్, సిపిఎం మండలం నాయకురాలు జంగుబాయి ఆధ్వర్యంలో మండల ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు కొమ్ముల బాపు, కనకరాజు, కురిసింగ నాగేశ్వరరావు లతోపాటు సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా SCV News గిరిజన గూడాలలో క్షేత్రస్థాయిలో పర్యటించింది.
సిపిఎం బృందం రొట్టె పెళ్లి పంచాయతీలోని చౌడిగూడెం,రొట్టె పెళ్లి వెంకటాపూర్ పంచాయతీలోని లక్ష్మీపూర్, కోలం గూడెం సోనాపూర్ పంచాయతీలోని దొడ్డిగూడెం, జెండా గూడెం నాయక గూడెం, గట్రావ్ పెళ్లి, దేవాపూర్ పంచాయతీలోని పెద్దగూడెం, పెద్దాపూర్ నాయక గూడాలను సందర్శించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ ప్రతిగూడెంలో ఐదు నుండి పదిమంది విష జ్వరాలతో బాధపడుతున్నారని అన్నారు. మండల వైద్య బృందాలు నామమాత్రంగా గ్రామాల్లో తిరుగుతున్నాయని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రక్త పరీక్షలు చేయడం లేదని అన్నారు. అమాయక ఆదివాసీలు గ్రామాల్లో తిరిగి ఆర్ఎంపీల దగ్గర వైద్యం చేసుకుంటున్నారని అన్నారు.
ఆదివాసి నాయక్ కోడ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ దొడ్డిగూడెం లో విష జ్వరంతో బాలుడు మరణిస్తే మండల వైద్యాధికారి రవి కిరణ్ గిరిజన గూడాలలో జ్వరాలు లేవని జ్వరంతో బాలుడు చనిపోలేదని వేరే కారణం వల్ల చనిపోయాడని అనడం విచార కరమన్నారు. గ్రామాల్లో ఏఎన్ఎం ఆశా వర్కర్లు ప్రతిరోజు వివిధ గుడాల సందర్శించి జ్వరాలను అరికట్టాలని అన్నారు.
తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కనకరాజు మాట్లాడుతూ వైద్యాధికారి గిరిజన గూడాలలో విష జ్వరాలు లేవని ప్రైవేట్ ల్యాబ్ల వాళ్ళు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరింపులు చేయడం సరైంది కాదన్నారు.
దేవాపూర్ గిరిజన సొసైటీ గౌరవ అధ్యక్షుడు కురిసింగ నాగేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనులు విష జ్వరాలతో ఇబ్బందులకు గురై తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాలను అరికట్టాలని కోరారు.
గిరిజన సంఘాల నాయకులు సందర్శించిన దేవాపూర్ పంచాయతీలోని పెద్ద గూడెలో మడావి భారతి, కురిసింగ తూర్పు భాయి,మడవి జంగుబాయి, కనాక జ్యోతిలు జ్వరాలతో మంచాన పడి ఉన్నారు. శ్రీరామ్ జైనుబాయి ఇంట్లో అతని కుమారులు శ్రీరాం సంతోషం, కిరణ్ లు జ్వరంతో బాధపడు తున్నారు. విష జ్వరంతో సీడం బొజ్జు బాయ్ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మంచిరాల ఆసుపత్రిలో చేరి ప్రాణాలు దక్కించుకుంది. పెద్దాపూర్ కొలం గూడెంలో గ్రామ గిరిజన నాయకుడు ఆత్రం భీమ్రావు టేకం రాజు, అతని కుమారుడు డిగ్రీ చదివే శ్రీనివాస్ గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతూ మంచాన పడ్డారు. పెద్దాపూర్ గోండుగూడెంలో పెంద్రం చిత్రు అనే వృద్ధుడు గత పది రోజులుగా విష జ్వరంతో బాధపడు తూ ఆందోళనకర పరిస్థితిలో మంచాన పడి ఉన్నాడు. జిల్లా వైద్యాధికారి స్పందించి మండల వైద్య బృందాలు గిరిజన గూడాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాలను అరికట్టాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు. కార పార్టీ మండల ప్రజా ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించి గిరిజన గూడా లకు వైద్య బృందాలను పంపించాలని గిరిజనులు కోరుతున్నారు.








