భారతదేశంలో బహుజన వర్గాలకు పాఠశాలలు తెరిచిన తొలి గురువు మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి.
బ్రాహ్మణ మనువాద దోపిడిని బహుజన వర్గాలకు తెలిపిన మొట్టమొదటి మేధావి మహాత్మ జ్యోతిరావు పూలే.
- హిందూ పురాణాలలోని రాక్షస రాజులు రాక్షసులు అంతా ఈ దేశ మూలవాసులైన బహుజన ద్రావిడ చక్రవర్తులేనని గులాం గిరి ద్వారా వెలుగులోకి తెచ్చిన మేధావి.
- ఈ దేశంలో బహుజన వర్గాలకు మొదట పాఠశాలలు ప్రారంభించింది పూలే.
- మరాఠా వీరుడు చత్రపతి శివాజీ సమాధిని కనుగొని జయంతి ఉత్సవాలను మొదట ప్రారంభించింది పూలే.
మహాత్మ జ్యోతిరావు పూలే
Scv News Kasipet:--
' విద్య లేకపోవడం వల్ల వివేకం( జ్ఞానం )లేకుండా పోయింది.
వివేకం లేక పోవడం వల్ల నైతికత లేకుండా పోయింది.
నైతికత లేకపోవడం వల్ల ఐక్యమత్యం లేకుండాపోయింది. ఐకమత్యం లేకపోవడం వల్ల బలం లేకుండా పోయింది.
బలం లేక పోవడం వల్ల ఈ దేశంలోని శూద్ర,అతిశూద్ర వర్గాలని అణచివేయ
పడుతున్నాయని, ఈ అనార్ధాలు అన్నిటికీ మూలం విద్య లేకపోవడం వల్లనే 'అని 170 సంవత్సరాల క్రితం గుర్తించినవాడు మహాత్మ జ్యోతిరావు పూలే.
ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా భారతదేశంలో బ్రాహ్మణీయ మనువాద వర్గం మనుషులను నాలుగు వర్ణాలుగా విభజించి చాతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ,క్షత్రియ వైశ్యులకు శూద్రులు ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా సేవ చేయడమే కర్తవ్యం అని నిర్దేశించింది. శూద్ర వర్ణాలకు చదువు వస్తే ఎక్కడ జ్ఞానం వస్తుంధోనని విద్యాబోధనను నిషేధించి వేల సంవత్సరాలుగా జ్ఞానానికి దూరం చేసింది. బ్రాహ్మణీయ భావజాలాన్ని వ్యతిరేకించి సూద్ర,అతి శూద్ర వర్గాలకు మొట్టమొదటిసారి పాఠశాలలు తెరిచిన మహనీయుడు మహాత్మ జ్యోతిబా పూలే. జ్యోతిబాపూలే జన్మదిన సందర్భంగా అతడి జీవిత చరిత్ర, ఆయన చేసిన ఉద్యమాలు నేటి బహుజన వర్గాలు తెలుసుకొని చైతన్యవంతులు కావాలనే లక్ష్యంతో సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం...
భారతదేశ చరిత్రలో 2500 సంవత్సరాల క్రితం చాతుర్వర్ణ వ్యవస్థవల్ల , బ్రాహ్మణీయ మనువాదుల చేతిలో తీవ్రంగా అణిచివేయబడ్డ బహుజనుల విముక్తి కోసం, వారి ఐక్యత కోసం ' బహుజన హితాయా, బహుజన సుఖాయ, లోకానుకంపాయ 'అనే నినాదంతో గౌతమ బుద్ధుడు మొట్టమొదట బ్రాహ్మణీయ భావజాల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. బుద్ధుడి బోధనలకు అప్పటి ప్రజలు రాజులు కూడా ఆకర్షించబడి బౌద్ధాన్ని స్వీకరించారు. దేశంలోని అన్ని వర్గాలకు విద్య, సమానత్వం అంది విజ్ఞానవంతులై సుఖ సంతోషాలతో ప్రజలు జీవించి ఆనందంగా ఉండేవి. మగధ సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రచారం చేయడంతో బ్రాహ్మణీయ భావజాలం తో ఉన్న అప్పటి వైదిక మతం ప్రజా ధారణ కోల్పోయింది. భారత దేశంలో 150 సంవత్సరాలు బౌద్ధ మహా విప్లవం వల్ల బ్రాహ్మణ వైదిక మతం దిక్కులేక మూలన పడింది.అశోకుడి ముని మనమడు చివరి మగధ బౌద్ధ చక్రవర్తి బృహద్రథుడు కింద సర్వ సైన్యాధిపతి గా ఉన్న బ్రాహ్మణ సేనాని అయిన పుష్యమిత్ర శుంగుడు క్రీస్తు పూర్వం 185వ సంవత్సరంలో కుట్రపూరితంగా బృహద్రదురుడిని హత్య చేసి అధికారంలోకి వచ్చాడు. అప్పటి వరకు దేశంలో కొనసాగుతున్న బౌద్ధ విప్లవాన్ని ప్రతీ ఘాతక విప్లవం ద్వారా పుష్యమిత్ర శుంగుడు కూల్చివేసి అధికారంలోకి వచ్చిన వెంటనే బౌద్ధారమాలను ధ్వంసం చేసి , బౌద్ధ బిక్షులను ఊచకోత కోశాడు. శూద్రులందరికి జ్ఞానానికి మూలమైన విద్యను దేశంలో నిషేధించాడు. బహుజనులను విడదీసే కుల వ్యవస్థను ప్రవేశపెట్టాడు. బ్రాహ్మణ భావజాలమైన మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టి శూద్రులైన బహుజన వర్గాలపై అప్పటినుండి అణిచివేత ప్రారంభమైంది.
