మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో చెరువులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట 50 కోట్ల అవినీతి.?

అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం -2

చెరువుల నిర్మాణం పేరిట కాంగ్రెస్ నాయకులు నాసిరకం పనులతో 40 కోట్ల  నిధులు స్వాహా. !

- అలంకారప్రాయంగా మిగిలిన చెరువులు.

ఇందిరమ్మ ఇళ్ల పేరిట అవినీతి?

 పాత ఇండ్లకే కొత్త గా చూపెట్టి బిల్లుల స్వాహా.!

గిరిజన కాలనీలో నిర్మాణం చేయకుండానే  నిధులు మింగిన అధికారులు, నాయకులు.

 నాణ్యత లోపించిన పనులతో నిర్మాణంలోనే గండిపడ్డ  సల్ఫల వాగు ప్రాజెక్ట్.
 భూములకు సాగునీరిందించని ఎగ్గెండి ప్రాజెక్టు కుడికాలువ  

Scv News Kasipeta:-

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుండి 14 వరకు పదేళ్ల పాలన కొనసాగించింది. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో బీడు భూములకు సాగునీరు అందక కరువు కాటకాలతో  తల్లడిల్లే కాసిపేట మండలాన్ని సస్యశ్యామలం చేసేందు కు కోట్లాది  నిధులను మంజూరు చేసి చెరువుల నిర్మాణం చేపట్టింది.ప్రతి గ్రామంలో నిరుపేదలకు సొంతింటికల నెరవేర్చాలనే  లక్ష్యంతో  ఇందిరమ్మ పథకం ద్వారా పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టింది. చెరువుల నిర్మాణం,ఇందిరమ్మ గృహాల పేరిటమండలంలో సుమారు 50 కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేశారు. ఈ నిధులతో మండలంలోని బీడు భూములకు సాగునీరంది, గృహ నిర్మాణాలు జరిగి అభివృద్ధి పథంలో ప్రయాణిస్తామని బహుజన వర్గాల ప్రజలు ఎంతో ఆనందపడ్డారు. నిర్మాణ పనులన్నీ రాజ్యాధికారం చేతిలో పెట్టుకున్న ఆధిపత్య కులాలకు చెందిన వారే చేపట్టడం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు.వారి స్వార్థ ప్రయోజనాల కోసం నిధులు స్వాహా చేయాలని లక్ష్యంతో నాసిరకం పనులు చేపట్టడం వల్ల నిధులన్ని వృధా అయ్యాయి.నిర్మాణాలు పూర్తయి15 ఏళ్లు గడుస్తున్న చెరువులు, ఇందిరమ్మ గృహాలు పూర్తికాక  అసంపూర్తి గానే  మిగిలి మండల బహుజన వర్గాల ప్రజలకు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేస్తున్నాయి.మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో జరిగిన అవినీతి గురించి అవినీతి వ్యతిరేక వారోత్సవాలు సందర్భంగా 'scv News 'ప్రత్యక కథనం...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పరంగా ఎంతో వెనుకబడి ఉన్న కాసిపేట మండలం బీడు భూములకు సాగునీరు అందక ఎప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లేది. మండలంలోని పడమటి ప్రాంతంలోని అడవులు, కొండల్లో నుండి ప్రతి వర్షాకాలం  వర్షపు నీరు రాళ్ళవాగు, సల్ఫల వాగు ద్వారా ప్రవహించి గోదావరిలో కలిసి వృధా అయ్యేది. 2003 వరకు  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మండలాన్ని వ్యవసాయపరంగా అభివృద్ధి చేసేందుకు చెరువులు ప్రాజెక్టుల నిర్మాణంపై అంతగా ఆసక్తి చూపలేదు. మండలంలో 18వేల ఎకరాల సాగు భూమి ఉండగా వేయి ఎకరాల మాత్రమే చెరువులు, కుంటల ద్వారా సాగునీరు అందేది. మిగతా 17వేల ఎకరాలు వర్షాధార పంటలు జొన్న, కంది, పెసర, పత్తి  పంటలు సాగు చేసుకుని బహుజన రైతాంగం జీవనం సాగించే వారు. తెదేపా పాలన చివరి రోజుల్లో సుమారు 7000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు  2002లో నాబార్డ్ పథకం కింద ప్రపంచ బ్యాంకు నుండి  25 కోట్ల నిధులు అప్పులు తెచ్చారు.ఈ నిధులను రాళ్లవాగు,సల్ఫలవాగు ప్రాజెక్టుల నిర్మాణం కోసం వెచ్చించారు. నిర్మాణం పనులు మాత్రం 2005లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే  ప్రారంభమై పూర్తయ్యాయి.

