మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఓరియంట్ బాధిత ఆదివాసీలకు జరిగిన అన్యాయం -3

 ఓరియంట్ బాధిత ఆదివాసీలకు జరిగిన అన్యాయం -3

భూసేకరణలో దేవాపూర్ ఆదివాసీలకు జరిగిన తీవ్ర మోసం...-

 - దశాబ్దాలుగా  సాగు చేసుకున్న తమ భూమి  తమదేనని నిరూపించు కునేందుకు కోర్టును ఆశ్రయించిన దుస్థితిలో భూనిర్వాసిత ఆదివాసిలు.

- ఓరియంట్ బాధిత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన అమలుకాని వైనం...

 దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారం



  ఓరియంట్ భూనిర్వాసిత గిరిజనులు (పాత చిత్రం)
ScvNewsKasipet:-

 చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అడవి మధ్యలో పకృతి నీడలో తమ సారవంత మైన నల్లరేగడి భూముల్లో వర్షాధార పంటలు పండించుకుని దశాబ్దాలుగా ఆదివాసీలు హాయిగా జీవనం సాగించే వారు.సమీపంలోని గుట్టల్లో లభించే అపారమైన సున్నపురాయి ఖనిజ సంపద ఆధారంగా ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఏర్పడడం దేవాపూర్ ప్రాంత ఆదివాసీల పాలిట శాపంగా మారింది.సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు వల్ల వారి జీవనాధా రమైన వందలాది ఎకరాల తమ పట్టా భూములను కోల్పోయారు. పరిశ్రమ నిర్మాణంలో  కోల్పోయిన భూములకు నష్టపరిహారం,ఉద్యోగాలు వచ్చి హాయిగా జీవిస్తామనుకున్నా వారిఆశలు అడి యాశలు అయ్యాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభమై  40 ఏళ్లు గడుస్తున్నా భూము లకు నష్టపరిహారం, ఉద్యోగాలు నేటికీ  అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములు తామేవేనని నిరూపించుకు నేందుకు హై కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి లోకి దేవాపూర్ ఆదివాసీ గిరిజనులు నెట్టబడ్డారు.హైకోర్టు ఆదివాసీలకు అనుకూలంగా పరిహారం,ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిన దశాబ్దాలుగా అమలు కావడం లేదు. కర్మాగారం ఏర్పాటైన గత నాలుగు దశాబ్దాల నుండి నేటి వరకు కర్మాగార నిర్మాణం కోసం సేకరించిన దాని కంటే సుమారు 2,500 ఎకరాల భూములు ఓరియంట్ యాజమాన్యం కబ్జా చేసిందని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. అప్పటి రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురిచేసి ఆదివాసుల పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూములైన లావణి పట్టా, అటవీ భూమి  కూడా తన ఆధీనంలో ఉంచుకుందనే ఆరోపణలు ఉన్నాయి .

మా భూములు కార్మాగారంలో ఉన్నా యని,తమకు నష్టపరిహారం,ఉద్యోగాలు ఇవ్వాలని ఆదివాసీల ఆక్రందనలు అరణ్యరోదనాలుగానే మిగిలాయి. ప్రస్తుతం ఓరియంట్ కర్మాగారంలో  సేకరించిన భూమి కంటే సుమారు 2,500 ఎకరాల భూమి ఎక్కువ ఉందని 2010లో నిర్వహించిన రీ సర్వేలో  జిల్లా సర్వే అధికారులు తేల్చారు. గిరిజనుల పట్టా భూములతో పాటు  ప్రభుత్వ భూములు, అటవి భూములు కూడా ఓరియంట్ కబ్జాలో ఉన్నట్లు రీ సర్వేలో వెల్లడైంది. సర్వే అధికారులు ఇచ్చిన రిపోర్టును  వెల్లడించకుండా రాష్ట్రస్థాయిలో తన పలుకుబడితో  ఓరియంట్ యాజమాన్యం అడ్డుకుంటుందని భూనిర్వాసితులు  ఆరోపిస్తున్నారు. దేవాపూర్ లోని రెండు గిరిజన  కుటుంబాలకు మాత్రమే జిల్లా సర్వే అధికారులు ఓరియంట్ కబ్జాలో మీ భూమి ఉందని పంచనామ రిపోర్టు అందజేశారు. జిల్లా సర్వే అధికారి ఇచ్చిన పంచనామా రిపోర్ట్ ఆధారంగా దాన్ని హైకోర్టులో పిల్ వేయగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చి పన్నెండేళ్లు గడుస్తున్న అమలు కావడం లేదు. ఓరియంట్ యాజమాన్యం తమకు కోర్టు తీర్పుతో సంబంధం లేదని కలెక్టర్ ద్వారా వస్తేనే ఉద్యోగం, నష్టపరిహారం ఇస్తామని తప్పించుకుంటుంది. రెవెన్యూ అధికారుల ను ఓరియంట్ యాజమాన్యం ప్రభావితం చేయడంతో కోర్టు తీర్పు అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని నిర్వా సిత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

 ఆదివాసులు భూములు కోల్పోయిన వైనం  గురించి తెలుసుకుందాం...

