మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

నాలుగు దశాబ్దాల ' ఓరియంట్ ' బాధిత ఆదివాసీలకు న్యాయం జరిగేనా?

నాలుగు దశాబ్దాల ' ఓరియంట్ ' బాధిత ఆదివాసీలకు  న్యాయం జరిగేనా?

తుడుందెబ్బ ఉద్యమంతో చిగురిస్తున్న బాధిత గిరిజనుల ఆశలు...

ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా  ' Scv News ' ప్రత్యేక కథనం.

 ఓరియంట్ కర్మాగారం ముందు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న భూ నిర్వాసిత గిరిజనులు.
 ఓరియంట్ కార్మాగారం ముందుకు ఊరేగింపుగా వస్తున్న తుడుందెబ్బ ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు
 దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారం 

Scv News Kasipet :-

నాలుగు దశాబ్దాలుగా ఓరియంట్ సిమెంట్ కర్మాగార యాజమాన్యం పై దేవాపూర్ పరిసర ప్రాంతంలోని గిరిజనుల్లో నెలకొన్న అసంతృప్తి జ్వాలలు గిరిజన పోరాట హక్కుల సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో  ఇటీవల ఉద్యమ రూపం దాల్చాయి.తుడుందెబ్బ ఉద్యమంతో ఓరియంట్ యాజమాన్యం దిగివచ్చి నాలుగు దశాబ్దాల తర్వాత నైనా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, నిరుద్యోగ  యువకులకు ఉపాధి,భూనిర్వాసితులకు న్యాయం జరుగుతుందని స్థానిక గిరిజను లు ఆశతో ఎదురు చూస్తున్నారు.

కాసిపేట మండలం దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలోని దట్టమైన అడవులు ఎత్తయిన కొండల మధ్య అభివృద్ధికి ఆమడ దూరంలో గోండు,నాయకపోడు తెగ గిరిజనులు దశాబ్దాలుగా నివసిస్తు న్నారు.వర్షాధార పంటలు పండిస్తూ, అటవి ఉత్పత్తులను అమ్ముకొని జీవనం సాగించేవారు. దేవాపూర్ గుట్టల్లో అపార మైన నాణ్యమైన  సున్నపురాయి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి.ఈ సహజ వనరు లను చూసి1978 ప్రాంతంలో సున్నపు రాయి ముడి సరుకుగా వాడుకుని పరిశ్రమ ఏర్పాటు చేసి సిమెంట్ ఉత్పత్తి చేసేందుకు బిర్లా యాజ మాన్యం ముందుకు వచ్చింది.

దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతం కావడంతో ప్రత్యేక అనుమతుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతులు పొందింది. ప్రభుత్వం ద్వారా  భూసేకరణ చేసి దేవాపూర్ ఏజెన్సీ గ్రామంలో 1981లో  ఆసియాలోనే అతిపెద్ద సిమెంట్ కర్మాగారం నిర్మించి ఉత్పత్తి ప్రారంభిం చింది.ఓరియంట్ యాజమాన్యం పరిశ్రమ ఏర్పాటు ముందు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను అమలు పరచకుండా తుంగలో తొక్కింది. పరిసర గ్రామాల అభివృద్ధి, నిరుద్యోగుల ఉపాధిని విస్మరించింది. ఒకటి, నుండి మూడు ప్లాంట్లను నిర్మాణం చేసి, వాటికి తోడు  పవర్ ప్లాంట్  ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి తీసుకుంటుంది. మూడవ ప్లాంటు పవర్ ప్లాంటు నిర్మాణ సమయంలో 80 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ విస్మరించింది.  మళ్లీ నాలుగవ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి అనుమతులు పొంది, దేవాపూర్, గట్రావుపల్లె గ్రామసభల ధ్వారా అనుమతులు పొందే ప్రయత్నాలు ప్రారంభించింది. దేవాపూర్ లో స్థానిక ప్రజలు గ్రామ సభను బహిష్కరించారు.

 గత నాలుగు దశాబ్దాలుగా ఓరియంట్ యాజమాన్యం ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోకుండా లాభార్జన ధ్యేయంగా ఈ ప్రాంతంలోని నాణ్యమైన సున్నపురాయి ముడి సరుకును  క్లింకర్ గా మార్చి ఇతర రాష్ట్రాలలో పరిశ్రమలకు తరలించి ప్రతి ఏటా వేలాది కోట్ల లాభాలను  ఆర్జిస్తు న్నది. అందులో ఒక్క శాతం కూడా తమ గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం లేదని స్థానికులు తీవ్ర నిరాశ,నిస్పృహల కు గురవుతున్నారు.  

గత నాలుగు దశాబ్దాలుగా దేవాపూర్ పరిసర గ్రామాల అభివృద్ధి, నిరుద్యోగుల కు ఉపాధి 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందంగా తయారైంది. పరిసర ప్రాంత గిరిజనుల అభివృద్ధి కాదు కదా, సిమెంటు పరిశ్రమ ఉన్న దేవాపూర్ గ్రామ అభివృద్ధిని కూడా  పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర అసంతృప్తిలో వున్నారు.

