మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

నేడు సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జన్మ దినోత్సవం

 చరిత్ర మరచిన బహుజన పోరాట  యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 

నేడు సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జన్మ దినోత్సవం.

బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వీర చరిత్ర గురించి..

' Scv News'  అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం....

 తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.

 
బహుజన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 

Scv News Kasipet:--

 భారతదేశంలో తరతరాలుగా అణచి వేయ బడుతున్న బహుజన కులాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీల వారికి రాజ్యాధికారం సాధించి పెట్టాలని భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్,మాన్యశ్రీ కాన్షీరామ్ లాంటి మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి జీవితాంతం పోరాడారు.. అణగారిన వర్గాల అభ్యున్న తి కోసం ఎన్నో త్యాగాలు చేసి తన భార్యా పిల్లలను కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ బలిపెట్టి మనకు రిజర్వే షన్లు, ఓటుహక్కు ను సాధించి పెట్టాడు.మాన్యశ్రీ కాన్షీరామ్ పెళ్లి చేసుకోకుండా బహుజన రాజ్య స్థాపన కోసం జీవితాన్ని అంకితం ఇచ్చాడు. భారతదేశ జనాభాలో 85శాతం ఉన్న బహుజనులు మహనీయులు మహాత్మ జ్యోతిరావు,పూలే అంబేద్కర్ కాన్షీరామ్ ల ఆలోచనలు అమలు చేయకుండా ఐక్యమత్యం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతున్నారు. బహుజన జాతులు నేటికి పేదరికం లోనే  మగ్గుతున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన తమ ఓటు హక్కుతో తమ వర్గాలను గెలిపించు కోకుండా అగ్రవర్ణాల ప్రలోభాలకు( డబ్బు, మందు, మద్యానికి, ) లొంగి బహుజన రాజ్యం సాధించలేక పోతున్నారు.అగ్ర వర్ణాల కుట్ర, కుతంత్రాలతో బహుజనులు  కులాల పేరిట చీలికలై రాజ్యాధికారాని కి దూరంగా ఉంటున్నారు. జనాభాలో 15% ఉన్నా అగ్రవర్ణాలు మాత్రం దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 75 ఏళ్లుగా అధికారాన్ని తమ చేతుల్లో పెట్టుకొని బహుజనులపై పెత్తనం చెలాయిస్తునే వున్నారు. ఈ దేశంలో బహుజన రాజ్యం ఎప్పుడో స్తుందోనని మనమంతా దశా బ్దాలుగా కలలుకంటున్నాము.

కానీ... ఈ దేశంలోని తెలంగాణలో 353 సంవత్సరాల క్రితం బహుజన రాజ్యాన్ని  సాధారణ కల్లుగీత కార్మికుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్థాపించాడు. క్షత్రియుడు కత్తి పట్టి రాజ్యాన్ని పరిపాలిం చాలన్నా అగ్రవర్ణాల మనువాద సిద్ధాంతా న్ని గండి కొట్టి గోల్కొండ కిల్లాను స్వాధీనం చేసుకుని తెలంగాణ గడ్డను పరిపాలిం చిన సంగతి చాలామంది  బహుజనులకు తెలవదు. తెలంగాణలో 22 కోటలను నిర్మించి 30 ఏళ్లుగా నిరాటంకంగా బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసి స్వయం పాలన సాధించిన గొప్ప బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇన్నాళ్లుగా  బహుజనులకు ఆ పోరాట యోధుడి చరిత్ర తెలవకుండా మనువాదులు,అగ్ర వర్ణాల చరిత్రకారులు కుట్రలు చేశారు. పాపన్న గౌడ్ చరిత్ర ముందు తరాల బహుజనులకు తెలిస్తే అతన్ని ఆదర్శంగా తీసుకుని రాజ్యాధికారం కోసం తిరగ బడతారని అగ్రవర్ణాలు గ్రహించి ఉద్దేశ పూర్వకంగానే అతన్ని చరిత్రలో దోపిడీ దారుడిగా బందిపోటుదొంగ గా చిత్రీక రించారు. తెలంగాణ జిల్లాలలో అతడి రాజ్యాధికార చరిత్రను,శిలా శాసనాలు, ఫోటోలు కూడా కనపడకుండా చేశారు. నేడు పాపన్న చరిత్రను జానపద కథల ద్వారా  బుర్రకథలు,సారధి కాల కథల ద్వారానే తెలంగాణ బహుజనులు తెలుసుకొనే దుస్థితిలో  ఉన్నాము.

