నేడు రాజ్యాంగ దినోత్సవం..
రాజ్యాంగం రాయడానికి
అంబేద్కర్ పడ్డ కష్టాల
గురించి, తెర వెనుక జరిగిన
కుట్రల గురించి
తెలుసుకుందాం..!
భారతదేశంలోని 85% ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజనులకు అమ్మ జన్మనిస్తే, బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పునర్జన్మనిచ్చింది. మహానీయుడు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులవళ్ళనే నేడు దేశంలో బహుజనులు స్వేచ్ఛగా జీవించగలుగు తున్నారు. అసమాన తలు లేకుండా ఆత్మగౌరవంతో బ్రతికేందుకు అందరికీ చదువుకునే హక్కు,మాట్లాడే హక్కు,ఉద్యోగాలు చేసుకునే హక్కు, ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది.
దేశాన్ని పరిపాలిస్తున్న దోపిడి పాలకుల కుట్రల వల్ల స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరా లు గడుస్తున్న, రాజ్యాంగం అమలు లోకి వచ్చి 73 ఏళ్లు నడుస్తున్న రాజ్యాంగంలో కల్పించిన హక్కులు ఈ దేశ బహుజనులకు తెలియకుండా ఉన్నాయి. తమ తలరాతను మార్చే పవిత్రమైన ఓటు హక్కును అగ్రవర్ణాలు ఇచ్చే మందు, విందు, డబ్బులకు ఆశపడి బహుజనులు దుర్వినియోగం చేసుకొని అధికారానికి దూరంగా ఉంటున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జనాభాలో 85 శాతం ఉన్న బహుజనులు దేశ ప్రధాని,రాష్ట్ర ముఖ్యమంత్రులు కాలేకపోతున్నారు . ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల నిర్ణయాల మేరకు ప్రభుత్వాలు నడవాలి. కానీ దేశంలో 15 శాతం ఉన్న అగ్రవర్ణాలే రాజకీయాలలో, పరిపాలన, న్యాయవ్యవస్థ లో 90 శాతం పదవులు అనుభవిస్తూ బహుజన వర్గాలను అణచివేస్తు న్నాయి.రాజ్యాంగం ద్వారా బాబా సాహెబ్ అంబేద్కర్ కన్న కలలను కల్లలు చేస్తూ రాజ్యాంగాన్ని మార్చే యాలని కుట్రలు చేస్తున్నారు.
రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించిన హక్కులు తెలుసుకోవాలని ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008 నుండి రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని చట్టం తెచ్చింది. దేశంలోని ప్రతి గ్రామపంచాయతీ నుండి,కార్యాలయాలలోరాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి అవగాహన కల్పించాలని ఆదేశాలు ఉన్నాయి. రాజ్యాంగ దినోత్సవం అధికారులు ప్రజా ప్రతినిధుల అలసత్వం వల్ల మొక్కుబడిగానే సాగుతున్నాయి. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాజ్యాంగం గురించి, బహుజనుల హక్కుల గురించి, రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ అగ్రవర్ణ కాంగ్రెస్ నాయకుల చేతిలో పడ్డ కష్టాల గురించి, తెెర వెనుక జరిగిన కుట్రల గురించి నేటి యువతరానికి తెలియాలనే ఉద్దేశంతో 'Scv News ' ప్రత్యేక కథనం అందిస్తుంది..
రాజ్యాంగం గురించి తెలుసుకుందాం ..
భారతదేశంలో రాజ్యాంగం 1949 నవంబర్ 26న భారత పార్లమెంటు ఆమోదించింది. 1950 జనవరి 26 న దేశాన్ని రిపబ్లిక్ గా ప్రకటించి రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
రాజ్యాంగం అమలులోకి రాక ముందు ఈ దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉండేవి.?
