మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తెరాస ప్రభుత్వ హాయంలో మిషన్ కాకతీయ, రహదారుల నిర్మాణంలో కోట్లాది నిధుల దుర్వినియోగం.

 అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం -3

 మనుషులు నివసించని ప్రాంతాలకు, ప్రజలకు అవసరం లేని చోట్ల కోట్లాది నిధులతో  రహదారుల, వంతెనల నిర్మాణం.

- నేతల భూముల ధరలు పెంచుకునేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం పేరీట కోట్ల నిధుల దుర్వినియోగం.

- అధికార పార్టీ నేతల ముసుగులో భూ దందాలు, తల్లడిల్లుతున్న పేద రైతులు.

 ప్రజలకు ఉపయోగపడక నిరుపయోగమైన కోటి రూపాయలతో నిర్మించిన రొట్టె పెళ్లి వంతెన.


ll
 తెరాస నేతల మోసంతో నష్టపోయిన సింగరేణి కేకే ఓ సి, కాసిపేట 2 గని భూనిర్వాసితులు.

Scv News Kasipet:--

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగు తుందని తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ప్రత్యేక  తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బండ వర్గాలు వీధిల్లో కి వచ్చి ఉద్యమించాయి. ఉద్యమంలో 1200 మంది అమరవీరుల త్యాగ ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రత్యేక రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య,వితంతు,వికలాం గుల పింఛన్లు పెంచుకోగలిగాము. రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్,కేసిఆర్ కిట్ లాంటి ప్రజా రంజకమైన సంక్షేమ పథకాలు అమలు చేసుకో గలిగాము. ఇంతవరకు బాగానే ఉంది.

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఆదిపత్య కులాలకు చెందిన కాంగ్రెస్,టిడిపి నాయకులంతా తెరాస పార్టీలో చేరడం ప్రారంభించారు. క్రమక్రమంగా పార్టీలో ముందుకు వచ్చి నాయకత్వ స్థానానికి ఎదిగారు. గతంలో టిడిపి, కాంగ్రెస్, ప్రభుత్వాల హాయంలో చేసిన విధంగానే ప్రజాధనం స్వాహా చేసేందుకు అవినీతి, అక్రమాలకు పాల్పడడం ప్రారంభించారు. కోట్లాది రూపాయల నిధులతో మిషన్ కాకతీయ, గ్రామాలు లేని, మనుషులు నడవని ప్రాంతాలకు భూముల ధరలు పెంచుకునే విధంగా రహదారులు,వంతెనలు నిర్మించి నిధుల దుర్వినియోగం చేస్తున్నారని  విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు అధికార పార్టీ ముసుగులో కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు అవినీతి అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. మండలం లోని వివిధ గ్రామాలలో అమాయక ఆదివాసీ, పేద రైతుల భూములు స్వాహా చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడడం, కేకే ఓ సి, కాసిపేట-2 గని భూసేకరణలో అసలైన పట్టాదారులకు అన్యాయం చేయడం, కేకే ఓ సి ముప్పు గ్రామం దుబ్బగూడంలో బోగస్ ఇండ్ల పేరిట కోట్లాది నిధులు స్వాహా చేయడం వెనుక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందనే ప్రచారం జరుగుతుంది. వీరి నిర్వాహకాల వల్ల పార్టీకి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది.

 గత ఎనిమిదేళ్ల తెరాస ప్రభుత్వ హాయంలో మండలంలో జరిగిన అవినీతి, అక్రమాలపై అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంలో 'scv News' అందిస్తున్న ప్రత్యేక కథనం...

 కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో గత ఎనిమిది ఏళ్లుగా  చెరువుల మరమ్మతులు, రహదారులు,  వంతెనల నిర్మాణం పేరిట అభివృద్ధి పనులు చేసేందుకు సుమారు 20 కోట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదలయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం గ్రామాలకు, ప్రజలకు ఉపయోగపడకుండా దుర్వి నియోగం అయ్యాయనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.   

మిషన్ కాకతీయలో మూడు కోట్ల నిధులు వృధా!

