ఓరియంట్ బాధిత ఆదివాసులకు జరిగిన అన్యాయం. -9
జాక్వెల్ బావుల నిర్మాణంలో భూములు కోల్పోయిన ఆదివాసీలకు,పరిహారం, పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వడంలో ఓరియంట్ యాజమాన్యం మొండిచేయి.
- న్యాయం చేయాలని ఆదివాసీలు 25 ఏళ్లుగా పోరాటం.
- నాయకుల మోసపూరిత ఒప్పందంతో భూములు కోల్పోయిన 26 ఏళ్లకు పర్మనెంట్ కు బదులు లోడింగ్ ఉద్యోగాలు.
- లోడింగ్ ఉద్యోగంలో చేరక పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని 37 ఏళ్లుగా అవిశ్రాంతి గా రాజీలేని పోరాటం చేస్తున్న కురిసింగ భీమ్ వారసులు.
- హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన అమలు కాని వైనం...
![]() |
| జాక్వెల్ బావుల తవ్వకాల్లో భూములు కోల్పోయి పర్మినెంటు ఉద్యోగాలకోసం హైకోర్టును ఆశ్రయించిన రాంపూర్ ఆదివాసీ నిర్వాసితులు. |
![]() |
| రాంపూర్ వాగులో ఓరియంట్ యాజమాన్యం తవ్విన జాక్వెల్ బావి. |
![]() |
| డ్యూటీలు పెంచాలని ఆందోళనకు దిగిన జాక్వెల్ లోడింగ్ కార్మికులు. |
![]() |
| కర్మాగారం సైలో లో ఎక్కి ఆందోళనకు దిగిన జాక్వెల్ లోడింగ్ కార్మికుడు సిడాం శంకర్ . |
Scv News Kasipet:--
దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పడ్డ ఓరియంట్ సిమెంట్ కర్మా గారం నిర్మాణంలో వందలాది ఎకరాల భూములను అమాయక ఆదివాసులు కోల్పోయారు. కర్మాగార నిర్మాణంలో కోల్పోయిన ప్రతి సెంటు భూమికి పరిహారం ఉద్యోగం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం యాజమాన్యం తుంగలో తొక్కింది. కర్మాగార నిర్మాణంలోనే కాకుండా బయట కర్మాగారం నీటి అవసరాల కోసం సమీప వాగుల్లో తవ్విన జాక్వెల్ బావుల తవ్వకాలలో భూములు కోల్పోయిన వారికి కూడా అన్యాయం చేసింది. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూ నిర్వాసితుల ఆదివాసీలకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సి వున్నా పట్టించు కోలేదు. మా భూములకు పరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని ఆదివాసి కుటుంబాలు రెండున్నర దశాబ్దాలుగా జిల్లా కలెక్టర్,ఐటీడీఏ పీవో అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. స్థానిక నాయకుల మోసపూరిత ఒప్పందం వల్ల 26 ఏళ్లకు కొందరికి తాత్కాలిక లోడింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. లోడింగ్ ఉద్యోగాలు ఇచ్చిన వారికి సరైన డ్యూటీలు కల్పించడంలో యాజమాన్యం విఫలమైంది.లోడింగ్ ఉద్యోగాల్లో చేరి 12 ఏళ్ళు గడుస్తున్నా డ్యూటీలు లేక చాలీచాలని జీతంతో కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారు. తమకు డ్యూటీలు పెంచాలని యాజమాన్యంను గుర్తింపు సంఘం నాయకులను కోరిన ఫలితం లేకపోవడంతో నెలకు ఇరవై డ్యూటీ లైనా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల జాక్వెల్ బావుల నిర్వాసిత లోడింగ్ కార్మికుడు సిడాం శంకర్ కర్మాగారం సైలో (టవర్ ) ఎక్కి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆందోళనకు దిగాడు. కుటుంబాల పోషణ కోసం ప్రాణత్యాగంకు కూడా సిద్ధపడి హక్కులు సాధించు కోవాల్సిన దుస్థితిలో ఆదివాసి నిర్వాసితులు ఉన్నారు..