భారతదేశంలో బౌద్ధం చివరి రాజు అశోకుని ముని మనవడు బృహద్రదుడిని అతని సర్వ సైన్యాధ్యక్షుడైన బ్రాహ్మణుడు పుష్యమిత్ర సుంగుడు క్రీస్తుపూర్వం 185 సంవత్సరంలో హత్య చేసి ప్రతిఘాతక విప్లవం ద్వారా బ్రాహ్మణ రాజ్యాన్ని నెలకొల్పాడు. పుష్యమిత్ర సుంగుడి హాయంలోనే బహుజనులను అణిచివేసి ఉంచేందుకు సుమతి భార్గవ అనే వ్యక్తితో మనుధర్మశాస్త్రం రచించబడింది. అప్పటినుండి మనుధర్మ శాస్త్ర ప్రకారమే దేశంలో పరిపాలన సాగుతుంది. సుమారు 2,135 సంవత్సరాలుగా మనుధర్మ శాస్త్రం భారత్ రిపబ్లిక్ దేశంగా ప్రకటించే అంత వరకు 1950 జనవరి 26 అమలులో ఉంది.
మనుధర్మ శాస్త్రం అమలు జరిగి నప్పుడు పరిపాలన ఇలా ఉండేది .
మనుధర్మ శాస్త్ర ప్రకారం బహుజనులకు ఎలాంటి హక్కులు లేవు. దేశంలో బ్రాహ్మణ వర్గ ఆధిపత్యంలో అసమానత్వంతో సమాజం ఉండేది. బ్రాహ్మణులకే చదువుకునే హక్కు, క్షత్రియులు అగ్రవర్ణాలకు రాజ్యన్ని పరిపాలిం చే హక్కు, వైశ్యులకు వ్యాపారం చేసుకునే హక్కు, శూద్రులైన ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలైన బహుజనులకు పై మూడు వర్ణాలకు సేవలు చేస్తూ కులవృత్తులు చేసుకొని జీవించేవారు. జనాభాలో 50% మహిళలకు ఎలాంటి హక్కులు లేకుండా మనుషులుగా కూడా పరిగణించేవారు కాదు. బాల్య వివాహాలు , వితంతువులకు పునర్వివాహం లేకుండా ఉండడం, సతీసహగమనం లాంటి దురాచారాలు కొనసాగాయి. ఈ దేశం పై దండెత్తి వచ్చిన విదేశీయులు మొఘలా యిల పాలన కూడా బ్రాహ్మణులే మంత్రులుగా ఉండి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత మానవీయ కోణంలో ఆలోచించి సతీసహగమనం బాల్య వివాహాలను రద్దుచేసి , వితంతువులు వివాహాలు చేసుకోవచ్చని కొన్ని చట్టాలు తెచ్చి వీరి దుర్మార్గాలను ఆపగలిగారు.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కల్పించిన హక్కులు ఏమిటి?.
బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ప్రజలందరూ సమానమని స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాత్వత్వంతో మనుషులందరూ సోదరా భావంతో జీవించాలని తెలిపింది.అందరికీ చదువుకునే హక్కు, స్వేచ్ఛగా మాట్లా డుకునే హక్కు,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది.ఎవరైనా ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రిగా,పరిపాలన చేయ వచ్చు , ఎవరైనా ఏ పనైనా చేయవచ్చు, కులాన్ని బట్టి కాకుండా తెలివితేటలను బట్టి ఏ వృత్తి అయినా చేపట్టవచ్చు. మహిళలు స్వేచ్ఛగా చదువు కోవడం, ఉద్యోగం చేసుకోవడం, 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం, పరిపాలన చేసే సౌలభ్యాన్ని కల్పించింది. వితంతు మహిళా అయినా ఇందిరా గాంధీని దేశ ప్రధానమంత్రి చేసిన ఘనత భారత రాజ్యాంగానిది.
రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ పడ్డ కష్టాల గురించి తెలుసుకుందాం...