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో జలయజ్ఞం పేరిట నిర్మించిన చెరువులలో పూడికతీత, కట్టల బలోపేతం, కాలువల నిర్మాణం చేసేందుకు మిషన్ కాకతీయ పథకం కింద మూడు కోట్ల నిధులను 2015లో తెరాస ప్రభుత్వం మంజూరు చేసింది. ఈనిధుల తో జలయజ్ఞంలోనిర్మించి నిరుపయోగంగా ఉన్న దొడ్డిగూడెం చెరువుకు రూ.28 లక్షలు, ఎగ్గెండి వాగు చెరువుకు రూ. 37 లక్షలు ఘట్రావుపల్లె బుగ్గవాగు చెరువుకు రూ. 48లక్షలు, కర్షలగూడెం చెరువుకు రూ. 27 లక్షలు, దేవాపూర్ చెరువుకు 33 లక్షలు మంజూరయ్యాయి.పాత చెరువులు ధర్మారావుపేట ఊర చెరువుకు రూ.35 లక్షలు,రొట్టెపల్లి నర్సింగ్ సాగర్ చెరువుకు రూ.48 లక్షలు,కోనూరు మొండికుంట చెరువుకు రూ.41 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో చెరువులలోని పూడికను తీసి తూముల మరమ్మతులు, మొరంతో కట్ట నిర్మాణం చేసి రోలింగ్ చేయాల్సి ఉన్న నిబంధనలు పాటించకుండా తూతూ మంత్రంగా పనులు చేయడంతో కట్టలకు పగుళ్లు తేలి నిధులు వృధా అయ్యాయని రైతులు వాపోతున్నారు. మిషన్ కాకతీయ పథకం మూడు కోట్ల నిధులు వ్యయమైన చెరువుల్లో సరిపడా నీరు నిలవ లేక ఆయకట్టు పెరగక   నిధులు వృధా అయ్యాయి.

ప్రైవేట్ కుంటకు మిషన్ కాకతీయ నిధులు.

 రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి ముందుగా చేరి గ్రామాల్లో చెరువులు,రహదారుల నిర్మాణం పనులు చేసే డబ్బులు సంపాదించే  ఆధిపత్య కులానికి చెందిన గుత్తేదారు తన ప్రైవేట్ కుంట పూడికతీత పనులకు 21 లక్ష నిధులు మంజూరు చేసుకోవడం వివాదాస్పదమైంది. చిన్న ధర్మారం గ్రామ సమీపంలో గత 30 ఏళ్లుగా ప్రతి వర్షాకాలంలో కుంటలో నీరు నిలుపుకొని పక్కన ఉన్న దళితుల భూములకు నీరు అందించకుండా నాయకుడి కుటుంబం తన ఇరవై ఎకరాల భూములకు నీరు అందించుకొని వరి పంట పండించు కుంటున్నారు. వరి పంట పండిన తర్వాత కుంటలోని నీరు బయటకు వదిలి శనగ పంట సాగు చేసుకుంటు లబ్ధిపొందు తున్నారు. ఇలాంటి ప్రైవేటు కుంటకు మిషన్ కాకతీయ పథకం కింద 21 లక్షలు మంజూరు చేయడం పట్ల నిరసన వ్యక్తం అవుతుంది.

ప్రజలకు ఉపయోగపడనిచోట్ల 12 కోట్లతో రహదారులు,వంతెనల నిర్మాణం?. నేతల భూముల ధరల పెంచుకునేందుకు అని విమర్శ ?

మండలంలోని వివిధ గ్రామాలలో తెరాస ప్రభుత్వ హయాంలో గుత్తేదారులుగా వ్యవహరించే ఆధిపత్య కులాలకు చెందిన నాయకులు తమకు స్వలాభం కోసం, గ్రామాల సమీపంలో ఉన్న తమ వందల ఎకరాల భూములకు ధరలు పెంచుకునే విధంగా రహదారులు, వంతెనల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపి నిధుల మంజూరు చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంజూరైన కోట్లాది రూపాయల నిధులతో ప్రజలు నివసించని గ్రామీణ ప్రాంతాలలో, ప్రజలకు అవసరం లేని చోట్ల నేతల భూముల ధరలు పెంచుకు నేందుకు రహదారులు వంతెనల నిర్మాణం చేశారని విమర్శలు సర్వాత్ర వ్యక్తం అవుతున్నాయి .

 పశువుల మేత కోసం కోటి రూపాయలతో బిటి రహదారి.

చిన్న ధర్మారం, పెద్ద ధర్మారం గ్రామాల మధ్య గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పథకం కింద సి ఆర్ ఆర్ నిధులు కోటి ఏడు లక్షలతో 2.5కిలోమీటర్ల దూరం 33 అడుగుల వెడల్పుతో 2016లో నిర్మాణం చేపట్టారు. నిర్మాణ క్రమం లోనే నాణ్యత లోపించిన పనులతో బిటి రోడ్డు పనులు పగులు తేలింది. రహదారిని ఇలా కాకుండా మామిడిగూడెం, పెద్ద ధర్మారం గ్రామాల మధ్య నుండి వేస్తే ప్రజలకు ఉపయోగ పడేదని, ప్రస్తుతం రహదారి ప్రజలకు ఉపయోగపడక  పశువులు అడవుల కు వెళ్లి మేత తినేందుకు ఉపయోగ పడుతుందని గ్రామస్తులు వాపోతు న్నారు.గుత్తేదారులకు లాభం కలిగించే విధంగా ఆధిపత్య కులాల వారి భూముల ధరలు పెంచుకునేందుకు రహదారి వేసారని రెండు గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు.