సుమారు రెండు వేల సంవత్సరాల వరకు మహాత్మ జ్యోతిరావు పూలే జన్మించే నాటి వరకు ఈ దేశంలో బ్రాహ్మణీయ మనువాదాన్ని ప్రశ్నించే వారే లేరు. భారతదేశం లోకి బ్రిటిష్ వారు వచ్చి పాఠశాలలు తెరిచేంత వరకు బహుజన వర్గాలకు విద్య దూరంగానే ఉంది. బ్రిటిష్ వారి పాఠశాలలో విద్యాబోధన నేర్చుకున్న పూలే జ్ఞానవంతుడయ్యాడు. బ్రాహ్మణ మనువాదం తో ఎన్నో కష్టాలు పడి ఈ దేశ మూలవాసులు ద్రవిడ జాతి ప్రజలు నేటి బహుజనులలై న (ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లను) దక్షిణాసియా నుండి వచ్చిన ఆర్యులు ఇక్కడి ద్రావిడ రాజులను ఓడించి బానిసలుగా చేసుకున్నారని మొట్టమొదట గుర్తించాడు. బహుజన కులాల పై వారు సాగిస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియజేసిన మొదటి వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే. బ్రాహ్మణీయ భావజాలం నుండి బహుజన వర్గాలను బయటికి తీసుకురావాలని ఉద్యమించాడు. పురాణాలలో పేర్కొన్న రాక్షస రాజులంతా ఈ దేశ మూలవాసులైన ద్రవిడ జాతి కి చెందిన వారేనని, నరకాసురుడు, రావణ సురుడు నేటి బహుజనుల నేతలని, వేదాలు పురాణాలు చదివి జ్యోతి రావు పూలే పరిశోధించి 'గులాం గిరి' పుస్తకం ద్వారా వెల్లడించారు. మహిళలకు, విద్య చైతన్య కోసం, వితంతు వివాహాల కోసం ఎన్నో సాంఘిక ఉద్యమాలు ప్రారంభించిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే. తన జీవితాంతం బ్రాహ్మణీయ మనువా దానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే.
మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత విశేషాలు.
