నేడు!బాబాసాహెబ్
అంబేద్కర్ 66వ వర్ధంతి.
భారతదేశంలో నిజమైన
దేశభక్తుడు బాబాసాహెబ్
అంబేద్కర్ మహాశయుడు
మాత్రమే..
Scv News Kasipet:--
అంటరాని కులంలో జన్మించి బాల్యం నుండి బ్రాహ్మణీయ మనువాద శక్తుల చేతిలో ఎన్నో అవమానాలను, కుల వివక్షలను ఎదుర్కొన్నాడు బాబా సాహెబ్ అంబేద్కర్. భారతదేశంలోని బహుజన వర్గాలకు స్వేచ్ఛ స్వాతం త్రం,సమానత్వం హక్కులు సాధించి పెట్టేందుకు తన జీవితాన్ని, కుటుంబా న్ని పణంగా పెట్టిన నిస్వార్థపరుడు అంబేద్కర్. దేశానికి పూర్తి స్వాతంత్రం కాకుండా పరిమిత స్వాతంత్రం ఇస్తే చాలు అని గాంధీ,కాంగ్రెస్ వాదులు బ్రిటిష్ వాళ్ల ముందు మోకరిల్లిన సమయంలో అంబేద్కర్ మాత్రం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం విడిచి వెళ్లి సంపూర్ణ స్వాతంత్రం ప్రకటించాలని డిమాండ్ చేసిన నిజమైన దేశభక్తుడు బాబా సాహెబ్ అంబేద్కర్. మహాశయుడి 66వ వర్ధంతి సందర్భంగా 'Scv News' అందిస్తున్న ప్రత్యేక కథనం....
ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ లోని విక్టోరియా లైబ్రరీలో ని పుస్తకాలు చదివిన ప్రపంచంలోని ముగ్గురు వ్యక్తులలో ఒకరు.జ్ఞాన సంపన్నుడు ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎన్నో ఉన్నత చదువులు చదివిన మాత్రం బ్రాహ్మణీయ మనువాద వర్గం అతడి మేధాశక్తిని గుర్తించకుండా అంటరాని వాడిగానే గుర్తించి జీవితాంతం వివక్షకు గురిచేసింది. చిన్నప్పుడు బడిలో తోటి పిల్లలతో కలిసి కూర్చుని చదువు కొని ఇవ్వలేదు, నీరు తాగనివ్వలేదు. విదేశాలలో ఉన్నత చదువులు చదువు కొని దేశంలో పని చేసేందుకు వచ్చిన ఆఫీసులో ఫ్యూన్ కూడా ఫైల్ చేతికి ఇవ్వకుండా మీద విసరేయడం, తోటి బ్రాహ్మనీయ ఉద్యోగులు నీరు తాగనివ్వక పోవడం బాబా సాహెబ్ ను తీవ్రంగా కలిచి వేసింది. ఈ వివక్షకు ప్రధాన కారణం కులం. ఈ కుల వ్యవస్థ ఉన్నన్ని రోజులు ఎంత ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాలు సాధించిన తనను వెంటాడు తూనే ఉంటుందని అంబేద్కర్ గ్రహించి కుల నిర్మూలన ధ్యేయంగా ఉద్యమాలలో వచ్చాడు. మహద్ చెరువు పోరాటం, కాళీ రామ్ ఆలయ ప్రవేశం, కుల వివక్షకు మూలమైన మనుధర్మశాస్త్రం దహనం లాంటి ఉద్యమాలు చేపట్టాడు.