- జన సంచారం లేని చోట నాయకులకు, గుత్తేదారులకు లాభం కలిగించే రెండు కోట్ల బీటీ రహదారి,వంతెన.

ముత్యం పల్లి నుండి బుగ్గ దేవాలయానికి వెళ్లేందుకు రెండు కోట్ల సి ఆర్ ఆర్  నిధులతో  2016 బిటి రహదారి వంతెన నిర్మించారు. ఈ నిధులలో  90 లక్షలతో బీటీ రహదారి,1.10 కోట్లతో గుండ్లపాడు లో వంతెన నిర్మించారు. గుండ్లపహాడ్ నుండి వరి పేట వరకు గ్రామాలు లేవు. సమీపంలో కోమటి చేను నుండి బుగ్గ దేవాలయం వరకు గతంలో ఆర్ అండ్ బి రెండు కోట్లతో రాళ్ల వాగు పై బ్రిడ్జి నిర్మించి బిటి రోడ్డు నిర్మించింది. ప్రజలంతా ఆ రహదారి నుండే బుగ్గ దేవాలయానికి వెళుతుంటారు. సమీపంలోనే రహదారి వంతెన ఉన్న అవసరం లేని చోట గ్రామాలు లేని ప్రాంతంలో రెండు కోట్లతో స్థానిక నాయకుల భూముల ధరలు పెంచుకునేందు బీటి, రహదారి వంతెన నిర్మించారనే విమర్శలు వ్యక్తం అవుతుంది. నిధులతో వేరే ప్రాంతంలో రహదారులు నిర్మిస్తే ఉపయోగపడేదని మండల ప్రజలు వాపోతున్నారు.

 గ్రామ ప్రజలకు ఉపయోగపడనిచోట కోటి రూపాయల వంతెన.

రొట్టె పెళ్లి పంచాయతీలో మల్కపల్లి ఆర్ అండ్ బి రహదారి నుండి రొట్టె పెళ్లి గిరిజన గ్రామం వరకు ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద కోటి 40 లక్షల నిధులతో బీటి రహదారి వంతెన 2016లో  నిర్మించారు. రహదారి రొట్టెపల్లి దళిత కాలనీ వరకు ప్రజల ఉపయోగ పడుతుంది. రొట్టెపల్లి గిరిజన గూడెం వెళ్లేందుకు ఎగ్గెండి వాగుపై కోటి రూపాయలతో నిర్మించిన వంతెన ప్రజలకు ఉపయోగపడడంలేదు. రొట్టె పెళ్లి గిరిజన గూడెం లోని 20 కుటుంబాల ప్రజలు పక్కన దక్షిణ వైపు ఉన్న మండల ప్రధాన రహదారి వైపు ప్రయాణం సాగిస్తుంటారు. రహదారికి గ్రామానికి మధ్యల ఉన్న ఎగండి వాగు పై వంతెన నిర్మిస్తే మా గ్రామానికి ఉపయోగపడుతుందని గిరిజనులు కోరిన పట్టించు కోకుండా ప్రజలకు ఉపయోగ పడనిచోట్ల వంతెన నిర్మించారని స్థానిక ప్రజలు వాపోతున్నారు.కోటి రూపాయలతో నిర్మించిన వంతెన ఆధిపత్య కులానికి చెందిన బడా నాయకుని భూముల ధరలు పెంచుకునేందుకు నిర్మించారని, ప్రస్తుతం వంతెన అడవి నుండి కలప స్మగ్గింగ్ చేసే వారికి, పశువులు అడవికి వెళ్లేందుకు మాత్రమే ఉపయోగ పడుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు.

- జనసంచారం లేని చోట్ల ఎనిమిది కోట్లతో బీటీ రహదారి వంతెనల నిర్మాణం.