 బ్రిటిష్ వాళ్ళతోనే మన బహుజన పోరాటయోధుల చరిత్ర తెలిసింది. 

అనాదిగా ఈ దేశంలోని మూలవాసుల మైన బహుజనుల చరిత్ర మొత్తం వక్రీకరించి బడింది. అగ్రవర్ణాలు చదువు వారి చేతుల్లో ఉండటంవల్ల వాళ్లకు అను కూలమైన చరిత్రను రాసుకొని మన బహుజన పోరాట యోధులను నరరూప రాక్షసులుగా బందిపోట్లుగా చిత్రీకరించి మన తోటి బహుజనులకు వారిని చెడ్డ వారిగా చూపిస్తున్నారు. ఇప్పటికీ మన మూలవాసులైన అసుర రాజులను రావ ణాసురుడు,నరకాసురుడు,దసరా, దీపా వళి పండుగల సందర్భంలో వారి దిష్టి బొమ్మలను మన చేతుల మీదుగా  తగలబెట్టిస్తున్నారు.

మనువాదులు వారికి అనుకూల మైన చరిత్రనే పుస్తకాలలో రాయించుకుని మనతో చదివిస్తున్నారు.నాటి బహుజన పోరాటయోధుల చరిత్రను విదేశస్తుల ద్వారానే  తెలుసుకునే దుస్థితి నేడు భారతదేశంలోని బహుజనులకు ఉంది.

భారతదేశంలో కి ఆంగ్లేయులు వచ్చిన 19వ శతాబ్దం తర్వాతనే బహుజన పోరాటయోధులు అసలైన చరిత్ర బయటికి వచ్చింది. ఆంగ్లేయ చరిత్రకారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి జానపద కథల ద్వారా, శిల్ప సంపద వల్ల అసలైన చరిత్రను వెలికితీసి బాహ్య ప్రపంచానికి  తెలియజే శారు. భారత దేశంలోని బహుజన పోరాట యోధుల చరిత్ర లండన్ మ్యూజియంలో, గ్రంథాలయా లలో నేటికి భద్రంగా దాచిపెట్టారు. వందల సంవత్సరాలుగా మను  వాదుల కుట్రలకు కనుమరుగైన అసలైన చరిత్రను మన దేశానికి చెందిన మహాత్మా జ్యోతిరావు పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుల పరిశోధనల వల్ల సురులు,  అసురుల మధ్య జరిగిన యుద్ధాలు,  పురాణాల్లో రాక్షసులుగా చిత్రీకరించబడిన  మన మూలవాసుల రాజుల చరిత్రను వారు రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నాం.

 " పునాది లేని ఇల్లు చరిత్రని తెలియని జాతి ఒకటే. పునాది లేకుంటే ఇల్లు నిలబడదు చరిత్ర తెలియకుంటే జాతి బాగుపడదు. చరిత్రను తెలుసుకోలేని వాడు చరిత్రను నిర్మించలేడు. " -బాబాసాహెబ్ అంబేద్కర్ 

 మహానుభావుడు బాబా సాహెబ్ అంబేద్కర్ మాటలను బహుజనుల మంతా మననం చేసుకోవాలి. రాబోయే కాలంలో ఈ దేశంలో, రాష్ట్రంలో బహుజన రాజ్యం సాధించు కోవాలంటే ముందు మనం మన బహుజన పోరాటాల చరిత్ర ను అధ్యయనం చేసి అగ్రవర్ణాల కుట్రలను వారు సాగించిన దౌర్జన్యాలను తెలుసు కోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

బహుజన పోరాటయోధుల చరిత్ర ఎందుకు వక్రీకరించ  బడ్డది ? 

