ఓరియంట్ బాధిత ఆదివాసులకు జరిగిన అన్యాయం -1
దేవాపూర్ ప్రాంత ఆదివాసుల జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం..!
![]() |
| దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారం |
![]() |
| గిరిజన పోరాట యోధుడు కొమురం భీం |
![]() |
| గిరిజనుల స్థితిగతులను నైజాం ప్రభుత్వం కు వివరించుట హైమన్డార్ఫ్ దంపతుల విగ్రహాలు. |
Scv News Kasipet:--
భూమి,భుక్తి,విముక్తి కోసం ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ కొండల్లో 1940 ప్రాంతంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజన పోరాటయోధుడు కొమురంభీం తిరుగుబాటు చేశారు. కొమురంభీం సాయుధ పోరాటం తెలంగాణ లోని నైజాం ప్రభుత్వంతో పాటు,దేశంలోని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వా న్ని కూడా వణికించింది. కుమ్రంభీం తిరుగుబాటుకు కారణం, అదిలాబాద్ అటవి ప్రాంతంలోని గిరిజనులలో నెలకొన్న అసంతృప్తి గల కారణాలను తెలుసుకొని వాటికి పరిష్కారం మార్గం చూపాలని నైజాం ప్రభుత్వం నిర్ణయించుకుంది. బ్రిటన్ కు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త హేమన్ దంపతులను ఆదిలాబాద్ అడవులకు పరిశీలనకు పంపారు. హేమన్ డార్ఫ్ దంపతులు ఉట్నూరు సమీపంలోని మార్లవాయి గిరిజన గూడం కేంద్రంగా ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాలు అన్ని తిరిగి గిరిజనుల సమస్యలను తెలుసుకుని గిరిజనుల అసంతృప్తికి ప్రధాన కారణం భూమి సమస్యని గుర్తించి నైజాం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అడవి తల్లి బిడ్డలైన గిరిజనులకు అటవీ ఆధారమని, అడవిని నరికి పోడు వ్యవసాయం చేసే గిరిజను లను అటవీశాఖ అధికారులు అడివి నుండి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేయడం వల్లనే గిరిజనులు తమ జీవన్మరణ సమస్యగా గుర్తించి చేసేదిలేక తిరుగుబాటు చేశారని తేల్చారు. కాబట్టి అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులను మచ్చిక చేసుకోవాలంటే భూమిని పంపిణీ చేయాలని నైజాం సర్కారు హేమన్ డార్ఫ్ దంపతులు సూచించారు. వారి సూచనల మేరకే అదిలాబాద్ జిల్లా అడవుల్లో పోడు వ్యవసాయం చేసి నివసించే గిరిజనులకు నైజాం సర్కారు ఒక్కొక్క కుటుంబానికి 15 నుండి 20 ఎకరాల భూముల పట్టాలు ఇచ్చింది.
దీనిలో భాగంగానే దేవాపూర్ అటవీ ప్రాంతంలో ప్రాంతాలలో నివసించే గిరిజనులకు కూడా నైజాం ప్రభుత్వం భూ పంపిణీ చేసింది.చుట్టు ఎత్తయిన కొండలు దట్టమైన అడవి ప్రాంతంలో దేవాపూర్ పరిసర ప్రాంతంలో రాంపూర్, జైతుగూడ,గడ్ పూర్, దేవాపూర్, పెద్ద గూడ, సోనాపూర్, గట్రావపల్లె , పెద్దాపూర్ గ్రామాల్లో గోండు జాతి గిరిజనులు నివసించే వారు. మద్దిమాడ, దేవాపూర్, సోనాపూర్ లో నాయక్ పోడ్ గిరిజనులు నివసించేవారు. దేవాపూర్ ప్రాంతంలో సర్వే నంబర్ 84 పై వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవి. దేవాపూర్ ప్రాంతంలో అప్పటి రోజుల్లో నివసిస్తున్న 62 గోండు, నాయకపోడ్ తెగ గిరిజన కుటుంబాలకు 960 ఎకరాల భూములను నైజాం సర్కారు పంపిణీ చేసింది. ఒక్కొక్క తెగకు 480 ఎకరాలు చొప్పున పంపిణీ చేశారు. మద్దిమాడ, దేవాపూర్ నాయకపు గూడలో నివసించే 32 నాయకపోడు కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 ఎకరాల చొప్పున సర్వే నెంబర్ 84 /4 నుండి,84 /36 వరకు 480 ఎకరాలను పంపిణీ చేశారు. దేవాపూర్, రాంపూర్, పెద్ద గూడ గ్రామాలకు చెందిన గోండు తెగ గిరిజనుల 30 కుటుంబాలకు ఒక్కొక్క కుటుం బాని కి 16 ఎకరాల చొప్పున సర్వే నెంబర్ 84/37 నుండి 84 / 66 వరకు 480 ఎకరాలు పంపిణీ చేసి నైజాం ప్రభుత్వం భూమి హక్కు పత్రాలు ఇచ్చారు.