మారుమూల గ్రామాల రహదారి అభివృద్ధి పథకం కింద 2021 -22 8 కోట్ల కేంద్ర నిధులతో రేగుల గూడెం గ్రామం నుండి చింతగూడెం గ్రామానికి 6 మీటర్ల  వెడల్పుతో మట్టి రహదారి, అందులో మూడు మీటర్ల వెడల్పుతో బీటి రహదారి, సల్ఫల  వాగుపై వంతెనల నిర్మాణం చేస్తున్నారు. రేగుల గూడెం నుండి గురువాపూర్ వరకు రహదారి, రాళ్ల వాగుపై వంతెన ప్రజలకు ఉపయోగ పడుతుంది. గురువాపూర్ నుండి చింతగూడెం వరకు గ్రామాలు లేని చోట్ల సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం అంత పెద్ద రహదారి వంతెనలు నిర్మించడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ఆ ప్రాంతంలోని అధికార పార్టీ నాయకుల భూముల ధరలు పెంచు కునేందుకు సుమారు మూడు కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నారు.

నాయకుల భూ దందాలతో తెరాస ప్రభుత్వానికి చెడ్డ పేరు.

గ్రామీణ ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి చెరువుల నిర్మాణం, రియల్ దందాలతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.గ్రామస్థాయిలోని చోటా నాయకులంతా అధికార పార్టీల ముసుగులో రాజకీయ నాయకులుగా ఎదిగి అమాయక ఆదివాసి, దళిత పేద రైతుల భూములను మాయ మాటలతో మోసం చేసి తక్కువ ధరలకు చేజిక్కించు కున్నారు. భూ దందాలతో తినడానికి తిండి లేక, చేసేందుకు పని లేక జులాయిగా తిరిగే అక్షర జ్ఞానం లేని వారంతా లక్ష్యాధికారులయ్యారు.

ప్రస్తుతం అధికార పార్టీ లో మండల నాయకులుగా చలామణి అయ్యే కొంతమంది గత 20 ఏళ్ల క్రితం బ్రతుకుతెరువు కోసం గుడుంబా వ్యాపారాలు చేసుకునే వారు, సైకిల్ పంచర్ చేసుకుని జీవనం సాగించిన వారు అక్రమ భూ దందాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుని ఖరీదైన కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. కోమటి చేను,పల్లం గూడెం  ప్రాంతంలోని దళితుల భూములు, చింతగూడెం ప్రాంతంలోని గిరిజనుల సాగు చేసుకునే జంగు సిపాయి భూములను రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమ పట్టాలు చేసుకుని లబ్ది పొందారనే ఆరోపణలు ఉన్నాయి. సింగరేణి లో ముంపు ప్రాంతాలైన కాసిపేట -2 గని, కళ్యాణ్ కానీ ఓపెన్ కాస్ట్ లో ముంపు భూములలో నష్ట పరిహారం చెల్లింపులు అసలైన పట్టేదారులకు అన్యాయం జరిగింది. అధికార పార్టీ ముసుగులోని తెరాస నాయకులు పట్టాదారుల భూముల పేరిట పరిహారం స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. దుబ్బ గూడెం పునరావాస కాలనీలో బోగస్ ఇండ్ల నిర్మాణం చేసి ఎక్కువ పరిహారం పొంది స్థానికంగా నివసించే వారికి అన్యాయం చేశారని విమర్శలు ఉన్నాయి.

కేకే ఉపరితల గని పుణ్యాన పెద్దన పెళ్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున మరో రకం భూదాంధ జరుగుతుంది. అసైన్డ్ భూములను 40,50 ఏళ్లుగా స్థానిక బహుజన వర్గాలకు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారు. వీరికి పట్టాలు లేవు. పట్టాదారులు వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు.వారిలో చాలా మంది చనిపోయారు. అధికార పార్టీ ముసుగులో కొంతమంది నాయకులు వీరే అసలైన పట్టాదారులంటూ కొంతమందిని కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల నుండి  తీసుకువచ్చి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై దొంగ పత్రాలను సృష్టించి వీరే అసలైన పట్టాదారులంటు అమాయక రైతుల వద్ద సగం పరిహారం కాజేస్తూ అన్యాయం చేస్తున్నారు. ఇలా వీరి వ్యవహారాల వల్ల తెలంగాణ ఉద్యమ పార్టీ తెరాసకు చెడ్డ పేరు వస్తున్న అధిష్టానం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.అమాయక రైతులను ప్రజలను అవస్థల పాలు చేస్తు  అవినీతి అక్రమాలకు పాటుపడే నాయకుల పై చర్యలు తీసుకుంటేనే మండలంలో  పార్టీకి, భవిష్యత్తు ఉంటుందని మండల వాసులు అభిప్రాయపడుతున్నారు.

( రేపు అవినీతి అధికారుల భరతం పట్టిన బహుజన యోధుల గురించి )