భారతదేశంలో  అనాదిగా ఆధిపత్యం చెలాయిస్తున్న మనువాద బ్రాహ్మణవర్గం ఈ దేశంలోని  ప్రజలను నాలుగు వర్గాలు గా విభజించారు. బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులు,భుజాల నుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు పుట్టారని సూత్రీకరించారు. బ్రాహ్మణులు చదువు కోవడం, క్షత్రియులు రాజ్యపాలన చేయడం, వైశ్యులు వ్యాపారం చేయడం, సూద్రులు అయినా ఎస్సీ ఎస్టీ బిసి కులానికి చెందిన బహుజనులు పై మూడు వర్గాలకు సేవ చేయడం వీరి వృత్తి ధర్మమని మనుధర్మ శాస్త్రం చెబుతోంది. వృత్తి ధర్మానికి వ్యతి రేకంగా పనిచేసిన బహుజనులను ధర్మాన్ని ధిక్కరించారు అని కఠిన శిక్షలు విధించారు. హిందూ పురాణాల్లో  మహాభారతంలో విలువిద్య నేర్చుకుని ప్రావీణ్యం సాధించిన పాపానికి, అర్జునుడికి ఎక్కడ పోటీగా వస్తాడని  ఏకలవ్యుడి బొటనవేలు తీసివేశారు. రామాయణంలో చదువు నేర్చుకుని జ్ఞానం పెంచుకునేందుకు తపస్సు చేస్తున్నందుకు బ్రాహ్మణ వర్గానికి పోటిగా  తయారవు తున్నాడని ధర్మం దారి తప్పుతుందనే   నెపంతో  రాముడుచే మనువాదులు శంబుకుడు తల  నరికించారు.

16వ శతాబ్దంలో శూద్ర కులానికి చెందిన మరాఠా యోధుడు శివాజీ,అతని సమ కాలికుడైన తెలంగాణ పోరు బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడులు మను  ధర్మానికి విరుద్ధంగా క్షత్రియుడు పట్టా ల్సిన కత్తిని వీరు చేపట్టి దక్షిణ భారత దేశంలో మొగలాయి సామ్రాజ్యం విస్తరించ కుండా అడ్డుకున్నారు.అప్పటి ఢిల్లీ  సుల్తాన్ ఔరంగజేబ్ ను ఎదురించి పోరాడి రాజ్య పాలన చేశారు.సూద్రులు రాజ్యపాలన చేయడం బ్రాహ్మణ వర్గాలకు రుచించలేదు. వీరిపై కక్ష కట్టి రాజులుగా గుర్తించేందుకు నిరాకరించారు. శివాజీ కి పట్టాభిషేకం చేయకుండా బ్రాహ్మణులు అడ్డుకున్నారు. అతడి సమకాలికుడైన తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన రాజ్య పాలన గురించి తెలంగాణ చరిత్రలో అతని పేరు లేకుండానే చేశారు.

 తెలంగాణ బహుజన రాజ్య వ్యవ స్థాపకుడు సర్దార్ పాపన్న చరిత్ర ఇది .... 

జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో క్రీస్తుశకం 1650 ఆగస్టు18న సర్వమ్మ ధర్మాన్నగౌడ్ దంపతులకు పాపన్న గౌడ్ జన్మించాడు. చిన్న తనంలోనే పాపన్న తండ్రి ధర్మాన గౌడ్ మృతి చెందడంతో తల్లి ఎంతో గారాబంగా పెంచారు. పాపన్న కల్లుగీత వృత్తిలో కొనసాగుతూనే చిన్నప్పటినుండే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. గ్రామా ల్లో నవాబులు, భూస్వాములు జాగీర్దార్ల ఆగడాలను సహించేవాడు కాదు.బహుజ న కులాలకు చెందిన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు సభ్ లతో స్నేహం చేశాడు. పాపన్న కల్లు మండువాలో కల్లు  అమ్ముతుండగా గోల్కొండ నవాబు సైనికులు కల్లు  తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయేవారు. ఒకరోజు అలాగే సైనికులు వెళ్ళి పోతుండగా అతడి స్నేహితుడు ' కల్లు  తాగి వెళ్ళిపోయే నిరుపేద నవాబు సైనికులు సిద్ధంగా ఉన్నారని' హేళనగా మాట్లాడారు. దీనికి ఆగ్రహం చెందిన నవాబు సైనికులు అతని స్నేహితున్ని  కాలుతో తన్నారు. తన స్నేహితుని పై దాడి చేయడంతో పాపన్న ఆగ్రహం చెంది కళ్ళు తీసే కత్తితో నవాబు సైనికుని చంపాడు. మిగతా సైనికులంతా గుర్రాలను, వసూలు చేసిన సిస్తూ డబ్బులు అన్ని పడవేసి పారిపోయారు. గుర్రాలను సిస్తూ డబ్బులను పాపన్న స్వాధీనం చేసుకొని 12 మంది స్నేహితులతో దళాన్ని ఏర్పాటు చేసి భూస్వాముల, జాగీర్దార్ల గడిలపై దాడులు చేయడం ప్రారంభించాడు. తిండి గింజలను ఆస్తులను స్వాధీనం చేసుకొని పేదలకు పంచడంతో జనగామ ప్రాంతంలో పాపన్న దళం పేరు మార్మోగింది. గ్రామా ల్లోని భూస్వాములు జాగీర్దార్లు గోల్కొండ నవాబు దగ్గరికి వెళ్లి పాపన్న దళం బారి నుండి తమను కాపాడాలని వేడుకొన్నా రు. పాపన్న నవాబు సైన్యాలను దొరక కుండా అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు.