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య వాదం బలహీన పడింది.భారత దేశాన్ని పరిపాలించే సామర్థ్యాన్ని కోల్పోయే స్థితికి వచ్చింది. దేశంలో గాంధీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. 1940 మార్చి 30న భారత దేశానికి స్వాతంత్రం ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది. స్వాతంత్రానికి ముందు దేశాన్ని పరిపాలించేందు కు రాజ్యాంగాన్ని రచించుకోవాలని సూచించింది. రాజ్యాంగ రచన పర్యవేక్షణ కోసం క్రిప్స్ ఆధ్వర్యంలో బ్రిటన్ పార్లమెంటు బృందం భారత దేశానికి పంపించింది . రాజ్యాంగాన్ని రచించే సభ్యులు రాజ్యాంగ సభకు ముందు ఎన్నిక కావాలని నియమం పెట్టింది. దేశంలోని వివిధ రాష్ట్రాలనుండి 10 లక్షల మందికి ఒక సభ్యుడు గా 214 మంది రాజ్యాంగ సభ్యులను ఎన్నుకోవాలని కమిటీ సూచించింది.
అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నిక కాకుండా ఆటంకాలు.
అంబేద్కర్ 1927 నుండి దేశంలోని అస్పృశ్యుల హక్కుల కోసం పోరాడే నాయకుడుగా గుర్తింపు పొంది,1930 లో రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొని రిజర్వేషన్లు, ఓటు హక్కును సంపాదించి పెట్టాడు. అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నిక అయితే రాజ్యాంగంలో అంటరాని వారి హక్కుల కోసం పట్టుబడతాడని గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు నెహ్రు, రాజేంద్రప్రసాద్ వల్లభాయ్ పటేల్లు గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ను రాజ్యసభకు ఎన్నిక కావద్దని కుట్రలు పన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ' అంబేద్కర్ను రాజ్యాంగ సభకు ఎన్నిక కానివ్వమని తలుపులు కాదు కదా కిటికీలు కూడా తెరవమని ' బహిరంగంగానే ప్రకటించారు.అంబేద్కర్ రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో బొంబాయి నుండి పోటీ చేశాడు. కాంగ్రెస్ నాయకులు మందు, విందులతో ఓటర్లను ప్రభావితం చేసి అనామకుడైన సడోబా కజరేకర్ చేతిలో ఓడించారు. అంబేద్కర్ రాజ్యాంగ సభ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో దేశంలోని అంటరాని వర్గాలు దిగ్బ్రాంతి చెందాయి. రాజ్యాంగ రచన సంఘంలో అంబేద్కర్ లేకుంటే తమ హక్కుల గురించి మాట్లాడే వారు ఎవరు ఉండరని ఆందోళన చెందారు.
ఎట్టి పరిస్థితుల్లోనైనా అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని బెంగాల్ చెందిన నామసూద్ర వర్గ నాయకుడు జోగిందర్ మండల్ మా రాష్ట్రం నుండి ప్రజాకర్షక్ పార్టీ తరఫున పోటీ చేయాలని అంబేద్కర్ ను ఒప్పించారు. బెంగాల్లోని జైసూర్ కుల్నార్ నుండి పోటికి నిలబెట్టి రాజ్యాంగ సభకు గెలిపించుకున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నిక కావడంతో దేశంలోని అంటరాని వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి . అగ్రవర్ణాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాత్రం సహించ లేకపోయారు. అప్పటికే దేశంలో హిందూ ముస్లిం గొడవలు ఎక్కువై దేశ విభజనకు దారితీసాయి. భారత్, పాకిస్తాన్ లు ఏర్పాటు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించి రెండు రాజ్యాంగ సభలు ఏర్పాటుకు సంసిద్ధమ యింది. దేశ విభజన సందర్భంగా ముస్లిం జనాభా 50 శాతం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలను పాకిస్తాన్లో కలపాలని నిర్ణయిం చింది. అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నికైన నాలుగు జిల్లాలలో ముస్లిం జనాభా మైనారిటీగా ఉండి హిందూ జనాభా 57% ఉన్న, నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నికైన జిల్లాలను కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్లో కుట్ర పూరితంగా కలిపేశారు. 'అంబేద్కర్ పాకిస్తాన్ కు వెళ్లి రాజ్యాంగం రాసుకోవాలని' హేళన చేశారు.
రాజ్యాంగ సభకు రాకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడాన్ని అంబేద్కర్ తీవ్రంగా పరిగణించి బ్రిటన్ ప్రధాన మంత్రికి లేఖ రాశారు. తనకు మిత్రుడైన అప్పటి బ్రిటిష్ ప్రతిపక్షనేత విన్స్టంట్ చర్చిల్ దృష్టికి తీసుకువెళ్లి 'మీరు అధికారంలో ఉన్నప్పుడే మా అంటరాని వారి పరిస్థితి ఇలా ఉంది. దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత మా అణగారిన వర్గాలను ఈ అగ్రవర్ణ కాంగ్రెస్ నాయకులు బ్రతుక నివ్వరు కాబట్టి మీ హాయంలోనే మాకు న్యాయం చేయాలని కోరారు' చర్చిల్ అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి క్లైమేట్ అట్లీ తో మాట్లాడి అంబేద్కర్ రాజ్యాంగ సభలో సభ్యుడు కాకుంటే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే ప్రసక్తి లేదని ప్రకటింపచేయించాడు. దీంతో కంగుతిన్న దేశంలోని కాంగ్రెస్ నాయకులు హుటాహుటిన పూనా నుండి బారిస్టర్ జయకర్ ను రాజీనామా చేయించి అంబేద్కర్ ను 1947 జులై 9న రాజ్యాంగ సభకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరుసటి రోజు జులై 10న బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగస్టు 15న భారతదేశపు స్వాతంత్రం ఇస్తున్నట్టు ప్రకటించింది.
రాజ్యాంగం రాయకుండా కూడా కుట్రలు.
అంటరానివాడైనా అంబేద్కర్ కాకుండా వేరే వారితో రాజ్యాంగం రాయించాలని అప్పటి అగ్ర వర్ణాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ కుట్రలు పన్నారు. వేరే దేశాలకు చెందిన రాజ్యాంగ నిపుణులను సంప్రదించేందు కు రాజేంద్రప్రసాద్, వల్లభాయ్ పటేల్, రాజగోపాల చారి, సరోజినీ నాయుడు ప్రత్యేక విమానం లో లండన్ వెళ్లారు. బ్రిటన్ నుండి స్వతంత్రం పొందిన 18 వలస దేశాలకు రాజ్యాంగాన్ని రచించి న రాజ్యాంగ నిపుణుడు ప్రొఫెసర్ జేమ్స్ ను సంప్రదించారు. 'మీ దేశంలో నే ప్రపంచ మేధావి అంబేద్కర్ ఉండగా మీరు నన్ను మీ దేశ రాజ్యాంగం రాయాలనడం సబబు కాదని అన్నాడు. ఇతర దేశాల రాజ్యాంగాలు రాయాలన్నప్పుడు మాకు ఏమైనా సందేహాలు ఉంటే అంబేద్కర్ ను సంప్రదించి రాస్తుంటాం. అంబేద్కర్ ఉండగా నేను రాజ్యాంగం రాయడం వీలుకాదని' సున్నితంగా తిరస్కరించ డం తో నాయకులు అవమానంతో ఇండియాకు వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో అంబేద్కర్ భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకొని రాజ్యాంగ రచన బాధ్యత లను అప్పజెప్పారు.
భారత రాజ్యాంగ సభ రచన సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అంబేద్కర్ మాట్లాడుతూ' ఒక నూతన యుగంలోకి మనం అడుగు పెట్ట పోతున్నాం. రాజకీయంగా సమానత్వా న్ని సాధించుకున్నాం. కానీ సామాజిక ఆర్థిక దృష్టి కోనన్నుంచి చూస్తే చాలా ఘోరమైన అసమానతలు మన సమాజంలో ఉన్నాయి. మన రాజ్యాంగం ద్వారా ఈ ఘోర అసమానతల నుండి రూపు మాపుదాం రండి అని' పిలుపు నిచ్చారు. రాజ్యాంగ సభలో వివిధ హక్కుల విషయమై 11 సెషన్ లో 165 రోజులు చర్చలు జరిగాయి. దేశంలో సంపూర్ణమైన మార్పు జరిగి పేదరికం లేకుండా ధనవంతమైన దేశంగా అభివృద్ధి చేసేందుకు భూములను, పరిశ్రమలను, జాతీయ సంపదను జాతీయం చేయాలని అంబేద్కర్ ప్రతి పాదనలు తెస్తే భూస్వాములు, పెట్టుబడిదారులైన అగ్రవర్ణ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. చివరకు 7600 సవరణలు జరిగి రాజ్యాంగం ఆమోదం పొందింది.
రాజ్యాంగంలో ఆమోదం పొందినవి కూడా అమలు కావడం లేదు.
బాబా సాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి దేశంలోని అణగారిన వర్గాలైన బహుజనులకు రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు కల్పించిన అధికారం లో అగ్రవర్ణాలే ఉండడం వల్ల అమలు కు నోచుకోవడం లేదు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న ఇంకా వివిధ రాష్ట్రాల్లో దళితులపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో దళితుల ను గుడిలోకి రానివ్వకపోవడం,దళిత మహిళ నీరు తాగారని నీటి ట్యాంకును ఆవు మూత్రంతో శుద్ధి చేయడం, రాజస్థాన్ లో దళిత విద్యార్థిని అగ్రవర్ణ ఉపాధ్యాయులు తాగే కుండలోని మంచినీరు తాగినందుకు కొట్టి చంపడం లాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.
దేశంలోనే అత్యు న్నత పదవులు పొందిన రాష్ట్రపతి, ఉప ప్రధానులను, మంత్రులను గుడులలోకి అనుమతించని ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల దేశ జనాభాలో మూడు శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు సమర్థిం చింది. జనాభాలో 53 శాతం ఉన్న బీసీలకు 27%, మాత్రమే ఇస్తూ ఇంతవరకు బీసీ జన గణన జరగకుండా పాలకులు కుట్రలు చేస్తున్న కోర్టులు పట్టించుకోవడం లేదు. జనాభా ప్రాతిపదికన ఇతర రాష్ట్రాలు రిజర్వేషన్ పెంచుకోవాలనుకుంటే 50% మించి రిజర్వేషన్ ఉండవద్దని సుప్రీంకోర్టు ఆంక్షలు విధిస్తుంది. దేశంలో విద్యా,ఉద్యోగాలు, రాజకీయ పదవులలో కూడా బహుజనులకు అన్యాయమే జరుగుతుంది.దేశ పరిపాలనలో అతి కీలకంగా వ్యవహ రించే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల లో 300 మంది ఐఏఎస్ అధికారులలో sc, st, bc కులాలకు చెందిన వారు కేవలం10 మంది మాత్రమే ఉన్నారు. న్యాయ వ్యవస్థలో కీలకమైన తీర్పులు చెప్పే హైకోర్టు సుప్రీంకోర్టులలో 90 శాతం పైగా అగ్రవర్ణాలకు చెందిన న్యాయ మూర్తులే ఉన్నారు.
రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందుతున్న అగ్రవర్ణాలే బహుజనులకు ఇప్పుడు లభించే కనీస హక్కులు కూడా అందకుండా రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలకు తెరదీస్తున్నారు. హిందూ మతవాదులు ప్రత్యేక హిందూ రాజ్యాంగ చట్టాన్ని తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో దేశ జనాభాలో 85% బహుజనులంతా బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధులుగా ఉండాలి. లేకుంటే మళ్లీ మనుధర్మ శాస్త్రం అమలులో కివచ్చి ఎలాంటి హక్కులు లేకుండా పోయే ప్రమాదం ఉంది. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బహుజన వర్గాలు తమ హక్కులను తెలుసుకొని బహుజన రాజ్యాధికారం సాధించే దిశలో ఆలోచించాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుకుంటుంది.

