అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం -1
కాసిపేట మండలంలో మూడున్నర దశాబ్దాలుగా జరిగిన అవినీతి, అక్రమాలు?
- గ్రామాల అభివృద్ధికి,సంక్షేమం కోసం మంజూరైన సుమారు 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం.?
- అభివృద్ధికి ఆమడ దూరంలో మండల గ్రామాలు.
![]() |
| నాణ్యత లోపించిన పనులతో నీరు నిలవక వృధా అయినా సోనాపూర్ చెరువు. |
scv News Kasipet --
కేంద్ర రాష్ట్ర,ప్రభుత్వాలు ప్రజలు వివిధ రూపేన కట్టిన పన్నులపై ఆధారపడి పరిపాలన కొనసాగిస్తున్నాయి. ప్రజలు కట్టిన పన్నుల ఆదాయంతో గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిని సక్రమంగా అమలు చేసేందుకు ప్రజల పన్నుల నుండి వేతనాలు తీసుకుని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో కూడిన ప్రభుత్వ యంత్రాంగము పనిచేస్తుంది. ప్రభుత్వ అధికారులు,సిబ్బంది ప్రజా ప్రతినిధులు తాము కట్టి పన్నులను వేతనాలుగా తీసుకునే తమ జీతగాళ్లు, సేవకులు అనే విషయం నేటి ప్రజలకు అవగాహన లేకుండా పోయింది. ప్రభుత్వపరంగా తమకు ఉచితంగా అందాల్సిన సేవలను ప్రజలు ప్రశ్నించి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల నుండి చేయించు కోవలసి ఉంది.
బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ జనాభాలో 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనుల కోసం ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచించారు.రాజ్యాంగం లో ప్రజలకు హక్కులు, బాధ్యతలను, ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధుల విధులు ఎలా నిర్వర్తించాలి ప్రజలకు ఎలా సేవ చేయాలో పొందు పరిచాడు. ప్రజల్లో చైతన్యం లేకపోవడం,పట్టింపు లేని తనం వల్ల రాజ్యాంగంలోని హక్కులు తెలుసుకోక పోవడంతో తమకు ఉచితంగా న్యాయంగా అందాల్సిన పనులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు లంచాల రూపేనా డబ్బులు ఇచ్చి పనులు చేసుకుంటు న్నారు. ప్రజల అవగాహన రాహిత్యం వల్ల, నాయకుల స్వార్థం వల్ల నేటి సమాజంలో అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గ్రామాలలో అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు కట్టిన పన్నులతో కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తుంది. నిధులతో గ్రామాలలో ప్రజలకు ఉపయోగపడే పనులు పదికాలాల పాటు నిలిచే నాణ్యతతో కూడిన పనులు చేయాల్సి ఉంది.ప్రజలు కూడా చైతన్యంతో తమ గ్రామాలలో చేసే పనులు నాణ్యతతో చేస్తున్నారా,లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు తమ బాధ్యతలను విస్మరించి నాకెందుకులే అనే నిర్లక్ష్య ధోరణి వల్ల అధికారులు, నాయకులు,అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నాణ్యత లోపించిన పనులు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగానికి కారకులవుతు న్నారు. దీంతో గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది.
1980 ప్రాంతంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గా ఉన్న సమయంలో ' గ్రామాలలో అభివృద్ధి పనులు, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు విడుదల చేసే రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చెందుతున్నాయి. 85 శాతం దారి మళ్ళీ అవినీతిపరుల పాలవుతు న్నాయని అన్నారు. రాజీవ్ గాంధీ మాటలు అక్షర సత్యాలు. 40 సంవత్సరాలుగా నేటికీ దేశంలో అదే పరిస్థితి కొనసాగుతుంది.దీనికంతటికి ప్రధాన కారణం ప్రజల్లో చైతన్యం, ప్రశ్నించే స్వభావం కోల్పోవడం. దీంతో అవినీతిపరులు దర్జాగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రోజురోజుకు ధనవంతులుగా ఎదుగుతున్నారు.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి కారకు లేవరు ?
మండలంలో నైజాం ప్రభుత్వ హాయము నుండి ఆధిపత్య కులాలు రాజకీయ పెత్తనం చెలాయిస్తున్నాయి. స్వాతంత్రానంతరం కూడా గ్రామాలపై తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు రాజ్యాధికారం తమ చెప్పు చేతుల్లో ఉండేలా వ్యవహరిస్తున్నారు.రాష్ట్రం లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారుతూ మండలం పై రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తు న్నారు. మండలంలోని గ్రామాలకు వచ్చే అభివృద్ధి నిధులను తమ సొంత నిధులుగా తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. 95శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజన ప్రజలు నివసించే గ్రామాల అభివృద్ధికి, సంక్షేమానికి వచ్చే ప్రభుత్వ నిధులను ఐదు శాతం ఉన్న ఆధిపత్య కులాల రాజ్యాధికారాన్ని చేతిలో పెట్టుకొని స్వాహా చేస్తున్నారు.కోట్లాది రూపాయల నిధులతో మనుషులు నివసించని ప్రాంతాలకు రహదారులు, నీరు నిలవని చోట చెరువుల నిర్మాణం చేపట్టి ప్రజాధనం వృధా చేశారు.