జగిత్యాల జిల్లా పొలాస జమిందార్ వెంకట్రావు వద్ద పాలేరుగా చేరాడు. అక్కడ హనుమంతు అనే స్నేహితుడు కలిసి యువకులను చేరదీసి భూస్వాముల జాగీర్దార్ల వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశారు.రాత్రుల్లో వారి గడిల పై దాడులు చేసి ఆస్తులను స్వాధీనం చేసుకొని పేదలకు పంచేవారు. ఈ విష యం జమీందార్ వెంకట్రావు తెలుసు కుని పాపన్నను పట్టుకొని జైల్లో బంధించారు. పాపన్న తన స్నేహితుల సహకారంతో జైలు గోడలను పగులగొట్టుకుని ఖైదీలతో పాటు జమీందార్ల గడిలలో బందీలుగా ఉన్న బహుజన యువకులను విడిపిం చారు. వారితో ఒక సైన్యం ఏర్పాటు చేసి  1675 సంవత్సరంలో మొదట బహుజన రాజ్యాన్ని తెలంగాణలో ఏర్పాటు చేశాడు. సర్వాయిపేటలో  పెద్ద కోటను నిర్మించి 30 ఏళ్లు తెలంగాణలో  బహుజన రాజ్యాన్ని పాలించాడు .కల్లుగీత వృత్తి నుండి రాజ్యపాలనకు ఎదిగిన సర్వాయి పాపన్న గౌడ్ బడుగు బలహీన వర్గాల కోసం పాలనా సంస్కరణలు తెచ్చారు. పేదలకు పన్నులు లేకుండా భూ సంస్కరణలు చేపట్టి ప్రజారంజకమైన పరిపాలన అందించాడు. తన రాజ్యాన్ని కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రాంతాలకు విస్తరించాడు. చిన్న చిన్న  కోటలన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. కొత్తగా 22  కోటలను నిర్మించాడు.

సర్వాయి పాపన్న రాజ్య విస్తరణ అడ్డుకొని అతను నుండి తమను కాపాడాలని ఈ ప్రాంత భూస్వా ములు జాగీర్దార్లు అప్పటి గోల్కొండ నవా బు రుస్తుందిల్ ఖాన్ వద్ద మొరపెట్టుకు న్నారు. క్రీస్తుశకం 1706లో గోల్కొండ నవాబు తన సేనాని కాసింఖాన్ ను పాపన్న గౌడ్ రాజ్యంపై యుద్ధానికి  పంపాడు. సర్వాయి పాపన్న గౌడ్ నవాబు సైన్యాలను ఎదిరించి కాసిం ఖాన్ ని  చంపేశాడు. ఈ విషయాన్ని గోల్కొండ నవాబుతో పాటు మొగల్ చక్రవర్తి కూడా తీవ్రంగా పరిగణించి పాపన్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. ఈలోగా 1707 సంవత్సరంలో  ఢిల్లీ సుల్తాన్ మొగల్ చక్రవర్తి ఔరంగజేబు అనారోగ్యంతో మృతి చెందాడు. ఢిల్లీ సింహాసనంపై వారసుల మధ్య  పోరు సాగింది. ఇదే అదనుగా సర్వాయి పాపన్న మచిలీపట్నం నుండి డచ్ దేశస్థులు నుండి తుపాకులు ఫిరంగులు కొనుగోలు చేశాడు. 1708 సంవత్సరంలో 3000 సైన్యంతో తెలంగాణలో పేరుగాంచిన  కాకతీయుల వరంగల్ కోట, భువనగిరికోటలపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నాడు. 1709 సంవత్సరంలో 12, 000 సైన్యంతో గోల్కొండ కిల్లా పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నాడు.