జాక్వెల్ బావుల తవ్వకాలలో భూములు కోల్పోయిన నిర్వాసి తులకు ఒప్పందం ప్రకారం పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని కురుసింగ భీమ్ వారసులు ఓరియంట్ యాజమాన్యంపై గత 37 ఏళ్లుగా అవిశ్రాంతి గా రాజీలేని పోరాటం చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించిన కోర్టు తీర్పు అమలు చేయించడంలో జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదని నిర్వాసిత బాధిత ఆదివాసీల ఆవేదన.జాక్వెల్ బావుల నిర్మాణంలో భూములు కోల్పోయిన భూనిర్వా సితుల దీనగాథ ఇది ....
ఓరియంట్ జాక్వెల్ బావుల చరిత్ర.
ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఉత్పత్తి, ఇతర నీటి అవసరాలు తీర్చుకునేందుకు రాంపూర్ గ్రామ శివారులోని వాగులో రెండు పెద్ద జాక్వాల్ బావులను 1985 లో తవ్వింది.బావుల నుండి పెద్దపెద్ద మోటార్ల ద్వారా నీటిని కంపెనీ అవసరాల కోసం సరఫరా చేసుకుంది.పై నుండి వచ్చే పెద్దవాగు నీటి మొత్తాన్ని వాడుకోవడంతో వేసవిలో వాగు ఎండిపోయి పశువులకు కూడా తాగునీరు అందేది కాదు. రాంపూర్ గ్రామంలోని బావుల్లో చుక్క నీరు ఉండేది కాదు. నీటి కోసం ఆదివాసులు ఎన్నోసార్లు ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓరియంట్ యాజమాన్యం నీటి అవసరాలు తీర్చుకునేందుకు 2007లో కర్మాగారంలోని క్వారీలోనే సున్నపురాయి తీసుకోగా ఏర్పడ్డ పెద్ద గోతిని మైసమ్మ సాగర్ చెరువుగా మార్చుకొని ఆ నీటిని వాడుకోవడం వల్ల ప్రస్తుతం జాక్వెల్ బావులు తాత్కాలికంగా నిరుపయోగంగా నే ఉన్నాయి.
జాక్వెల్ బావుల నిర్మాణంలో పెద్దవాగు ఉత్తర,దక్షిణ దిక్కుల్లో రాంపూర్ గ్రామానికి చెందిన ఆదివాసి రైతులకు చెందిన 18 ఎకరాల భూమి కోతకు గురై పనికి రాకుం డా పోయింది.కోల్పోయిన భూములకు పరిహారం,ఉద్యోగాలు ఇవ్వాలని 1985 నుండి భూములు కోల్పోయిన 10 మంది ఆదివాసీ కుటుంబాలు యాజమాన్యం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగు తున్నా పట్టించుకోలేదు. అధికారులు, నాయకుల చుట్టూ తిరిగిన ఫలితం లేక పోవడంతో న్యాయం కోసం కోర్టులను ఆశ్ర యించారు. వీరికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిన అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
నాయకుల మోసపూరిత ఒప్పందంతో లోడింగ్ ఉద్యోగాలు .
సిమెంట్ కర్మాగారం నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని ఒప్పందం ఉన్న ఓరియంట్ యజమాన్యం రాంపూర్ నిర్వాసిత గిరిజనులకు అమలు చేయ లేదు.ఉద్యోగాల కోసం గత 26 ఏళ్లుగా రాంపూర్ గిరిజనులు ఆ విశ్రాంతి పోరాటం చేశారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించారు. రాంపూర్ నిర్వాసిత గిరిజన రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టంగా కోర్టు ఓరియంట్ యాజమాన్యా నికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పును అమలు చేయకుండా యాజమాన్యం వారిని మోసం చేసే కుట్రలు చేసింది. కోర్టు ఆదేశాల కాపిలు రాంపూర్ నిర్వాసిత గిరిజనులకు అందకుండా పన్నాగాలు చేసిందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కోర్టు తీర్పు విషయం తెలవక తమ తోటి గిరిజన నాయకుల మోసపు మాటల ను విని తీవ్రంగా నష్టపోయారు.