కర్మాగార నిర్మాణంలో భూములు పోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం,ఉద్యోగా లు నేటికీ అందలేదు. సిమెంటు పరిశ్రమ ద్వారా వెదజల్లే కాలుష్యంతో పరిసర  గిరిజన గ్రామాలలో సారవంత మైన నల్లరేగడి భూములు నిస్సారమైన పంటలు పండక కరువు కాటకాలతో తల్లడిల్లుతున్నారు. సిమెంట్ దుమ్ము దులిని పీల్చి ఆస్తమా, కిడ్నీ,క్షయ వాదుల తో గిరిజనులు బాధపడుతున్నారు. వారి కి  కనీస వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. సిమెంట్ పరిశ్రమలో గుత్తేదారుల ద్వారా వేలాది మంది ఉత్తరాది రాష్ట్రాల కు చెందిన కూలీలకు ఉపాధి కల్పిస్తూ, స్థానిక నిరుద్యోగ యువతను పట్టించు కోవడం లేదు. కర్మాగార నిర్మాణ సమయం లో చేసుకున్న ఒప్పందం ప్రకారం భూనిర్వాసితులకు నష్టపరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని, పరిసర  గిరిజన గ్రామాలను దత్తత తీసుకొని రహదారులు రక్షిత మంచినీటి పథకం, ఉచిత విద్య, వైద్యం అందించాలని ప్రభుత్వానికి హామీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికీ హామీలను నెరవేర్చలేదు.

పరిసర గ్రామాల అభివృద్ధి పట్టించుకోవాలని గత నాలుగు దశాబ్దాలుగా ఆదివాసులు చేసే ఆక్రందనలు అరణ్యరోదనలు గానే మిగిలిపోయాయి. తమ సమస్యల పరిష్కారం కోసం రెండు మూడేళ్ళ కొకసారి గిరిజనులు ఉద్యమిస్తూనే ఉన్నారు. తమకు  న్యాయం కావాలని కోర్టుల చుట్టూ సంవత్సరాలుగా తిరిగి వారికీ అనుకూలంగా తీర్పులు వచ్చిన ఓరియంట్ యాజమాన్యం పట్టించుకో లేదు. కోర్టు తీర్పులను కూడా అమలు చేయకుండా ఓరియంట్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా వారిలో నెలకొన్న అసంతృప్తి ఒక్కసారిగా పెల్లుబుకి ఇటీవల తుడుందెబ్బ ఆధ్వర్యం లో ప్రధాన గేట్లను తోసుకొని వెళ్లి కర్మాగా రం ముందు నిరసన వ్యక్తం చేసేదాకా వెళ్లడం ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది .

ఇన్నాళ్ళు...  'ఓరియంట్' బాధిత గిరిజనులను మోసం చేసే ఉద్యమాలు జరిగాయి.?

బిర్లా యాజమాన్యంలోని కేశోరాం సిమెంట్ కర్మాగారం, ఏ సి సి యాజ మాన్యం పరిసర గ్రామాల అభివృద్ధికి, నిరుద్యోగులకు ఉపాధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. వాటన్నిటి కంటే ఎన్నో రెట్లు అధిక ఉత్పత్తి, కోట్లాది  రూపాయల లాభాలను ఆర్జిస్తున్న  దేవాపూర్ ఓరియంట్ యాజమాన్యం మాత్రం పరిసర గ్రామాల అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని గిరిజనులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

గతంలో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని గత నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత గిరిజనులు ఉద్యమిస్తూనే ఉన్నారు. గత నాలుగు దశాబ్దాల ఓరియంట్ చరిత్రలో జరిగిన ఉద్యమాలన్ని స్థానిక గిరిజను లను మోసం చేసి గిరిజనేతర నాయకులు లబ్ధి పొందారని విమర్శలు ఉన్నాయి. బాధిత గిరిజనులతో  సమస్యల పరి ష్కారం కోసం ఉద్యమాలు ప్రారంభించి కొన్ని రోజులు గడిచిన తరువాత నాయ కత్వం వహించిన గిరిజన, గిరిజనేతర నాయకులు యాజమాన్యంతో కుమ్మక్కై ఉద్యమాన్ని విరమింపచేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది...

ఈ ఉద్యమాలకు గిరిజనేతరులైన ఓరియంట్ యాజమాన్య తొత్తులుగా వ్యవహరించే  అగ్రకులాలకు చెందిన వెలమలు,రెడ్లు నాయకత్వం వహిం చడంతో గిరిజనుల సమస్యలు పరిష్కారం కాకుండా అర్ధాంతరంగా మిగిలి పోయిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. వారి స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామ అభివృద్ధి ని,గిరిజనుల సమస్యలను గిరిజనేతర నాయకులు ఓరియంట్ యాజమాన్యానికి పణంగా పెట్టి లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి.

 భూనిర్వాసిత గిరిజనులను పట్టించుకోని తోటి గిరిజన నాయకులు.