అప్పటి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఈ దేశంలోని అంటరాని వారిని మనుషులుగా కూడా గుర్తించడం లేదు,మాకు కొన్ని హక్కులు కావాలని బ్రిటిష్ ప్రభుత్వానికి అంబేద్కర్ వినతి పత్రం అందజేశారు.దీనిపై స్పందించిన బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను భారతదేశానికి పంపించింది. స్వాతంత్ర పోరాట ఉద్యమంలో కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న మనువాద బ్రాహ్మణ శక్తులు అంటరాని వారికి ఎలాంటి హక్కులు ఇవ్వవద్దు అంటూ ' 'సైమన్ గో బ్యాక్' అనే ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేశారు. బొంబాయిలో అంబేద్కర్, మద్రాసులో పెరియార్ మాత్రమే 'వెల్కమ్ సైమన్' అని ఆహ్వానించారు. సైమన్ కమిషన్ను ఆహ్వానించినందుకు అంబేద్కర్ పెరియర్ లు బ్రిటిష్ ఏజెంట్లని కాంగ్రెస్ వాదులు, మనువాద బ్రాహ్మణియ శక్తులు దేశంలో ప్రచారం చేశారు. దేశవ్యాప్త నిరసనల మధ్యనే సైమన్ కమిషన్ దేశంలోని వివిధ రాష్ట్రాలలో పర్యటించి వివిధ వర్గాల నుండి నివేదికలు తీసుకుంది. అంటరాని వారి హక్కులను, బహుజనులకు ఓటు హక్కు కల్పించేందుకు భారతదేశం లోని అన్ని వర్గాల నాయకులను లండన్ కు పిలిపించి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సైమన్ కమిషన్ వెల్లడించింది.1931 నుండి జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో భారతదేశంలోని అంటరాని వారి ప్రతినిధిగా బాబా సాహెబ్ అంబేద్కర్ పాల్గొన్నారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ వాదులు బహిష్కరించారు.
భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటిషర్లకు తేల్చి చెప్పిన బాబా సాహెబ్ అంబేద్కర్.
భారతదేశానికి అప్పటివరకు గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరలేదు. పరిమితమైన స్వాతంత్రం స్థానిక పరిపాలన మాత్రమే కావాలని మిగతా కేంద్ర ప్రభుత్వ పరిపాలన, మిలటరీ బ్రిటిష్ ఆధీనంలో ఉండాలని కోరుకు న్నారు. అంబేద్కర్ మొదటి రౌండ్ సమావేశంలో పాల్గొని నేను మొదట భారతీయుణ్ణి, తరువాత అంటరాని వర్గాల ప్రతినిధిని అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశాన్ని 150 ఏళ్లుగా బ్రిటిష్ సామ్రాజ వలస వాదులు పరిపాలిస్తున్న మా దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని అంటరాని వారికి ఎలాంటి హక్కులు లేవని అన్నారు.భారతదేశానికి పరిమిత స్వాతంత్రం కాకుండా బ్రిటిషర్లు మొత్తం వెళ్ళిపోయి సంపూర్ణ స్వాతంత్రం కావాలని డిమాండ్ చేశాడు. అంబేద్కర్ ప్రకటనతో బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ వాదులు నివ్వరపోయారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని కోరిన నిజమైన దేశభక్తుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని భారత ప్రజలు కొనియాడారు.
బహుజన వర్గాలకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు అంబేద్కర్.
బ్రిటిష్ ప్రభుత్వ హాయంలో దేశంలోని 85% ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వర్గాలకు ఎలాంటి హక్కులు లేవు. ఈ దేశంలోని పాలకులను ఎన్నుకొని మనుషులుగా గుర్తించేందుకు ఓటు హక్కు కావాలని అంబేద్కర్ బ్రిటీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ, నెహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకులు ఓటు హక్కు ఉన్నత చదువులు చదివిన వారికి సంస్థానాదిషులకు, ఆదాయ పన్ను కల్పించే వారికి మాత్రమే ఇవ్వాలని ఆంగ్లేయులను కోరారు. అంబేద్కర్ మాత్రం దేశంలోని అన్ని వర్గాలకు చదువు,ఆదాయం తో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలని పట్టుబట్టి ఓటు హక్కును సాధించి పెట్టాడు.
కొడుకు అంత్యక్రియలో పాల్గొనకుండా ఓటు హక్కును సాధించిన మహానుభావుడు అంబేద్కర్.
రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్న క్రమంలోనే అంబేద్కర్ కొడుకు గంగాధర్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలిసినా బాధపడకుండా నేను వెళితే దేశంలోని బహుజన వర్గాలకు ఓటు హక్కు ఎక్కడ పోతుందోనని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఓటు హక్కును సాధించి పెట్టాడు. 'ఇప్పటివరకు రాణుల కడుపులో రాజులు జన్మించి రాజ్య పరిపాలన చేసేవారు, ఇకనుండి ఓటు హక్కు ద్వారా బహుజన వర్గాల్లో కూడా రాజులు పుట్టి రాజ్యాధికారం చేజిక్కించుకొని మా హక్కులను సాధించు కుంటామని ' అంబేద్కర్ ప్రకటించాడు .
