దొరతనాన్ని ఎదిరించి బహుజన వర్గాలకు అండగా ఉన్న ప్రజా నాయకుడు అమరుడు బన్న ఆశాలు చిరస్మరణీయులు.
-- సంస్మరణ సభలో కొనియాడిన వక్తలు.
కాసిపేట మండలంలోని భూస్వామ్య వర్గాల అరాచకాలను ఎదిరించి బహుజన వర్గాలకు ఏడు దశాబ్దాలుగా సేవలందించి గ్రామాల అభివృద్ధికి కృషిచేసిన ప్రజా నాయకుడు అమరుడు బన్న ఆశాలు సంతాప సభ బుధవారం అతని స్వగృహంలో జరిగింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు అతడు చేసిన ప్రజాసేవను గ్రామాల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.
ఈసందర్భంగా సిపిఐ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ బన్న ఆశాలు కాసిపేట భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి బహుజన వర్గాలకు అండగా నిలిచిన పోరాటయోధుడని కొనియాడారు. ప్రజల కోసం జీవించి గ్రామాల అభివృద్ధికి జీవిత కాలం కృషి చేసిన ప్రజా నాయకుడు అని అన్నారు.
బెల్లంపల్లి నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి ఎమాజీ మాట్లాడుతూ బన్న ఆశాలు తన జీవిత కాల మంతా ప్రజల కోసం పనిచేసిన ప్రజా నాయకుడని కొనియాడారు. ప్రజల కోసం జీవించిన వ్యక్తిని ప్రజలు ఎప్పుడో తమ గుండెల్లో దాచుకుంటారని అన్నారు. టిఆర్ఎస్ నాయకుడు బండి సదానందం మాట్లాడుతూ బన్నా ఆశాలు మచ్చలేని ప్రజా నాయకుడు అని కొనియాడారు. నీటి తరం నాయకులకు ఆదర్శప్రాయుడని అన్నారు.
మండల ఐకాస కన్వీనర్ సిలోజి మురళి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఏడు రోజులు అమరణ నిరాహార దీక్ష చేసిన మహా నాయకుడు అని అన్నారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపిన ఉద్యమకారుడు అని అన్నారు.
సిపిఐ మండల కార్యదర్శి దాగంమల్లేష్ మాట్లాడుతూ బన్న ఆశాలు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ గ్రామ అభివృద్ధి కి విద్య అభివృద్ధి కృషి చేసిన నాయకుడని అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం ఆలోచించి వారి సమస్యలు పరిష్కరించేందుకు ముందున్న నాయకుడు అని అన్నారు.
సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడు తూ బన్న ఆశాలు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి నిరంతరం ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేశాడన్నారు. మండలంలోని ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపిన ప్రజా నాయకుడని కొనియాడారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ. కరడు కట్టిన భూస్వాముల నిలయమైన దొరల కాసిపేటలో బహుజన వర్గాల ప్రజలు వారి ఇండ్ల ముందు చెప్పులు వేసుకుని నడిచే స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని ఆ రోజుల్లో దొరలను ఎదిరించి రాజ్యాధికారం చేసిన బహుజన నాయకుడు బన్న ఆశాలు అని అన్నారు. బహుజన వర్గాల అండగా ఉన్న ప్రజా నాయకుడు బన్న ఆశాలు లేని లోటు మండల పేద వర్గాలకు తీరనిలోటు అని అన్నారు.
బన్న ఆశాలు చేసిన అభివృద్ధి, సేవల గురించి స్థానిక నాయకులు గోదారుల శంకర్, రామటంకి వాసుదేవ్, సామల లక్ష్మణ్, కారు కూరి లక్ష్మణ్, పట్టెం రాజేశం, తదితరులు మాట్లాడారు.
సంతాప సభకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ అధ్యక్షత వహించి బన్న ఆశాలు మండలాని కి చేసిన సేవలను అభివృద్ధి పనులను అతనితో ఉన్న అనుబంధాలను వివరించారు. సంతాప సభకు ముందు బన్న ఆశాలు మృతికి ప్రజాసంఘాలు రాజకీయ పార్టీల నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.బన్నా ఆశాలు కుటుంబ సభ్యులతో అతని చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అమరుడు బన్న ఆశాలుకు ప్రముఖుల నివాళి.
బన్న ఆశాలు చిత్రపటానికి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, మంచిరాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, కాసిపేట మండల జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ రావు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, మాజీ డైరెక్టర్ వాసుదేవ్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రత్నం ప్రదీప్ ఎంపీటీసీలు పర్వతి మల్లేష్, మేరుగు శంకర్, భీమ్రావు లు ప్రజా సంఘాల నాయకులు పార్టీల నాయకులు నివాళులర్పించి పూలమాలలు వేశారు.