జ్యోతిరావు పూలే పూణే నగరంలో పూల వ్యాపారం చేసే గోవింద్ రావు దంపతులకు 1827 ఏప్రిల్ 11న జన్మించారు. పూలే తండ్రి గోవిందరావు వ్యవసాయ కుటుంబానికి చెందిన సూద్ర జాతికి చెందిన మాలి కులస్తుడు. (ఈ కులాన్ని తెలంగాణలో మున్నూరు కాపు అంటారు.) పూలే తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో తండ్రి గోవిందరావు పెంచి పోషించారు. గోవిందరావు పూలే ను పాఠశాలకు పంపిస్తే శూద్ర జాతికి చెందినవారు చదువుకోవడం ఏమిటని బ్రాహ్మణులు వ్యతిరేకించారు. మాలి కులస్తులు చదువుకుంటే సమాజం నాశనం అవుతుందని బ్రాహ్మణులు అసత్య ప్రచారాన్ని చేశారు. ఆనందరావు తన కొడుకు పూలే ను పాఠశాలలో చేర్పించి చదివించాలని మూడు సార్లు ప్రయత్నించినా అడ్డుకున్నారు. చేసేదిలేక బ్రాహ్మణుల ఒత్తిడికి గోవిందరావు భయపడి చదువు మానిపించి పూల వ్యాపారం లో పెట్టాడు. చదువులో చురుగ్గా ఉన్న పూలే ను బడి మాన్పించడం ఇంటి సమీపంలో ఉన్న ముస్లిం, క్రైస్తవ పెద్ద మనుషులకు నచ్చలేదు. ఆనందరావు కు నచ్చచెప్పి పూలే ను పూణే నగరంలో అప్పటి పాలకులు బ్రిటిష్ వారు నెలకొల్పిన స్కాటిష్ మిషన్ స్కూల్లో చేర్పించాడు. ముంబాయి విశ్వ విద్యాలయంలో మెట్రిక్యులేషన్ వరకు పూర్తి చేశాడు. పూలేకు చిన్న వయసులో చదువు కుంటున్నప్పుడు 13 ఏళ్ళకే 1940లో సావిత్రిబాయి తో వివాహం జరిగింది. 1947లో జ్యోతిబా పూలే విదేశీ సంఘసంస్కర్త రాసిన 'మానవ హక్కులు ' పుస్తకం చదవడం తో అతని ఆలోచనల్లో మార్పు వచ్చింది. సమాజానికి ఏదైనా చేయాలని, జన హక్కుల కోసం పని చేయాలనే ఆలోచన బీజం అప్పుడు మొదలైంది.
మిత్రుడు పెళ్లికి హాజరైన అందుకు బ్రాహ్మణుల దాడి.జీవిత గతిని మార్చింది.
పూణే నగరంలో 1848లో తన బ్రాహ్మణ మిత్రుడు ఆహ్వానం మేరకు పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నందుకు శూద్ర జాతికి చెందిన వాడివి తమ పెళ్లికి ఎట్ల హాజరయ్యారు అంటూ బ్రాహ్మణ యువకులు తీవ్రంగా కొట్టి అవమానిస్తారు. తీవ్ర మనస్తాపానికి గురైన పూలే నగరంలోని నది పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అతడిని చూస్తూ మహార్ యువకులు హేళనగా నవ్వుతూ వెళుతుం డటం పూలే ను ఆలోచింపజేసింది. 'గతంలో పీష్వాల పాలనలో మూతికి ముంత, ముడ్డికి తాటాకు పట్టుకుని జీవితం వెళ్లదీస్తు న్న వీరు వారి గతాన్ని మర్చి పోయి నవ్వుకుంటూ వెళ్తున్నారు, గతంలో ఘోర అవమానాన్ని పొందిన మహార్లు ఇప్పుడేమో చలనం లేకుండా నవ్వుతున్నారు. నేనేమో ఏడుస్తున్నా ను దీనికి కారణం ఏమిటి? అంటూ' ఆలోచించడం ప్రారంభించారు. 'జ్ఞానం ఉండడం వల్ల ఏడుస్తున్నాను, వారికి జ్ఞానం లేకపోవడం వల్ల నవ్వుతూ వెళ్తున్నారు 'అంటూ నిర్ణయానికి వచ్చారు.అప్పటినుండి ఈ దేశంలోని శూద్రులను, అతి శూద్రులను సంఘటితం చేయాలని గట్టిగా నిర్ణయంతీసుకున్నాడు.శూద్ర,అతిశూద్ర వర్గాలకు చదువు నేర్పించి చైతన్యవంతుల్ని చేసి బ్రాహ్మణ మనువాదుల మోసాలను బయటపెట్టాలని కల్పించి సాంఘిక ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు.
శూద్ర అతిశూద్ర వర్గాలకు మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు.