నేడు దేశంలోని 85% వున్నా బహుజన వర్గాలు తమ ఓటు తాము వేసుకున్న అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ మనువాద బ్రాహ్మణీయ శక్తుల కుట్రలతో కులాలుగా వర్గాలుగా చీలిపోయి వారి ప్రలోభాలకు లొంగి మందు, విందు, డబ్బులకు ఆశపడి పవిత్రమైన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకుని అధికారానికి దూరంగా ఉంటున్నాం.
నిజమైన దేశభక్తి అంటే అంబేద్కర్ ను చూసి నేర్చుకోవాలి.
బ్రిటిష్ ప్రభుత్వ హాయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవాది గా పనిచేస్తున్న క్రమంలో 46 మంది స్వతంత్ర సమరయోధులకు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారని మరణశిక్ష విధించారు. వారి తరఫున బొంబాయి హైకోర్టులో అంబేద్కర్ న్యాయపోరాటం చేశాడు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో కోర్టు గుమస్తా చీటి తెచ్చి అంబేద్కర్ కు ఇచ్చాడు. దాన్ని చదివి జేబులో పెట్టుకొని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న 46 మంది ఉద్యమకారుల మరణశిక్ష ను రద్దుచేసి విడిచిపెట్టాలని వాదనలు ప్రారంభించాడు. కోర్టు విరామ సమయంలో బ్రిటిష్ న్యాయమూర్తి అంబేద్కర్ తో మాట్లాడుతూ వాదన చేస్తున్న సమయంలో గుమస్తా నీకు ఒక చీటీ ఇచ్చాడు. అందులో ఏముంది అని ప్రశ్నించారు. 'నా భార్య రమాదేవి అనారోగ్యంతో చనిపోయింది సార్! అని చెప్పడంతో జడ్జి హతాసుడై ఇంకా ఎందుకు ఉన్నావయ్యా ఇంటికి వెళ్ళిపో అన్నాడు.' సార్ నేను వెళ్లి చనిపోయిన నా భార్యను ఎలాగూ తీసుకురాలేను. నా వాదనలతో మరణశిక్ష పడ్డ 46 మంది స్వతంత్ర సమరయోధుల ప్రాణాలనైనా కాపాడుతాను ' అన్నాడు. జడ్జి వెంటనే 46 మందిని మరణశిక్ష రద్దు చేసి విడిచిపెట్టారు. ఇలా బాబా సాహెబ్ అంబేద్కర్ బహుజన వర్గాల కోసం తన కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసి రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులను సాధించి పెట్టిన మహానీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్.
అంబేద్కర్ వాదులు ఆలోచించాలి.!
అంబేద్కర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో పాల్గొని విగ్రహాలకు పూలదండలు వేసినంత మాత్రాన అంబేద్కర్ ఆశయాలను తీర్చలేము. అతడు ఏ వర్గాలకు ఉన్నతి కోసం తన కుటుంబాన్ని, తన జీవితాన్ని త్యాగంచేశారో ఆలోచించాలి.అంబేద్కర్ పోరాటాన్ని, త్యాగాన్ని వృధా చేస్తూ కొంతమంది అంబేద్కర్ వాదుల ముసుగులో మనువాదుల ప్రలోభాలకు లొంగి వారి చెంచాలుగా మారి బహుజన వర్గాలకు తీరని ద్రోహం చేస్తున్నారు. వీరిద్రోహాల వల్లనే 85% బహుజన వర్గాలు రాజ్యాధి కారంలోకి రాలేక బానిసల్లగానే మిగిలిపోతున్నాము. ఇప్పటికైనా అంబేద్కర్ వాదుల ముసుగులో ఉన్న చెంచాలు పరివర్తన చెంది అంబేద్కర్ ఆశయాల కనుగుణంగా పనిచేయాలి. అంబేద్కర్, పూలే ఆలోచన విధానమే ఈ దేశ విముక్తికి మార్గం. బహుజన వర్గాలంతా ఐకమత్యంతో అంబేద్కర్ పూలేలు కలలు కన్నా బహుజన రాజ్యసాధనకు కృషి చేయాలని 'సామాజిక చైతన్య వేదిక' సోషల్, డిజిటల్ మీడియా కోరుకుంటుంది.