2004లో  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరిట  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ మండలంలో లేని విధంగా కాసిపేట మండలంలో 16 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించేందుకు చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణానికి 42 కోట్ల నిధులు మంజూరు చేశారు. మండలంలోని చెరువుల నిర్మాణంతో 90 శాతం బీడు భూములకు సాగునీరంది మండలం సస్యశ్యామలం అవుతుందని మండల బహుజన రైతాంగం సంతోషించారు. కానీ వారి ఆనందం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. చెరువుల నిర్మాణం పనులన్నీ ఆధిపత్య వర్గాలకు చెందిన బడా కాంగ్రెస్ నాయకులు టెండర్లు, నామినేషన్ల పేరిట చేజిక్కించుకున్నా రు. కాంగ్రెస్ బడా నాయకులతోపాటు, బహుజన వర్గాలకు చెందిన చోటా నాయకులు కూడా గుత్తేదారులుగా అవతారాలు ఎత్తి చెరువుల నిర్మాణం చేపట్టారు.గుత్తేదార్ల అక్రమాలు, నిర్మాణాల లోపాలు అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పది కాలాలపాటు నిలిచి పచ్చని పంటలు పండేందుకు తోడ్పడాల్సిన సాగునీటి ప్రాజెక్టులు,చెరువులు  నాణ్యత లోపించిన పనులతో నిర్మాణ దశలోనే కొట్టుకుపోయాయి.ఫలితంగా సుమారు 40 కోట్ల ప్రజాధనం వృధా అయింది.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించిన 12 చెరువుల పరిస్థితి ఇలా ఉంది.

1)  రాళ్లవాగు ప్రాజెక్ట్- మల్కపెల్లి గ్రామ శివారులో రాళ్లవాగుపై 3500 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 9 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు కాలువల నిర్మా ణం సరిగా లేకపోవడంతో ప్రస్తుతం 200 ఎకరాలకు మాత్రమే సాగునీరంది స్తుంది.

2) సల్ఫల వాగు ప్రాజెక్ట్ -

కోమటిచేను గ్రామ శివారులో సల్ఫల వాగు పై 3000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో 10 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించారు. నాణ్యత లోపించిన పనుల వల్ల నిర్మాణంలోనే 2008 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు గండి పడింది. గండి పూడ్చి పదేళ్లు పూర్తయిన ఎకరం భూమికి సాగునీరు అందించడం లేదు.కుడి కాలువ ద్వారా 50 ఎకరాల వరకు సాగునీరు అందుతుంది. ఎడమ కాల్వకు మాత్రం ఎకరం భూమిసాగు కావడం లేదు.చెరువు నిర్మాణము, కాలువల నిర్మాణం పేరిట పది కోట్ల నిధులు ఆధిపత్య కులాలకు చెందిన గుత్తేదారు స్వాహా చేశారు. 