అప్పటి నుండి 1979 వరకు దేవాపూర్ ప్రాంత గిరిజనులు సారవంతమైన నల్లరేగడి భూముల్లో వర్షాధారంగా కంది, పెసర, తెల్ల జొన్న, మొక్కజొన్న పంటలు పండించేవారు. వీటితో పాటు సమీపం లోని అటవి ప్రాంతంలో సీజన్ లో దొరికే అటవీ ఉత్పత్తులైన జిగురు, తేనే, ఇప్పపువ్వు, తునికి పండ్లు సేకరించి, వెదురుతో తడకలు, బుట్టలు తయారుచేసి మైదాన ప్రాంతాల సంతలకు తీసుకువెళ్ళి విక్రయించి జీవనం సాగించేవారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, గిరిజన గ్రామాలలో కి గిరిజనేతరలైన షావుకార్లు,వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు తక్కువ ధరలకు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసుకొని దోపిడి చేసేవారు. గిరిజన గూడలలో జరిగే పెళ్లిళ్లు, దేవుళ్ళ ఖర్చులకోసం వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వారి భూములను గుంజు కొనేవారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అటవీ ప్రాంతాల్లో గిరిజనులను వ్యాపారులు, భూస్వాముల దోపిడీ నిరాటంకంగా కొనసాగింది. అటవీ ప్రాంతాలలో నివసించే అమాయక గిరిజనులను వ్యాపారస్తులు, భూస్వాములు దోపిడీ చేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా గిరిజన తిరుగుబాట్లు జరిగాయి. 1968- 69 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం లో గిరిజన సాయుధ తిరుగుబాట్లు జరిగాయి. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల్లో ని అసంతృప్తి తిరుగుబాటుకు కారణాలను గుర్తించింది.
గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల దోపిడీ భూ ఆక్రమణలే ప్రధాన కారణమని గుర్తించి 1/70 ఏజెన్సీ చట్టాన్ని తెచ్చింది. ఈ ఏజెన్సీ చట్టప్రకారం గిరిజనులు నివసించే ప్రాంతంలో గిరిజనేతరులు భూములను కొనరాదు. పక్కా నిర్మాణాలను చేపట్టడం చట్టరీత్యా నేరం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 1/70 చట్టం వల్ల అటవి ప్రాంతంలో నివసించే గిరిజనులను గిరిజనేతరుల దోపిడీ, భూ ఆక్రమణల నుండి కొంతమేరకు కాపాడింది. ఏజెన్సీ చట్టం తేవడానికి ముందు గ్రామాలలో ఉన్న వందలాది ఎకరాల భూములు గిరిజనేతరుల అయిన దొరలు భూస్వాములు చేతుల్లోనే ఉన్నాయి. కాసిపేట మండలంలో కూడా అప్పుడు గిరిజనులు ఎక్కువగా ఉన్నా దేవాపూర్,కాసిపేట, ముత్యంపల్లి, ధర్మరావుపేట, మల్కపల్లి గ్రామాలు ఏజెన్సీ గ్రామాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలోని భూములను గిరిజనేతరుల ఎవరు కొనడానికి అమ్మడానికి, వీలులేదు. 1/70 ఏజెన్సీ చట్టం అమాయక గిరిజనుల పాలిట రక్షణగా నిలిచి వారి భూములను వారి ఉనికి కాపాడుతూ వచ్చింది . అటవీ ప్రాంతాల్లో ఉన్న విలువైన సహజ, ఖనిజ సంపదలపై దోపిడి దారుల చూపు పడడంతో పకృతి ఒడిలో జీవనం సాగిస్తూ ఆనందంగా గడిపిన గిరిజన గూడాల లో కల్లోలం లేచింది.
రేపు:- గిరిజనులకు సర్వ హక్కులు కల్పించిన ఏజెన్సీ ప్రాంతంలో కి ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం...!