దేవాపూర్ లో ఓరియంట్ సిమెంట్ కర్మాగారం నిర్మాణం కోసం బిర్లా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1978- 79 లో  అధికారికంగా భూసేకరణ చేసింది. మొదట పరిశ్రమ నిర్మాణం కోసం 194 ఎకరాలు, టౌన్ షిప్ ఏర్పాటు కోసం  250 ఎకరాలు, లారీ యార్డు, రైల్వే కోసం 12 ఎకరాలు మొత్తం 456ఎకరాలు అధికారికంగా సేకరించింది. ప్రస్తుతము ఓరియంట్ ఆధీనంలో మూడు వేల ఎకరాల వరకు ఉందని సర్వేలో జిల్లా రెవెన్యూ అధికారులు తేల్చారాని ఓరియంట్ భూనిర్వాసితులు ఆరోపిస్తు న్నారు. మిగతా 2500 ఎకరాలు అనధికారికంగా అప్పటి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని, ప్రలోభాలకు  గురిచేసి ఓరియంట్ యాజమాన్యం  ఆక్రమించింది అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

భూసేకరణలో రెవెన్యూ అధికారుల మాయాజాలం..

భూ సేకరణ సమయంలో రెవెన్యూ అధికారుల మాయాజాలంతో పట్టా దారులైన ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ ప్రాంతం లోని వందల ఎకరాల భూమి ఒకే సర్వే నెంబర్ 84 లో ఉండడం రెవెన్యూ అధికారులకు అనుకూలించింది. ఈ నంబర్ ను వేసి కాస్తులో లేనివారికి, దొంగ పట్టాలు సృష్టించి  గిరిజనులకు అన్యాయం చేశారు. కర్మాగారంలో 16 ఎకరాల భూములు పోయిన పట్టాదారులకు ఒక్క ఉద్యోగం మాత్రమే ఇచ్చి, ఎకరం భూమిని గుంటలలో పది మందిపై  పట్టాలు సృష్టించి 10 ఉద్యోగాలు యాజమాన్యం ద్వారా పొందారు. పరిహారం మాత్రం రెవెన్యూ అధికారులు స్వాహా చేశారు. కొంత మంది గిరిజనులకు 16 ఎకరాల భూములు పోయిన ఉద్యోగాలు, నష్ట పరిహారం అందలేదు. కొంత మంది రెండు గుంటల భూమి పోయి కూడా ఉద్యోగాలు పొందిన ఉదంతాలు ఉన్నాయి.

నైజాం ప్రభుత్వ హాయంలో  దేవాపూర్ ప్రాంతంలోని 62  నాయకపోడు, గోండు గిరిజనుల కుటుంబాలకు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందాలనే లక్ష్యంతో  960 భూమిని పంపిణీ చేసింది. సర్వే నెంబర్ 84 లో  1 నుండి 36 వరకు బై నంబర్ల ద్వారా 15,16 ఎకరాల పంపిణీ జరిగింది. నాయకపోడులకు15 ఎకరాలు, గోండు తెగ గిరిజనులకు 16 ఎకరాలు పంపిణీ  వేసింది. ఈ భూముల్లో ఓరియంట్ యాజమాన్యం రెవెన్యూ శాఖ ద్వారా 456 ఎకరాలను అధికారికంగా సేకరించి నష్టపరిహారం ఉద్యోగాలను ఇచ్చింది. అనధికారికంగా ఆదివాసీలకు చెందిన మిగతా 514 ఎకరాలు కూడా తాను ఆక్రమించింది. తెలివిగా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైన ఓరియంట్ యాజమాన్యం  భూసేకరణలో ఎకరం, రెండెకరాలు  మాత్రమే స్వీకరించి నష్టపరిహారం ఉద్యోగాలు ఇచ్చామని బుకాయిస్తుంది. 16 ఎకరాల భూమి పట్టాదారులుగా  దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న మిగతా 14, 15 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందని అమాయక ఆదివాసిలు వేసే ప్రశ్నలకు ప్రభుత్వ అధికారుల వద్ద, ఓరియంట్ యాజమాన్యం వద్ద సమాధానం లేదు. సహజంగా ఒకే సర్వే నంబర్లలో ఉన్న 16 ఎకరాల భూమి ఒకే దగ్గర ఉంటుంది. రెవెన్యూ  అధికారుల మోసం  వల్ల ఒక్కొక్క 16 ఎకరాల  పట్టదారు భూమిలో 30 గుంటలు,ఎకరం మాత్రమే నష్ట పరిహారం, రెవెన్యూ అవార్డుల ద్వారా అధికారికంగా చెల్లించారు .రెవెన్యూ అధికారులు మిగితా భూమి ఓరియంట్ యాజమానికి అప్పనంగా కట్టబెట్టి లబ్ధిపొందారు. ఎకరానికి పరిహారం ఇచ్చారు, మిగతా 15 ఎకరాల కు పరిహారం ఏదని నిర్వాసితులు అడిగితే మీ భూములు సమీపంలోని  అడవుల్లో, గుట్టల్లో ఉన్నాయంటూ రెవెన్యూ, ఓరియంట్ యాజమాన్యం బాధిత భూ నిర్వాసిత గిరిజనులను దాబా ఇస్తున్నారు.

 పట్టించుకోని రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులు 

రెవెన్యూ,ఓరియంట్ యాజమాన్యం ద్వారా తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని 40 ఏళ్లుగా ఆదివాసి బిడ్డలు అలమటి స్తున్నారు. వారిని పట్టించుకునే ప్రభుత్వా లు కానీ,రాజకీయ పార్టీలులేవు. ప్రతి ఎమ్మెల్యే,స్థానిక సంస్థ ఎన్నికల్లో, కర్మాగార  యూనియన్  ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు తాము గెలిస్తే  భూ నిర్వాసితులకు  నష్టపరి హారం,ఉద్యోగాలు ఇప్పిస్తామని  హామీలు ఇవ్వడం, వారు వేసే ఓట్లతో గెలవడం సర్వ సాధారణమై పోయింది....


రేపటి నుండి . భూ నిర్వాసిత కుటుంబాల  గురించి ..)