గట్రావుపల్లి శివారులోని బుగ్గ వాగు, పెద్దాపూర్ శివారులోని దేవాపూర్ చెరువు, దొడ్డిగూడెం శివారులోని దొడ్డిగూడెం చెరువు,సోనాపూర్ గ్రామ శివారులో నిర్మించిన సోనాపూర్ చెరువు,వెంకటాపూ ర్ శివారులో నిర్మించిన ఎగ్గెండివాగు  ప్రాజెక్టు, చౌడిగూడెం సమీపంలో నిర్మించిన చౌడిగూడెం చెరువు, వరిపేట శివారులో రాళ్లవాగు పై మూడు చెరువులు నిర్మించారు.10 కోట్ల వ్యయంతో రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో నిర్మించిన వరి పేట,బుగ్గగూడెం, కరిశలగూడెం చెరువులు 100 ఎకరాలు కూడ నీరు అందించడం లేదు. మండలంలో 16 వేల ఎకరాల వీడు భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామనే లక్ష్యంతో నిర్మించిన 12 చెరువులు 10 శాతం  భూముల కూడా నీ అందించక నిధులను వృధా అయ్యాయి.

నాణ్యత లోపించిన నిర్మాణం పనుల వల్ల గట్రావుపల్లె  సమీపంలోని బుగ్గవాగు ప్రాజెక్టు, సల్ఫలవాగు ప్రాజెక్టు, కర్షలగూడెం,మామిడి గూడెం చెరువులు నిర్మాణ దశలోనే గండి పడ్డాయి.చెరువుల నిర్మాణంలో సరైన డిజైన్లు,కాలువల నిర్మాణం సరిగా లేకపోవడం వల్ల చెరువులపై వెచ్చించిన ప్రజాధనం వృధా అయ్యింది.చెరువుల లోపాలను సరిదిద్ది కాలువల ద్వారా బీడు భూములకు సాగునీరు అందించే చర్యలను ప్రస్తుత తెరాస ప్రభుత్వం చేపట్టకపోవడంతో 42 కోట్ల వ్యయంతో నిర్మించిన 12 చెరువులు గత 15 ఏళ్లుగా నిరుపయోగమై అలంకార ప్రాయంగానే మిగిలాయి.ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు తెచ్చి నిర్మించిన ఈ చెరువుల నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి పైసా బహుజన వర్గాల ప్రజలు వివిధ రూపేనా చెల్లించిన డబ్బు లేనని మర్చి పోవద్దు.

చెరువుల నిర్మాణం పేరిట ప్రజా నిధులను దుర్వినియోగం చేసిన నాయకులు అధికారులపై చర్యలు తీసుకునే వారెవరు.?

చెరువుల నిర్మాణం చేసిన ఆధిపత్య కులాల వారు,వారి దగ్గర నుండి సబ్ కాంట్రాక్టు తీసుకొని చేసిన బహుజన వర్గాల్లో చోటా నాయకులు మాత్రం నిధులు స్వాహా చేసి దండిగా సంపాదించు కుని ఖరీదైన కారులల్లో  దర్జాగా తిరుగుతున్నారు. మండల బహుజన రైతాంగం మాత్రం చెరువుల నిర్మాణం కోసం వ్యయం చేసిన నిధులన్నీ మావి కావు ఎవరివో అన్న రీతిలో పట్టించు కోవడం లేదు. ఫలితంగా రైతుల బీడు భూములకు సాగునీరు అందక కరువు కాటకాలతోనే కాలం వెళ్లదీస్తు పేదరికంలో మగ్గుతున్నారు.

ఇందిరమ్మ గృహాల్లో జరిగిన అవినీతి?

 లక్ష్మీపూర్ కోలాంగూడెంలో అసంపూర్తిగా మిగిలిన ఇందిరమ్మ ఇల్లు.