ఢిల్లీ సింహాసనాన్ని ఔరంగజేబు తదనంతరం  బహదూర్ షా ఎక్కాడు. సర్వాయి పాపన్న ధైర్య సాహసాలు అతని బహుజన  రాజ్య పరిపాలన గురించి తెలుసుకున్న ఢిల్లీ సుల్తాన్ బహదూర్ షా యుద్ధానికి బదులు రాజీ  కుదుర్చుకున్నాడు. ఢిల్లీ సుల్తానుకు సామంతునిగా ఉండి చట్టబద్ధంగా పన్నులు కట్టి గోల్కొండను ఏలుకోవాలని  కోరడంతో సర్వాయి పాపన్న గౌడ్ సమ్మతించాడు.14 లక్షల నగదు కప్పం తోపాటు మొగలు సైన్యాలను ఆహార ధాన్యాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చు కొని గోల్కొండను పాలించ సాగాడు. శూద్రుడు బహుజనుడు సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ కిల్లాను పాలించడం భూస్వాములు పెత్తందార్లు జాగీర్దార్లకు మింగుడు పడలేదు. బహదూర్ షా కు లేనిపోని విష యాలు చెప్పి అతనిపై యుద్ధానికి పంపించారు. గోల్కొండ కోటను పాపన్న గౌడ్ ఏడు నెలల పాలిం చిన తర్వాత 1709 సంవత్సరంలో మొగల్ సైన్యంపై యుద్ధానికి దిగాడు. తాటికొండ వద్ద సర్వాయి పాపన్న, మొఘల్ సైన్యానికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాపన్న సైన్యం ఓడిపోయిం ది. పాపన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌడ కులస్తుల వద్ద కల్లు మండువాలో తలదాచుకున్న విషయం మొగల్ సైన్యాలకు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పట్టుబడ్డారు. భవిష్యత్తులో తెలంగాణలో బలహీన వర్గాల వాడు రాజ్యాధికారం కోసం పోరాడ వద్దని బహుజనులను భయభ్రాంతులకు చేసేందుకు సర్వాయి పాపన్న గౌడ్ తలను నరికి ఢిల్లీ సుల్తాన్ బహదూర్ షా కు బహుమానంగా పంపారు. మొండాన్ని గోల్కొండ కోటకు వేలాడదీశారు. ఇలా మూడున్నర శతాబ్దాల క్రితం తెలంగాణ లో మొట్ట మొదట బహుజన రాజ్య స్థాపకుడు బలహీన వర్గాల పోరుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ముగిసింది...

బహుజన పోరాటయోధుడు సర్వాయి సర్దార్ పాపన్నగౌడ్ చరిత్ర ఎలా బయటకు వచ్చింది ?  

 మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సమకాలికుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు చరిత్ర లో శివాజీ కి వచ్చిన పేరు రాలేదు. మహారాష్ట్రలో శివాజీని మరాఠా యోధుడిగా గుర్తించి ప్రతి గ్రామంలో, పట్టణంలో అతడి విగ్రహాలు కనబడతా యి. తెలంగాణలో మాత్రం బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న విగ్రహం అన్ని గ్రామాలలో  కనబడదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్  ట్యాంక్ బండ్ మీద ఎందరో విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ గడ్డమీద 30 ఏళ్లు బహుజన రాజ్యాన్ని స్థాపించిన పాపన్న విగ్రహం లేదు. అగ్రవర్ణాలు ప్రభుత్వాలు ఉద్దేశ పూర్వకంగానే పాపన్న చరిత్ర బహుజను లకు తెలిస్తే అతని స్ఫూర్తిగా తీసుకొని తమపై ఎక్కడ తిరుగుబాటు చేసి బహుజన రాజ్యం కోసం పోరాటాలు చేస్తారని భయపడి పాపన్న చరిత్రను కనుమరుగు చేశారు.భారతదేశ చరిత్రలో అగ్రవర్ణాలు, పెత్తందార్లు ముస్లిం చరిత్ర కారులు అతని  దోపిడీ దొంగగా  బందిపో టుగా చిత్రీకరించి ప్రచారం చేశారు.  