పూలే చదువు పూర్తయిన తర్వాత సివిల్ కాంట్రాక్టర్ గా పూణే నగరంలో పనులు ప్రారంభించారు. కొంత ఆదాయాన్ని సమకూర్చుకొని
బహుజనులకు విద్య నేర్పి చైతన్యవంతం చేసేందుకు 1848 లో పూణే నగరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా శూద్ర, అతిశూద్ర వర్గాల కోసం పాఠశాల నెలకొల్పాడు. 1851లో బాలికల మరో పాఠశాల నెలకొల్పాడు. రైతు కూలీలు పనులకు వెళ్లే పిల్లల కోసం 1855లో రాత్రి బడిని ప్రారంభించాడు. బహుజన ప్రజలను మత ఆచారాలకు విరుద్ధంగా చదువు నేర్పి చైతన్యవంతుల్ని చేస్తున్నాడని బ్రాహ్మణ మనువాదులు కుట్రలు పన్నారు. జ్యోతిరావు పూలే ను హత్య చేసేందుకు 1856లో గుండాలతో దాడి చేయించారు. అయినా భయపడ కుండా ఉద్యమాలను తీవ్రతరం చేశారు.అతి శూద్రులు అంటరాని వారికి తాగునీటిని ఇచ్చేవారు కాదు. 1868లో పూలే ఇంటిలోని మంచినీటి బావిలో నీరు తీసుకువెళ్లాలని అంటరాని కులాల వారికి అనుమతి ఇవ్వడం అప్పటి రోజుల్లో అది ఒక మహా విప్లవం. బ్రాహ్మణ వర్గం ఒత్తిళ్లతో జ్యోతిరావు పూలే కులానికి చెందిన మాలీలు కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణకు గురిచేశాడు.
మహిళా ఉద్యమానికి శ్రీకారం.
19వ శతాబ్దం నాటికి అప్పటి సంఘసంస్కర్తలు మహిళల సమస్యలను, వారి హక్కుల గురించి ఎక్కువ మాట్లాడే వారు కాదు. దేశ చరిత్రలో సంఘ సంస్కర్తలుగా పేరుగాంచిన రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం లాంటి వారు బ్రాహ్మణ స్త్రీల హక్కుల కోసం ఉద్యమించి సంస్కర్తలుగా మారారు. జ్యోతిరావు పూలే బ్రాహ్మణ స్త్రీలతో పాటు బహుజన వర్గాల స్త్రీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడను మనువాద చరిత్రకారులు గుర్తించడం లేదు. దేశంలో మొట్టమొదటి శూద్ర, అతిశూద్ర మహిళల కోసం పాఠశాలలు నెలకొల్పడం తో మహిళా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1860లో వితంతు వివాహాల ఉద్యమం ప్రారంభించా డు. అప్పటి రోజుల్లో బ్రాహ్మణ కుటుంబాలలో చిన్నవయసులోనే కన్యాశుల్కం తీసుకుని ఎక్కువ వయస్సు ఉన్న వారకి ముసలి వారి కి చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలను పెళ్లి చేసేవారు. యుక్తవయసు వచ్చేనాటికి భర్తలు చనిపోయే వారు. భర్త చనిపోయిన తర్వాత మళ్లీ పునర్ పునర్వివాహానికి బ్రాహ్మణ సమాజం ఒప్పుకునేది కాదు. కోరికలు తీర్చుకునేందుకు ఇతరులతో కలవడం వల్ల బ్రాహ్మణ స్త్రీలు గర్భిణీలు గా మారేవారు. వారిని బ్రాహ్మణులు ఇండ్లలోకి రానిచ్చేవారు కాదు. గర్భిణి స్త్రీలు ప్రోత్సహించడం కోసం పూలే దంపతులు పూణే లో అనాధాశ్రమాలు లను ఏర్పాటు చేశారు. వాటిలో ప్రసవించి వారు వెళ్లిపోయిన తర్వాత పిల్లలను వేరే వారికి దత్తత ఇచ్చేవారు. బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వాడిని పూలే దంపతులు దత్తత తీసుకొని పెంచుకున్నారు అతని పేరే యశ్వంత్.
సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు.
సత్యాన్ని వెతికే సమాజాన్ని ప్రేమించాలని లక్ష్యంతో 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ ఏర్పాటుచేశాడు. 'సత్యమే జయతే 'అనే నినాదాన్ని మొట్టమొదట ఉపయోగించింది మహాత్మ జ్యోతిరావు పూలే. 1876 నుండి 82 వరకూ పూలే పూణే మున్సిపల్ కౌన్సిల్ నామినేటెడ్ సభ్యుడిగా గా పని చేశాడు. బహుజన వర్గాలు తాగుడుకు బానిసై తమ కుటుంబాలను జీవితాలను సర్వనాశనం వేస్తున్న మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. ఈ దేశంలో మొట్టమొదటి సారిగా సత్యశోధక్ సమాజ్ తరపున మద్యపాన వ్యతిరేక పోరాటాన్ని నడిపిన మొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. అతడి పోరాట స్ఫూర్తిని తీసుకొనే మహాత్మాగాంధీ స్వాతంత్రోద్యమంలో సత్య శోధన, మద్యపానం అనే రెండు అంశాల మీద ప్రచారం చేశారు. మహిళల
కోసం పాఠశాలలు, వితంతు వివాహాలు, సత్యశోధన, మద్యపాన నిషేధం లాంటి సంస్కరణల కోసం ఉద్యమించిన జ్యోతిరావు పూలే సేవలను బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. అతడి సేవలకు గుర్తింపుగా 1888 మే 11న పూణే లో ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం బహిరంగ సభ లోని 'మహాత్మ' అనే బిరుదును ఇచ్చి ఘనంగా సన్మానించింది.
బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ సమాధి ని గుర్తించి మొట్టమొదట జయంతి ఉత్సవాలను ప్రారంభించిన పూలే.
బ్రాహ్మణ మన వాదుల కుట్రలకు మరాఠా బహుజన పోరాట యోధుడు చత్రపతి శివాజీ అమరుడయ్యాడు. బ్రాహ్మణులు శివాజీ చిన్న భార్యతో విషమిచ్చి 1680 ఏప్రిల్ 3న శివాజీ మరణానికి కారకులైనారు. శివాజీ మరణానంతరం బ్రాహ్మణ పీష్వాలు మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చారు. బహుజన పోరాటయోధుడు శివాజీ చరిత్రను ముందు తరాల బహుజన వర్గాలకు తెలియనివ్వవద్దని బ్రాహ్మణ మనువాద వర్గం శివాజీ సమాధి ని కూడా తెలవకుండా దాచిపెట్టారు. శివాజీ చరిత్రను మహాత్మ జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్ ద్వారా వెలికితీశారు. అతి కష్టంగా శివాజీ సమాధిని 1869లో రాయ్ గడ్ లో గుర్తించాడు. 1870 నుండి సత్యశోధక్ సమాజ్ ద్వారా శివాజీ 240 జయంతి ఉత్సవాలను ఈ దేశంలో మొదటి సారి ప్రారంభించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే.
బ్రిటిష్ పాలనలోనే సామాజిక స్వాతంత్రం కావాలన్న పూలే.
భారతదేశం బ్రిటిష్ వారి పాలనలో బహుజనులు రెండు రకాల బానిసత్వంలో ఉన్నారని జ్యోతిరావు పూలే గుర్తించాడు.మొదటిది విదేశీయులు లైన బ్రిటిష్ వారి వలస వాద బానిసత్వం,రెండవది స్వదేశంలోని బ్రాహ్మణుల చేతిలో ఈ దేశ బహుజనులు సామాజిక బానిసలుగా కోన సాగుతున్నారని ప్రకటించారు.భారతదేశానికి స్వతంత్రం ఇస్తే ముందు సామాజిక బానిసత్వం నుండి బహుజనుల ను విముక్తి కలిగించాలని బ్రిటిష్ వారిని కోరిన బహుజన ఉద్యమ కారుడు జ్యోతిరావు పూలే.
' బ్రాహ్మణుల దుర్మార్గపు బానిసత్వం తుదముట్టించేందుకు తోడ్పడే వాడు విదేశీయుడు అయినా నా మిత్రుడే, అడ్డు పడినవారు స్వదేశీయులు అయినా నా శత్రువు అని' ప్రకటించిన ధైర్యశాలి జ్యోతిరావు పూలే. అతడి హయాంలో జరిగిన మొదటి స్వాతంత్ర సమర పోరాటం గా పిలవబడే 1857 సిపాయిల తిరుగుబాటు ను వ్యతిరేకించారు. భారతదేశ బహుజన ప్రజల తిరుగుబాటు కాదని బ్రాహ్మణుల తిరుగుబాటు అని ప్రకటించాడు. మనువాద బ్రాహ్మణులు చేసిన దుర్మార్గాల గురించి శోధనలు చేసి' గులాంగిరి, సార్వజనిక సత్య ధర్మ, సేద్య కాని చెర్నాకోల' పుస్తకాలను రచించాడు . పక్షవాతానికి గురై 1890 నవంబర్ 28న మహాత్మ జ్యోతిరావు పూలే. అమరుడ య్యాడు. భారతదేశంలో బహుజన ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన మహాత్మ జ్యోతిరావు పూలే ను భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ గురువుగా ప్రకటించు కున్నాడు.
బహుజన సోదరులంతా ఈరోజు గ్రామ గ్రామాన మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదినాలు ఘనంగా జరుపుకోవాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.
.

