చరిత్ర మరిచిన దళిత బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 313 వ వర్ధంతి.
Scv News Kasipet:--
భారతదేశ చరిత్రలో వేల ఏండ్ల మనువాదుల చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని పాతరేసి మూడు దశాబ్దాలుగా తెలంగాణను పరిపాలించిన బహుజన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 313 వ వర్ధంతి సందర్భంగా సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది...
భారతదేశంలో మనువాదుల చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం క్షత్రియులు మాత్రమే రాజ్యపాలన చేయాలి. ఈ దేశంలో గత రెండు వేల సంవత్సరాలుగా క్షత్రియ బ్రాహ్మణుల ఆధిపత్యంలోనే పరిపాలన సాగింది. మధ్య యుగాల్లో బహుజన వర్గాలలో కూడా వీరులు పుట్టుకు వచ్చి మనువాద సిద్ధాంతాన్ని పాతరేసి బహుజన రాజ్యాన్ని స్థాపించి రాజ్యపాలన చేసిన వారిలో మహారాష్ట్ర లో చత్రపతి శివాజీ, తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడులు చరిత్రలో సుస్థిరమైన స్థానం సాధించారు.
చదువు బ్రాహ్మణ వర్గం చేతిలో ఉండడం వల్ల భారతదేశ చరిత్రలో బహుజన చక్రవర్తులైన చత్రపతి శివాజీ, సర్వాయి పాపన్న అసలైన చరిత్ర వక్రీకరించబడింది. భవిష్యత్ తరాలకు తెలవకుండా మనువాద బ్రాహ్మణ వర్గం కుట్రలు చేసి వారి చరిత్రను కనుమరుగు చేశారు. ప్రజల గుండెల్లో నిలిచిన వారిని మాత్రం తమకు అనుకూలంగా మలుచుకుని ప్రచారం చేసుకున్నారు.
మహారాష్ట్రలో చత్రపతి శివాజీ గురించి అక్కడి ప్రజల్లో ఆధార అభిమానాలు ఉండడంవల్ల , బ్రాహ్మణ మనువాదులు శివాజీ చరిత్రను తమకు అనుకూలంగా మలచుకొని జన్మదిన, వర్ధంతి కార్యక్రమాలు నేడు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం 22 కోటలు నిర్మించి పై 30 సంవత్సరాలు నిరాటంకంగా బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసి స్వయం పాలన సాధించిన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర మాత్రం బహుజనులకు తెలియకుండా మనువాదులు అగ్ర వర్ణ చరిత్రకారులు కుట్రలు చేశారు.
బహుజన రాజ్యపాలన చేసిన యోధుల గురించి ఈ దేశంలోని 85% వున్నా బహుజనులు తెలుసుకుంటే వారి పోరాట స్ఫూర్తితో వీరులుగా ఎదిగితే తమకు ప్రమాదమని ముందే గ్రహించి మనువాద బ్రాహ్మణ వర్గం వారి చరిత్రను కనుమరుగు చేశారు. తెలంగాణలో పాపన్న గౌడ్ చరిత్ర ముందు తరాల బహుజనులకు తెలిస్తే అతని ఆదర్శంగా తీసుకుని రాజ్యాధికారం కోసం తిరగబడతారని అగ్రవర్ణాలు గ్రహించి ఉద్దేశపూర్వకంగానే అతన్ని చరిత్రలో బందీ పోటుగా చిత్రీకరించారు. అతడి రాజ్యాధికార చరిత్రను శిలా శాసనాలను, ఫోటోలను కూడా కనపడకుండా చేశారు. నేడు పాపన్న చరిత్రను జానపద కథల ద్వారా బుర్రకథలు సారథి కాల కథల ద్వారానే తెలంగాణ బహుజనులను తెలుసుకునే పరిస్థితి ఉంది.
భారతదేశంలోకి ఆంగ్లేయులు వచ్చిన తర్వాతనే ఈ దేశ బహుజన పోరాటయోధుల చరిత్ర లు వెలుగు చూసాయి..