కోర్టు తీర్పు ప్రకారం రాంపూర్ జాక్ వెల్ నిర్వాసిత గిరిజనులకు పర్మనెంట్ ఉద్యో గాలు ఇవ్వాల్సి ఉన్నా యాజమాన్యం ఇచ్చేందుకు ఒప్పుకోలేదు.పైగా వారిని బుజ్జగించేందుకు కర్మాగారంలో ఉద్యోగు లుగా పనిచేసి వారి తొత్తులుగా మారిన అదే గ్రామానికి చెందిన కొంత మంది గిరిజన నాయకులను రంగంలోకి దించింది. వారు రాంపూర్ నిర్వాసిత రైతులతో మాట్లాడి' మీరు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసిన మీకు పర్మినెంట్ ఉద్యోగాలు రావు, ప్రస్తుతం కంపెనీ ఇచ్చే లోడింగ్ ఉద్యోగాల్లో చేరండి, తర్వాత పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారాని' ఆశలు చూపారు. అప్పటికే 26 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడిన రాంపూర్ నిర్వాసిత రైతులు కొద్ది రోజులకు పర్మినెంట్ చేస్తారని ఆశతో ప్రస్తుతం ఆకలితో అల మటిస్తున్న తమ కుటుంబాలను పోషించుకునెందుకు లోడింగ్ ఉద్యోగాల్లో చేరేందుకు ఒప్పు కున్నారు.2011లో రాంపూర్ నిర్వాసిత గిరిజనులు 8 మంది మరప రాము, మడావి జంగు, చందు,అర్జు,రాము,లింగు, భీమ్, జూగునాక బొజ్జు లకు లోడింగ్ ఉద్యోగాలు ఇచ్చారు.
లోడింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. డ్యూటీలు ఇవ్వడం మరిచారు.
రాంపూర్ నిర్వాసిత గిరిజనులకు తాత్కాలిక లోడింగ్ ఉద్యోగాలు 2011లో కల్పించిన ప్రతి నెలా కనీసం పది డ్యూటీలు కూడా కల్పించలేదు. కొద్ది రోజులకు పర్మినెంట్ చేస్తామన్న హామీ ఇచ్చి లోడింగ్ ఉద్యోగాల్లో చేరేందుకు ఒప్పిచ్చిన నాయకుడు మాట తప్పాడు. లోడింగ్ ఉద్యోగంలో డ్యూటీలు లేక చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించు లేక రాంపూర్ నిర్వాసిత కుటుంబాలు ఆకలితో అలమటించాయ్. భూములు కోల్పోయిన తమకు నెలలో పూర్తి డ్యూటీలు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు.కొద్దిరోజులకు పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని లోడింగ్ ఉద్యోగంలో చేరి 12 ఏళ్లు గడుస్తున్నా కుటుంబాల పోషణకు సరిపడే డ్యూటీలు కల్పించడం లేదని తమకు న్యాయం చేయాలని రాంపూర్ నిర్వాసిత గిరిజనులు సంఘం నాయకులను ప్రజాప్రతి నిధులను కోరినా ఫలితం లేకుండా పోయింది.
కర్మాగార 'సై లో 'ఎక్కి హక్కుల సాధన.
12ఏళ్లు గడిచినా తమకు డ్యూటీలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జాక్వెల్ నిర్వాసిత లోడింగ్ కార్మికుడు సిడాం శంకర్ 2022 లో సైలో పైకి ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గుర్తింపు సంఘం నాయకులు, పోలీస్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపడంతో జాక్వెలిన్ నిర్వాసిత లోడింగ్ కార్మికులతో పాటు, లక్కీ డ్రా లో లోడింగ్ ఉద్యోగాలు పొందిన 30 మంది, నిర్మాణం కోల్పోయిన ముగ్గురు మొత్తం 40 మందికి నెలకు ఇరవై డ్యూటీలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది.
(రేపు జాక్ వెల్ బావుల తవ్వకాలు భూములు కోల్పోయి పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని 37 ఏళ్లుగా అవిశ్రాంతంగా రాజీలేని పోరాటం చేస్తున్న కుర్సింగ భీమ్ వారసుల గురించి )