 బ్రిటిష్ చరిత్రకారుల పరిశోధనలతోనే బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర బయటకొచ్చింది.

17వ శతాబ్దంలో బ్రిటీష్ చరిత్ర కారుడు జె.కె.బోయర్ తెలంగాణలోని పల్లెల్లో తిరిగి ప్రజల నోళ్లలో నానుతున్న జానపద కథలు, సాహిత్యం, బుర్ర కథలు చెప్పే కళాకారుల ద్వారా  అసలైన చరిత్రను తెలుసుకొని రికార్డు చేయడంతో పాపన్న గౌడ్ వీర చరిత్ర బాహ్యప్రపంచానికి  తెలిసింది. ప్రపంచంలో పేరు గాంచిన లండన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అతడి వీరచరిత్రను గుర్తించి పుస్తకాన్ని ప్రచురిం చింది. పుస్తకానికి రివ్యూ రాసిన బ్రిటిష్ చరిత్రకారుడు ప్రొఫెసర్ రీఛార్జ్ పీటర్, పాపన్న గొప్ప బహుజన యోధుడు అని గుర్తించారు.భారత దేశంలో ఆరు వందల ఏళ్ళ క్రితం గొప్ప పోరాట వీరుల చరిత్రను వెలికి తీసి అందులో 8 మంది వీరులలో  సర్వాయి పాపన్న మొదటి వాడుగా బ్రిటిష్ ప్రభుత్వం  గుర్తించింది. 

 బ్రిటిష్ వారి మ్యూజియంలోని పాపన్న ఫోటో పెయింటింగ్ నే విగ్రహాలు గా పెట్టుకుంటున్నాం..

తెలంగాణ గడ్డపై సర్వాయి పాపన్నకు సంబంధించిన సాహిత్యం, శాసనాలు, చిత్రపటాలు భావితరాల బహుజనులకు అందకుండా చేశారు ఆనాటి అగ్రవర్ణాల  పాలకవర్గాలు. ఇంగ్లాండ్ లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో బ్రిటిష్ వారు బహుజన  పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వీరత్వాన్ని గుర్తించి అతని చిత్రపటాన్ని  పెయింటింగుల్లో భద్రపరిచారు. హైదరాబాదుకు చెందిన  చిత్రకారుడు ఒకరు బ్రిటిష్ వారి మ్యూజియంలో ఉన్న పాపన్న పెయింటింగ్ తీసుకువచ్చి ఇక్కడ ప్రదర్శిం చారు. అదే ఫోటోను విగ్రహాలుగా చేసి తెలంగాణ పల్లెల్లో పెట్టుకుంటున్నాం. మొదటి విగ్రహం కరీంనగర్ జిల్లాలో పాపన్న రాజ్య పాలన చేసిన సర్వాయిపేట లో, తర్వాత నిర్మల్ జిల్లా లో పెట్టారు. అవే  విగ్రహాలు ప్రస్తుతం రాష్ట్రంలో గౌడ  సంఘాలు గ్రామాల్లో పెడుతున్నాయి. తెలంగాణ రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్ పెత్తనాన్ని దిక్కరించి గోల్కొండ కిల్లా పై స్వాతంత్ర బాహుట ఎగరవేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహు హుజనులు అందరికీ స్ఫూర్తిదాయకం.

*తెలంగాణలో మూడున్నర శతాబ్దాల క్రితమే బహుజన రాజ్యాన్ని స్థాపించిన సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ చరిత్ర గ్రామ గ్రామానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది.తెలంగాణ ప్రభుత్వం పాపన్న అసలైన చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి. ట్యాంకుబండ్ పై సర్దార్ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. 

రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బిసి బహుజనుల అంతా పాపన్న పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి. బహుజన పోరాట యోధుడు పాపన్న 352 జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.