 
 సోనాపూర్ నాయకపు గూడెంలో అసంపూర్తిగా మిగిలిన ఇందిరమ్మ కాలనీ 
గ్రామాలలో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చాలని సదుద్దేశంతో  కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశ పెట్టింది.మండలంలోని అప్పటి పది పంచాయతీలను మూడు విడతలుగా విభజించి 3995ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసింది.మొదటి విడతలో కాసిపేట, సోనాపూర్, కోమటిచేను మల్కపల్లి పంచాయతీ లకు 1336 ఇల్లు, రెండో విడతలు ధర్మారావుపేట, కోనూరు, ముత్యంపల్లి, పల్లంగూడెం పంచాయతీలకు 1085, మూడవ విడతలో దేవాపూర్, పెద్దనపల్లి పంచాయతీలకు 1574 ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జోక్యంతో ఆశించిన ఫలితాలు రాక నీరుగారి పోయింది. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు గృహ నిర్మాణ శాఖ అధికారులు,సిబ్బంది కుమ్మక్కై అవినీతి అక్రమాలకు పాల్పడడంతో బహుజన వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. గ్రామాలలో పాత ఇండ్లనే కొత్త ఇల్లుగా చూపెట్టడం, పునాది దశలోనే పూర్తయినట్టుగా ఎంబి రికార్డులు చేసుకొని నిధులు స్వాహా చేశారు.ఇండ్ల నిర్మాణం కొచ్చిన సిమెంటు ను వేరే పనులకు వాడుకున్నారు.ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దొంగ బిల్లులు చేసి కోట్లాది రూపాయల ఇందిరమ్మ ఇళ్ల నిధులను దుర్వినియోగం చేశారు. 

ఇందిరమ్మ ఇళ్ల పేరిట గిరిజనులు దగా!

మారుమూల అటవీ  ప్రాంతంలోని గిరిజనులు సొంత ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేక పూరి గుడిసెల్లోనే నివసించేవారు. వారికి సొంతిల్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కాలనీలను ఏర్పాటు చేసింది. మండలంలోని లక్ష్మీపూర్, పెద్దాపూర్, కొత్త తిరుమలాపూర్ పాత తిరుమలాపూర్, చౌడిగూడెం లోని కోలాం గిరిజనులకు సోనాపూర్, బుగ్గ గూడెం, మంచాల రాజయ్య గూడెం, పెద్దనపల్లి  నాయకపు గూడాలు, సోనాపూర్ గట్రావుపల్లి, వెంకటాపూర్ గ్రామాలలో ఇందిరమ్మ ఆదర్శ కాలనీల పేరట ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇండ్ల నిర్మాణం చేసుకోలేని  పరిస్థితిలో ఉన్న గిరిజనులకు అధికార పార్టీ లోని నాయకులు గుత్తేదారులుగా అవతార మెత్తి  గృహ నిర్మాణ శాఖ సిబ్బందితో కుమ్మక్కైఇల్లు నిర్మిస్తా మని చెప్పి పనులు మొదలుపెట్టి అసంపూర్తి గా చేసిన ఇళ్లకు పూర్తి చేశామని బిల్లులు లేపుకున్నారు. నాయకులు గృహ నిర్మాణ శాఖ అవినీతి అక్రమాలతో మండలంలో ని అన్ని గ్రామాలలో అసంపూర్తిగా ఇందిరమ్మ గృహాలు  కనిపిస్తున్నా యి.

మండలంలో నిర్మాణం చేపట్టిన నాలుగు వేల ఇందిరమ్మ గృహాలలో నేటికీ  1500 ఇండ్లు అసంపూర్తిగానే వివిధ గ్రామాలలో నేటికీ దర్శనమిస్తున్నాయి. ఇందిరమ్మ గృహాలలో అక్రమాలు చేపట్టిన వారిపై సిఐడి తో విచారణ జరిపి అక్రమార్కులపై  చర్యలు తీసుకుంటామని నాటి కాంగ్రెస్,నేటి తెరాస ప్రభుత్వం ప్రకటించింది.నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోఉండి అక్రమాలకు పాల్పడిన నాయకులంతా నేడు అధికార తెరాస ప్రభుత్వంలో చేరడం తో ఇందిరమ్మ ఇళ్ల విచారణ అట కెక్కింది. గత ఎనిమిది ఏళ్ల తెరాస ప్రభుత్వ హాయంలో నైనా  అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేసి ఇవ్వకపోవడంతో అమాయక ఆదివాసి గిరిజనులు నేటికీ మొండి గోడల మీద ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని  జీవనం సాగిస్తున్నారు.

( రేపు తెరాస ప్రభుత్వ హాయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి )