నేటి యువతరానికి స్ఫూర్తి
ప్రధాత కోనిక ఫోటోగ్రాఫర్
అడిచర్ల మల్లేష్.
- రీలు కెమెరాను ఉపాధిగా మలుచుకుని పేదరికాన్ని పారద్రోలిన మల్లేష్.
- ఫోటోగ్రఫీ తో స్వయం ఉపాధితో పాటు ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించిన మల్లేష్ నేటి కుటుంబాలకు మార్గదర్శి.
- జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించె నేటి యువతకు మల్లేష్ జీవితం ఆదర్శం.
![]() |
| కాసిపేట కోనిక ఫోటో స్టూడియో గ్రాఫర్ అడిచర్ల మల్లేష్ |
![]() |
| కంప్యూటర్ లో ఫోటో ఎడిటింగ్ చేస్తున్న మల్లేష్. |
![]() |
| కాసి పేట మండల కేంద్రంలో ఫోటో స్టూడియో, దుకాణం ముందు మల్లేష్. |
Scv News Kasipet:--
నేటి సమాజంలో ఎన్నో ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు రాక యువత సతమతమవు తున్నారు.స్వయం ఉపాధి,కుటుంబ పోషణ కోసం యువకులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. చాలామంది యువత జీవనోపాధి కోసం తమ కళ్ల ముందు ఎన్నో అవకాశాలు ఉన్న వాటిపై దృష్టి సారించక సమయాన్ని వృధా చేసుకుంటున్నారు.చదువుకు తగ్గ ఉద్యోగం రావాలని, వేరే పనులు చూసుకోక తల్లిదండ్రులకు పెను భారంగా మారుతున్నారు.ఇలాంటి రోజుల్లో ఒక చిన్న అవకాశాన్ని స్వయం ఉపాధి గా మార్చుకొని పేదరికాన్ని జయించాడు ఒక నిరుపేద యువకుడు. ఎంచుకున్న స్వయం ఉపాధి పై ఏకాగ్రత పెట్టి పని చేయడం వల్ల ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదిగి జీవితంలో విజయవంతం అయి నేటి యువతరానికి స్ఫూర్తి దాతగా నిలుస్తున్నాడు కాసిపేట గ్రామానికి చెందిన కోనిక ఫోటో స్టూడియో అధినేత అడిచర్ల మల్లేష్ .
' ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోండి , దాన్నే విజయ లక్ష్యంగా చేసుకోండి, దాన్నే ధ్యానించండి, దాన్నే కలగనండి, దాన్నే శ్వాసించండి, ఇదే విజయానికి మార్గం.' అన్న స్వామి వివేకానంద సూక్తిని నిజజీవితంలో అక్షరాల పాటించి మల్లేష్ విజయవంతం అయినాడు. పేదరికంలో ఉన్న మల్లేష్ మిత్రుడు సరదాకు ఇచ్చిన రీలు కెమెరా ని ఉపాధిగా మార్చుకున్నాడు. దాంట్లోనే తన జీవిత గమనాన్ని వెతుక్కున్నాడు.30 ఏళ్ల క్రితం బ్లాక్ అండ్ వైట్ రీలు కెమెరాను పట్టుకొని గ్రామాలలో తిరుగుతూ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, వివాహ బర్త్ డే ఫోటోలు తీసి ఉపాధి పొందడం ప్రారంభించాడు.
చదువు అంతగా లేకున్నా మారుతున్న కాలానికి అనుగుణంగా తాను మారుతు స్వయంకృషి తో ఫోటోగ్రఫీలో మెలుకువలు నేర్చుకున్నాడు. ప్రస్తుతం కంప్యూటర్ మిక్సింగ్, ఫ్రీ వెడ్డింగ్ షూట్లు చేసే స్థాయికి ఎదిగాడు. సొంత భవనం నిర్మించుకున్నాడు. ఇద్దరు పిల్లలను ఫోటోగ్రఫీ లో వచ్చే ఆదాయంతోనే ఉన్నత చదువులు చదివించి మంచి స్థితిలో నిలబెట్టాడు. పేదరికం నుండి కృషి,పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగిన అడిచర్ల మల్లేష్ విజయగాధ నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తి దాయకం .అడిచర్ల మల్లేష్ విజయ గాధపై 'Scv News 'అందిస్తున్న ప్రత్యేక కథనం..
![]() |
| అవుట్ డోర్ షూటింగ్ లో మల్లేష్. |
కాసిపేట మండల కేంద్రంలోని అడిచర్ల ఓదెలు- చంద్రమ్మ దంపతులకు 1972లో జన్మించిన ఎనిమిదవ సంతానం మల్లేష్. అతనికి నలుగురు అక్కలు, ముగ్గురు అన్నలు. నిరుపేద కుటుంబం జీవనోపాధి కోసం భూములు లేక ఓదెలు -చంద్రమ్మలు గ్రామంలో చిన్న హోటల్ పెట్టుకొని వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునే వారు. మల్లేష్ చిన్నతనం నుండి తల్లి దండ్రులకు తోడుగా ఉండి హోటల్ లో అంట్లు తోముతూ సర్వర్ గా పని చేసేవాడు. ఖాళీ సమయంలో చదువుకోవడానికి స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేవాడు. హోటల్ లో పని చేస్తూ చదువు కొనసాగించడం వీలు కాకపోవడంతో 4వ తరగతిలోనే చదువు మానేసి కుటుంబ పోషణకు తల్లిదండ్రులకు తోడుగా నిలిచాడు. హోటల్ లో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో కొంతకాలం చిన్న దుకాణం పెట్టుకున్నాడు.
1986 సంవత్స రంలో ఫోటోలు తీసుకునే కెమెరాలు మార్కెట్లోకి రావడం ప్రారంభ మైంది. తన మిత్రుడు ఒకరు మల్లేష్ కు బ్లాక్ అండ్ వైట్ కోనిక రీలు కెమెరాను బహూకరిం చడం జరిగింది. కెమెరాతో తాను సరదా గా ఫోటోలు దిగి స్నేహితుల ఫోటోలు తీశాడు. రీలు కెమెరాను పరిశీలించి, దీని ద్వారా ఉపాధి పొందవచ్చు అనే ఆలోచన వచ్చింది. మెదడులో కి వచ్చిన ఆలోచన తన జీవిత గమనాన్నే మార్చేసింది. అదే కెమెరాతో గ్రామంలో తిరిగి అవసరం ఉన్న వారికి పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, కుటుంబాల పుట్టినరోజు వివాహ ఫోటోలు తీసి మంచిర్యాల పట్టణం లోని స్టూడియోలకి వెళ్లి రీల్ కెమెరా ను కడిగించి ప్రింటు తీసుకునేవాడు. ప్రింట్ కాఫీలను ఫోటోలు తీసుకున్న వారికి అందజేసి స్వయం ఉపాధి పొందడం ప్రారంభించారు. 1990 లో కాసిపేట మండల కేంద్రంలో మొట్ట మొదటగా కోనిక ఫోటో స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాడు. దాని ద్వారా మండలంలోని వివిధ గ్రామాలలో తిరుగుతూ బర్తడే వివాహ కార్యక్రమా లను ఫోటోలు తీస్తూ వాటిని వరంగల్, హైదరాబాద్ నగరాలకు తీసుకువెళ్లి ప్రింటులు తీసుకువచ్చి వినియోగదారు లకు నాణ్యమైన ఫోటోలు అందిస్తూ ఉపాధి పొందడం ప్రారంభించాడు.