మనువాద బ్రాహ్మణుల కుట్రల వల్ల ఈ దేశంలోని బహుజన చక్రవర్తుల చరిత్ర కనుమరుగైంది. భారతదేశంలోకి ఆంగ్లేయులు వచ్చిన తర్వాత 19 వ శతాబ్దం లో బహుజన పోరాట యోధులు అసలైన చరిత్ర బయటికి వచ్చింది.ఈ దేశంలో వేల ఏళ్లుగా విలసిల్లిన, సింధు నాగరికత గురించి, బౌద్ధ చరిత్ర, సామ్రాట్ అశోకుడి పాలన నుండి మొదలుకొని భారతదేశ సాంస్కృతిక విప్లవానికి వేగుచుక్కైన వేమన చరిత్ర, చత్రపతి శివాజీ, సర్వాయి పాపన్న ల అసలైన చరిత్రను మొత్తం ఆంగ్లేయులు బయటికి తీసి ఈ దేశ మూలవాసులైన బహుజన వర్గాలకు తెలిపారు. ఆంగ్లేయ చరిత్రకారులు గ్రామీణ ప్రాంతాలలో తిరిగి బహుజన పోరాట వీరుల చరిత్ర ప్రజల నోళ్లలో నానుతున్న పాటలు కథల ద్వారా తెలుసుకొని రికార్డు చేశారు. హరప్ప మొహం జాదారో తవ్వకాలతో సింధు నాగరికత, ప్రిన్సెస్ జోసెఫ్ కృషితో సామ్రాట్ అశోకుడు జీవిత చరిత్ర, సిపి బ్రౌన్ వల్ల వేమన పద్యాలు, సర్వాయి పాపన్న చరిత్ర బ్రిటిష్ చరిత్రకారుడు జెకె బోయర్ కృషి వల్ల బాహ్య ప్రపంచానికి తెలిసాయి.
సర్వాయి పాపన్న చరిత్రను వెలికి తీసిన బ్రిటిష్ చరిత్రకారుడు జె కే బోయర్ .
పాపన్న వీర చరిత్ర బ్రిటిష్ చరిత్రకారుడు జెకె బోయర్ తెలంగాణ జానపద కళారూపాలైన బుర్రకథలు సారథి కాల కథల ద్వారా తెలుసుకొని రికార్డు చేశారు. బహుజన మహావీరుడి పాపన్న వీర చరిత్రను, చిత్రపటాన్ని తయారుచేసి ఇంగ్లాండు లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో పెట్టాడు. ప్రపంచంలోని పోరాట యోధుల గురించి లండన్ లోని కేం బ్రిడ్జి యూనివర్సిటీ అతని వీర చరిత్రను గుర్తించి పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకానికి రివ్యూ రాసిన బ్రిటిష్ చరిత్రకారుడు ప్రొఫెసర్ రీఛార్జ్ పీటర్ భారతదేశంలో పాపన్న గొప్ప బహుజన పోరాటయోధుడు అని కొనియాడారు. భారతదేశంలో ఆరువందల ఏళ్ల క్రితం గొప్ప పోరాట వీరుల చరిత్రను వెలికి తీసి అందులో ఎనిమిది మంది వీరులలో సర్వాయి పాపన్న మొదటివాడుగా గుర్తించాడు. దీంతో పాపన్న గౌడ్ చరిత్ర మొట్టమొదటిసారి బయటికి వచ్చింది. ఇప్పటికీ తెలంగాణలో పాపన్న అసలైన చిత్రపటం లేదు. పాపన్న వీర చరిత్ర తెలుసుకొని ముగ్ధుడైన హైదరాబాద్ వాసి ఒకరు లండన్ లోని విక్టోరియా మ్యూజియంలో ని పాపన్న పెయింటింగ్ ను తీసుకువచ్చి ఇక్కడ ప్రదర్శించారు. దాన్ని ఆధారంగానే పాపన్న విగ్రహాలు తయారుచేసుకొని తెలంగాణ పల్లెల్లో గౌడ సంఘాలు నెలకొల్పుకుంటున్నాయి.
ఇన్నాళ్లకు పాపన్న చరిత్రను ప్రభుత్వం గుర్తించడం ఆనందదాయకం.
ఘనమైన చరిత్ర కలిగిన బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడును ఇన్నాళ్లకైనా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా చేయడం శుభ పరిణామం. దీంతోపాటు పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద తెలంగాణ ప్రభుత్వం నిర్మించి, పాపన్న అసలైన చరిత్రను పాఠ్యాంశాలలో చేర్పించి భవిష్యత్ తరాలకు తెలియజేసేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలి. బహుజన వర్గం అంతా సర్దార్ సర్వాయి పాపన్న వీర చరిత్రను తెలుసుకొని ఉద్యమించి బహుజన రాజ్యాన్ని ఏర్పాటుకు అన్ని వర్గాలంతా ఏకం అవ్వాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.

