మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సోనాపూర్ పంచాయతీలో హనుమాన్ భక్తులకు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో అన్నదానం.

 హనుమాన్ మాలదారులు దీక్ష సమయంలో ని నియమాలను ఎల్లప్పుడూ పాటించి ఆనందంగా జీవించాలి.

 - కొమ్ముల బాపు సాచైవే  ప్రధాన కార్యదర్శి.

 సోనాపూర్ హనుమాన్ భక్తులకు అన్నదానం చేస్తున్న సామాజిక చైతన్య వేదిక సభ్యులు.


Scv News Kasipet:--

హనుమాన్ మాల ధారణ చేసే భక్తులు ఎల్లప్పుడూ అదే దీక్ష నియమాలను పాటిస్తే కుటుంబాలన్నీ ఆనందంగా జీవిస్తాయని సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు అన్నారు.కాసిపేట మండలం సోనాపూర్ పంచాయతీ పరిధిలోని హనుమాన్ భక్తులకు ఈరోజు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. 


ఈ సందర్భంగా హనుమాన్ భక్తులనుదేశించి కొమ్ముల బాపు మాట్లాడుతూ చాలామంది భక్తులు దీక్ష విరమణ అనంతరం  పాత అలవాట్లకు మారడం వల్ల  వారితో పాటు కుటుంబాలు కూడా ఇబ్బందుల పాలు అవుతున్నాయని అన్నారు. దీక్షా సమయంలో తెల్లవారుజామున ఎంతో నిష్టతో లేచి పూజలు చేస్తూ శాఖాహార భోజనంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 41 రోజులు దీక్షలు చేయడం వల్ల తమతో పాటు  కుటుంబాలు కూడా ఆనందంగా గడుపు తున్నాయన్నారు. హనుమాన్ భక్తుల్లో మార్పు తీసుకురావాలని లక్ష్యంతో సామాజిక చైతన్య వేదిక ఈ కార్య క్రమం  చేపట్టిందన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలోని హనుమాన్ భక్తులు  మా యొక్క సూచనలను పాటించి కుటుంబాలతో ఆనందంగా గడపాలని సామాజిక చైతన్య వేదిక కోరుకుంటుందన్నారు.  


ఈ సందర్భంగా  స్థానిక ఆధ్యాత్మిక గురువు మురళి మహారాజ్ మాట్లాడుతూ  హనుమాన్ భక్తులంతా భక్తిశ్రద్ధలతో  41 రోజులు దీక్షలు తీసుకొని  దీక్షా నియమాలు పాటిస్తే  సంవత్సరం కాలం కుటుంబాలతో ఆనందంగా ఉంటారని అన్నారు. దీక్షలు చేయడం వల్ల మనుషుల్లో ఎంతో పరివర్తన కలిగి కుటుంబాలంతా ఆనందంగా జీవనం సాగిస్తాయి అన్నారు. దీక్ష పరులు  నియమ నిష్టలతో దీక్షలు కొనసాగించాలని కోరారు.


సామాజిక చైతన్య వేదిక ప్రధాన సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ హనుమాన్ భక్తులంతా ఎంతో దీక్షతో నియమాలు పాటిస్తూ రామ భజన చేస్తే ఎంతో మార్పు వస్తుందని అన్నారు. దీక్ష వల్ల తమ శరీర పరంగానే కాకుండా కుటుంబ పరంగా, సామాజిక పరంగా ఎంతో మార్పు సాధించి గ్రామాలలో గౌరవం పెరుగు తుందన్నారు. దీక్షలు చేపట్టే స్వాములు విధిగా ధ్యానం చేసి శక్తివంతులు కావాలని కోరారు. మండలంలోని వివిధ గ్రామాలలో హనుమాన్ దీక్షలు చేపట్టే భక్తులు భజనలు, భక్తి శ్రద్ధతో చేసే కార్యక్రమాల్లో సామాజిక చైతన్య వేదిక పాల్గొని ఆధ్యాత్మిక చైతన్యం కోసం కృషి చేస్తుందన్నారు.

సమావేశానికి ముందు సోనాపూర్ హనుమాన్ దేవాలయంలో ఆధ్యాత్మిక గురువు మురళి మహారాజ్ చే పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి గ్రామ సర్పంచి సుశీల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, పులాజి బాబా భక్తులు రాజన్న తదితరులు పాల్గొన్నారు.