బహుజన వర్గాలలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలోని రాజకీయ చైతన్యం వచ్చి ప్రశ్నించే స్వభావంగాల యువతను మందు, విందులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి ఆధిపత్య కులాల వారు తమ వైపు తిప్పుకుంటు న్నారు. రాజకీయ చైతన్యం గల బహుజన యువకులు మండల, గ్రామస్థాయి నాయకులుగా ఎదిగి తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తమ వర్గాల ప్రజలకు కండ్ల ముందు అన్యాయం జరుగుతున్న పట్టించుకోవడం లేదు. ఆధిపత్య కులాలకు మద్దతుగా ఉండి వారు ఇచ్చే చిన్న ప్రలోభాలకు ఆశపడి వారి చెంచాలుగా మారి భజన చేస్తున్నారు. ఫలితంగా గ్రామాలలో మెజారిటీగా ఉన్న ప్రజలు వీరి బెదిరింపులకు భయపడి మౌనంగా ఉంటున్నారు. దీన్ని అదునుగా చేసుకొని ఆధిపత్య కులాలు మండలంలో గుత్తాధిపత్యం చెలాయిస్తూ అవినీతి,అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ నిధులను స్వాహా చేస్తున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో గ్రామాలలో సుపరిపాలన కోసం మండల వ్యవస్థ ఏర్పాటు.
తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1987 మండల వ్యవస్థ ఏర్పడింది. కాసిపేట మండలం ఏర్పడి నేటికీ 35 సంవత్సరాలు గడుస్తుంది. మండలం లోని వివిధ గ్రామాల అభివృద్ధి,సంక్షేమ పథకాల కోసం సుమారు 100 కోట్ల పై చిలుకు ప్రభుత్వం నిధులు మంజూర య్యాయి. ఈ నిధులతో గ్రామాలలో రహదారులు వంతెనలు,బీడు భూములకు సాగునీరు అందించే చెరువుల నిర్మాణం కోసం ఉపయో గించారు.నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం నిధులు స్వాహా చేసేందుకు నాణ్యత లోపించిన పనులు చేయడం వల్ల 90 శాతం ప్రభుత్వ ప్రజాధనం వృధా అయ్యాయి. ఇప్పటికీ మండలంలోని ప్రతి గ్రామంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి.
తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అవినీతి.
తెలుగుదేశం ప్రభుత్వ హయంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం జన్మభూమి,పనికి ఆహారం పథకం, రోజ్ గార్, ఐపాడ్, ఉపాధి హామీ పథకాల ద్వారా కోట్లాది నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో గ్రామాల మధ్య ఫార్మేషన్ రోడ్లు సిమెంటు రోడ్లు, వంతెనలు, వాగుల మీద చెరువుల నిర్మాణం సాగింది. అప్పుడు రాజకీయ పెత్తనం చేస్తున్న ఆధిపత్య కులాల వారు ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురి చేసి గ్రామాలలో అభివృద్ధి పనులు చేయకుండానే చేసినట్టుగా ఎంపీ రికార్డులు చేసి నిధులు స్వాహా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాయకుల నిర్వాహకం వల్ల ఎంపీడీవోలు, ఏఈలు సస్పెండ్ అయి ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో 1995 వరకు సాగు భూములకు నీరు అందించే చెరువులు లేక మండలం కరువు కాటకాలతో తల్లడిల్లేది. సమీపంలో ని గుట్టల్లో కురిసే వర్షపు నీరు, బుగ్గ వాగు, సల్పల వాగు, రాళ్ళవాగు ల ద్వారా వెళ్లి గోదావరిలో కలిసి నీరంతా వృధా అయ్యేది. వాగుల మీద చెరువుల నిర్మాణం కోసం అప్పట్లో కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయి.ఈ నిధులతో సోనాపూర్ లో రెండు చెరువులు, లక్ష్మీపూర్ లో ఒక చెరువు, బుగ్గ గూడెం లో చెరువులను నిర్మించారు. ఈ చెరువుల పనులన్నీ ఆధిపత్య కులాలకు చెందిన వారు చేశారు. నీరు చెరువులోకి వచ్చే ప్రాంతంలో కాకుండా సరైన డిజైన్ లేకుండా నిర్మించడం వల్ల చెరువులలోకి నీరు రాక నిరుప యోగమై ప్రజాధనం వృధా అయ్యింది. చింతాగూడెం, సోనాపూర్, పెద్దాపూర్, బుగ్గ గూడెం, ముత్యం పల్లి, కోనూరు, మామిడిగూడెం ప్రాంతాలలో చిన్న చిన్న కుంటలు నిర్మించి పనికి ఆహార పథకం ద్వారా వందల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాహా చేశారు. ఒక్క కుంటలో కూడా నీరు చేరక నిరుప యోగంగా మారి ప్రజాధనం వృధా అయింది.
మండలంలోని అన్ని గ్రామాలకు మట్టి రోడ్ల నిర్మాణం సాగింది. విధులు స్వాహా చేయడమే ధ్యేయంగా పనిచేయడంతో సంవత్సరంలోగానే రహదారులన్నీ నామ రూపాలు లేకుండా పోయాయి. పనికి ఆహార పథకం ద్వారా వచ్చిన వందల క్వింటాళ్ల బియ్యాన్ని నాయకులు స్వాహా చేశారు. ముత్యం పెళ్లి పంచాయతీలో చిన్న ధర్మారం గ్రామంలో సిమెంటు రోడ్డు, ముత్యం పెళ్లి లోని సిమెంటు రహదారి వేయకుండానే రెండు చోట్ల వేసినట్టుగా రికార్డులు సృష్టించి 135 క్వింటల బియ్యం స్వాహా చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టిన నిధులు అక్రమార్కుల నుండి వసూలు చేయలేకపోయారు .
( రేపు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి గురించి)