![]() |
| లెన్స్ కెమెరాతో మల్లేష్. |
మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోటోగ్రఫీలో మెళుకువలను నేర్చు కోవడం ప్రారంభించాడు. రీలు కెమెరాల తర్వాత లెన్స్ కెమెరాలు, డిజిటల్ కెమెరాలతో నాణ్యమైన ఫోటోలు తీయడం ప్రారంభించారు. మల్లేష్ ఫోటోలు నాణ్యమైనవిగా ఉండడంవల్ల వినియోగదారులను ఎంతో ఆకర్షించేవి. మండలంలోని వివిధ గ్రామాల తో పాటు పరిసర సింగరేణి కాలనీలలో కూడా ఫోటోలు తీసేందుకు మల్లేష్ ని ప్రత్యేకంగా పిలిపించు కునేవారు.1993లో వివాహం, బర్త్డే కార్యక్రమాల ఫోటో ఆల్బమ్ లను తయారుచేయడం నేర్చుకున్నాడు. తర్వాత వీడియోలు అందుబాటు లోకి రావడం వీడియోలు తీయడం నేర్చు కొన్నాడు. ఫోటోలు వీడియో లు తీసి ఆదాయాన్ని పెంపొందించుకున్నాడు. 2007లో కంప్యూటర్ నేర్చుకుని ఫోటో ఆల్బమ్ లతో పాటు,వీడియో,మిక్సింగ్ నేర్చుకుని ఆధునిక పద్ధతిలో ఫోటోలు, వీడియోలు తీస్తు ఆదాయాన్ని పొందు తున్నాడు. ప్రస్తుతం నేటి యువతరా న్ని విశేషంగా ఆకట్టుకునే వెడ్డింగ్ షూట్ చేసే స్థాయికి ఎదిగాడు. 30 ఏళ్ల క్రితం రీల్ కెమెరాతో ఫోటోలు తీసి రోజుకు యాభై రూపాయలు సంపాదిం చే స్థితి నుండి నేడు వివాహప్రోగ్రాం కు లక్షరూపాయలు తీసుకునే స్థాయికి ఎదిగాడు. మల్లేష్ కఠోరమైన కృషి, పట్టుదల నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.
మల్లేష్ కుటుంబ జీవితం కూడా నేటి యువతి యువకులకు ఆదర్శం.
![]() |
| ఆడి చర్ల మల్లేష్ కుటుంబం |
అడిచర్ల మల్లేష్ కు 1996 లో మందమర్రి మండలం మేడారం గ్రామానికి చెందిన లీలతో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది సంవత్స రాలలోనే వారికి కొడుకు రిషి చరణ్, కుమార్తె పూజ శ్రేణి లు జన్మించారు.మల్లేష్ ఫోటోగ్రఫి లో వచ్చే చిన్న ఆదాయాన్ని కూడా పొదుపుగా వాడుకున్నాడు. తాను తక్కువగా చదువుకున్నా తన పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కఠోరంగా శ్రమించాడు.రిషి చరణ్ ,పూజా శ్రేణి చదువుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉన్నత చదువులు చదివించుకునెందుకు నిర్ణయించు కున్నాడు. స్థిర ఆదాయం వచ్చే సింగరేణి, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కంటే కూడా చిన్న ఆదాయం తోనే పిల్లలను పెద్ద చదువులు చదివించాడు. రుషి చరణ్ ను ఎంబీఏ, పూజ శ్రేణి ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చదివించారు. ఇద్దరు పిల్లలు ప్రస్తుతం హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారు.
మల్లేష్ ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ ఆశావాద దృక్పథంతో ఉండడమే అతని విజయ రహస్యం. తాను ఏ స్థాయి నుండి నుండి ఉన్నత సాయి కి ఎదిగాడో మర్చిపోలేదు. గ్రామానికి చెందిన కొందరు నిరుపేద యువకులకు కెమెరాలు కొని ఇచ్చి ఉపాధి మార్గాన్ని చూపెట్టారు. ప్రస్తుతం తన వద్ద ఇద్దరు యువకులకు ఉపాధి కల్పిస్తున్నాడు.
కాసిపేట మండలంలోని యువత అడిచెర్ల మల్లేష్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ కళ్ల ముందు ఉన్న అవకాశాలను ఉపాధిగా మలచుకుని పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని 'సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా 'కోరుకుంటూంది.