 ఓరియంట్  కర్మాగారంలో భూములు కోల్పోయి పట్టెదారులుగా, ఈ ప్రాంతంలో చదువుకొని ఓరియంట్ లో ఉద్యోగాలు సంపాదించిన వారు తోటి గిరిజనులకు జరిగిన అన్యాయాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. 'ఓరియంట్' లో  ఉద్యోగాలు పొంది ఆర్థికంగా బలపడి, వీరిలో కొంతమంది గిరిజన నాయకులుగా ఏదిగారు. వీరు తమ గిరిజన జాతి ప్రయోజనాల కోసం ఉద్యమించక తమ స్వార్థ ప్రయోజనాల కోసం అగ్రకులాల నాయకులతో కుమ్మక్కయ్యారు. అన్యాయానికి గురైన తోటి గిరిజనుల సమస్యలను, గిరిజన గూడాల అభివృద్ధిని పట్టించుకోకుండా వెలమల, రెడ్ల చేతుల్లో బందీలుగా మారి  మందు, విందు జల్సాల కు ఆశపడి వారి స్వార్థం కోసం తోటి గిరిజన సమాజానికి అన్యాయం చేస్తున్నారనే  విమర్శలు ఉన్నాయి. ఓరియంట్ కర్మాగారంలో ఉద్యోగాలలో చేరిన గిరిజన నాయకులు నిర్వాసితులైన గిరిజనులను,గిరిజన గ్రామాల అభివృద్ధిని పట్టించు కోకుండా యాజమాన్యం ఇచ్చే ఉచిత వేతనాలకు ఆశపడి వారి ఏజెంట్లుగా మారి తమకు ద్రోహం చేస్తున్నారని వారిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు

తుడుందెబ్బ ఉద్యమం 'ఓరియంట్ బాధిత  గిరిజనుల ఆశలు నెరవేర్చేనా? 

 ఓరియంట్ కర్మాగారం లోకి ఊరేగింపుగా వస్తున్న బాధిత గిరిజనులు.
ఓరియంట్ సిమెంట్ కర్మాగార నాలుగు దశాబ్దాల చరిత్రలో గిరిజనేతర నాయకు లతో సంబంధం లేకుండా గిరిజన  పోరాట హక్కుల సమితి తుడుందెబ్బ ఆధ్వర్యం లో ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అభి నందనీయం. పరిసర గిరిజన గూడాల నుండి పెద్ద ఎత్తున గిరిజనులను తరలించి  ఓరియంట్ కర్మాగారం ముందు తమ హక్కుల  సాధన కోసం ధర్నా చేయడం సంచలనం కలిగించింది. గిరిజనులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి పోలీసు బందోబస్తును కూడా లెక్కచేయకుండా గేట్లు తన్నుకొని కర్మాగారంలోకి రావడం యాజమాన్యానికి తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

 ఓరియంట్ భూనిర్వాసితుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తుడుం దెబ్బ నాయకులు ఊరేగింపుగా వస్తున్న దృశ్యం.
తుడుందెబ్బకు నాయకత్వం వహించిన స్థానిక  నాయకులు మన న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తారా.. మధ్యలో విరమిస్తారా.. అని గిరిజనుల్లో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే.? ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తుడుందెబ్బలోని కొంతమంది నాయకులు కర్మాగారంలో యాజమాన్యం వద్ద ఉద్యోగులుగా,గుత్తేదారులు గా పనిచేస్తు ఉపాధి పొందుతున్నారు. యాజమాన్యాన్ని కాదని తమ హక్కులు సాధన కోసం చివరి వరకు పోరాడుతారా? మధ్యలో తప్పుకుంటారా? అని బాధిత గిరిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.తుడుందెబ్బ నాయకత్వం లోని కొందరు తమ ఉపాధి కోసం గుత్తేదారులుగా కొనసాగిన తమకు  అభ్యంతరంలేదు, కానీ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఓరియంట్ యాజమాన్యం ఇచ్చే ప్రలోభాలకు లొంగి తమ హక్కులను పణంగా పెట్టవద్దని బాధిత గిరిజనులు కోరుతున్నారు.40 ఏళ్లుగా తమకు జరిగిన  నష్టాన్ని  పూడ్చి న్యాయం జరిగేంత వరకు చిత్తశుద్ధితో ఉద్యమాన్ని కొనసాగించాలని ఓరియంట్ బాధిత గిరిజనులు తుడుందెబ్బ నాయకత్వాన్ని  వేడుకుంటున్నారు.

నోట్ :- ఓరియంట్ సిమెంట్ కర్మాగారం వల్ల ఆదివాసులకు జరిగిన అన్యాయాలు, యాజమాన్యం మోసాలు , నాయకులు చేసిన ద్రోహాలపై సామాజిక చైతన్య వేదిక సోషల్ డిజిటల్  మీడియాలో రేపటి నుండి  ప్రత్యేక వరుస కథనాలను అందించబోతున్నాదని తెలియజేస్తున్నా ము.