కాసిపేట మండలంలో రాంజీ గోండు 163 వ వర్ధంతి కార్యక్రమం.
![]() |
| కొండాపూర్ చౌరస్తాలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో రాంజీ గొండు వర్ధంతి లో పాల్గొన్న గిరిజన నాయకులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో గిరిజన పోరాటయోధుడు రాంజీ గోండు 163 వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించారు. తుడుం దెబ్బ, నాయక్ పోడ్ సేవా సమితి నాయకులు రాంజీ గోండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కురిసింగ హనుమంతు మాట్లాడుతూ ఆదివాసి హక్కుల కోసం పోరాడిన గోండ్వానా రాజు రాంజీ గోండును బ్రిటిష్ ప్రభుత్వం కుట్రపూరితంగా పట్టుకొని ఉరి తీసిందన్నారు. రాంజీ గోండు తో పాటు అతని సైన్యంలోని వేయి మందిని నిర్మల్ సమీపంలోని మర్రి చెట్టుకు ఉరివేసిందని అన్నారు. రాంజీ గోండు పోరాట స్ఫూర్తితో గిరిజన యువత ఆదివాసి సమస్యలపై పోరాడాలని కోరారు.
నాయక్ పోడు సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు మాట్లాడుతూజల్ జంగల్ జమీన్ కోసం గోండ్వానా రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేసిన రాంజీ గోండును అటవీ సంపదను దోచుకునేందుకు ఉరితీసారన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడే అమరుడైన రాంజీ గోండు జీవిత చరిత్రను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలని అన్నారు.
తుడుం దెబ్బ విద్యార్థి విభాగం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కిషన్ మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం పోరాడి అమరుడైన రాంజీ గోండు జయంతి,వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య మాట్లాడుతూ ఆదివాసులు ఈ దేశ మూలవాసులని మూలవాసుల జీవిత చరిత్రలు, అమరవీరుల చరిత్రలు నేటి యువతరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అమరవీరుల జయంతి వర్ధంతిలో అన్ని కుల సంఘాలు గిరిజన బహుజన సంఘాలు కలిసి చేసుకుంటూ ఐక్యంగా ఉద్యమించాలన్నారు.
ఈ కార్యక్రమంలో నాయక్ పోడ్ సేవా సంఘం మండల సాంస్కృతిక కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్, మండల నాయకులు శ్రీకాంత్, అనిల్, భీమ్రావు తదితరులు పాల్గొన్నారు.





