మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఓరియంట్ బాధిత ఆదివాసీలకు జరిగిన అన్యాయం - 7

 ఓరియంట్ బాధిత ఆదివాసీలకు జరిగిన అన్యాయం - 7

దేవాపూర్ ఆదివాసి పెద్ద పటేల్ సిడాం జలపతి నే మోసం చేసిన ఓరియంట్ యాజమాన్యం.

- కార్మాగార నిర్మాణంలో 85 ఎకరాల భూమిని కోల్పోతే 35 ఎకరాల భూమికి పరిహారం, ఐదుగురికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది.

- మిగతా 50 ఎకరాలు తమ ఆధీనంలో లేదని ఓరియంట్ యాజమాన్యం బుకాయింపు. 

- 40 ఏళ్లుగా పరిహారం, ఉద్యోగాల కోసం అలు పెరుగని పోరాటం చేస్తున్నా పెద్ద పటేల్ సిడాం జలపతి వారసులు.

 దేవాపూర్ పెద్ద పటేల్ సిడం జలపతి వారసులు.

దేవాపూర్ గ్రామం
Scv News Kasipet :--

రెండు శతాబ్దాల క్రితం వరకు గోండు రాజులు గాంధారి ఖిల్లా రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.  లోయలో ఉన్న కాసిపేట మండలానికి గాంధారి లొద్ది  అనే పేరు కూడా ఉంది. గోండు రాజుల అనంతరం ఈ  ప్రాంతం నైజాం ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళింది. గిరిజన గ్రామాలన్ని గోండు రాజుల వారసులైన గోండు పెద్ద పటేల్ పరిపాలన లో ఉండేవి.గిరిజన గూడలలో వీరి మాటే వేదవాక్కు.వారి ఆదేశాల మేరకు  గోండు గిరిజనులు నడుచుకునే వారు. గిరిజన గ్రామాల, గిరిజనుల సమస్యలే మైనా ఉన్నా పెద్ద పటేల్ ద్వారా నైజాం ప్రభుత్వం తెలుసుకొని పరిష్కరించేది. వీరికి నైజాం ప్రభుత్వం ఆయా గ్రామాల పరిధిలో వంద లాది ఎకరాల భూములు పట్టాలు ఇచ్చి సముచిత స్థానం కల్పిం చింది.గాంధారి లోద్ది గా పిలవబడే కాసిపేట మండలం లోని గిరిజన గూడాలన్ని ముగ్గురూ గిరిజన పెద్ద పటేల్ల ఆధీనంలో ఉండేవి. కాసిపేట శివారులో గోండు గుడాల పెద్ద పటేల్ సోమ్ పటేల్ .ఈ ప్రాంతంలో వందలాది ఎకరాల భూములు అతని పేరిట ఉండేవి. ఇతడి భూముల్లోనే బొగ్గు బావులు తవ్వడం వల్ల  ఆ గనులకు ఇతడి పేరిట సోమగూడెం గనులు అని పేరు వచ్చింది.రెండవ పెద్ద పటేల్ ప్రస్తుత తాటిగూడ గ్రామానికి చెందిన మడావి దేవారం పటేల్. అతడి పేరిటనే దేవారం గూడెం ఏర్పడింది. ప్రస్తుతం తాటిగూడ పంచాయతీగా ఉంది. గ్రామం మొత్తం అతడి వారసులే. ఈ ప్రాంతంలో వంద లాది ఎకరాల భూములు అతని పేరిట ఉండేవి.మూడవ పెద్ద పటేల్ దేవాపూర్ కు  చెందిన సిడాం భీమ్ పటేల్. దేవాపూర్ నుండి సోనాపూర్ వరకు ఉన్న గిరిజన గుడాలన్నిటికీ ఇతనే పెద్ద పటేల్. గిరిజన గూడాలకు నాయకుడిగా అతడు చెప్పింది గిరిజనులు వినేవారు. ఇతనికి కూడా దేవాపూర్ ప్రాంతంలో వివిధ సర్వేనెంబర్ లపై వందలాది ఎకరాల భూములు ఉండేవి.భీమ్ కు ఇద్దరు కుమారులు జలపతి, బిలాజిలు. భీం మరణానంతరం వారసత్వంగా అతని పెద్ద కుమారుడు దేవాపూర్ పెద్ద పటేల్ గా  జలపతి వ్యవహరించేవారు . 

1979లో దేవాపూర్ గుట్టల్లో సున్న పురాయి ఆధారంగా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు బిర్లా యాజమాన్యం పెద్ద పటేల్ జలపతి సహకారాన్ని కోరింది. గిరిజన ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు వల్ల గిరిజన గూడాలు అభివృద్ధి పథంలోకి వస్తాయని ఆశించాడు. స్థానిక  గిరిజన యువతకు ఉపాధి దొరుకు తుంద ని గిరిజన గూడాల పెద్ద మనుషులకు నచ్చచెప్పి సిమెంట్ పరిశ్రమ రావడానికి ఎంతో కృషి చేశారు. ఓరియంట్ సిమెంట్ కర్మాగారం రావడానికి సహకరించిన దేవాపూర్ పెద్ద పటేల్  సిడాం జలపతి కుటుంబాన్ని ఓరియంట్ యాజమాన్యం ఘోరంగా మోసం చేసింది. కుటుంబానికి చెందిన 85 ఎకరాల భూమిని కర్మాగార నిర్మాణంలో స్వాధీనం చేసుకొని 35 ఎకరాలకు పరిహారము, ఐదుగురికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకుంది. మిగతా 50 ఎకరాలకు పరిహారము, ఉద్యోగాలు  ఇవ్వకుండా మొండిచేయి చూపింది. మీ భూమి మా ఆధీనంలో లేదు రెవెన్యూ అధికారులను అడగాలని ఉచిత సలహాలు ఇస్తుంది.  పెద్ద పటేల్ సిడాం జలపతి కుటుంబానికి జరిగిన  అన్యాయం గురించి తెలుసుకుందాం...

 దేవాపూర్ పెద్ద పటేల్ జలపతి కుటుంబ వివరాలు ఇలా ఉన్నాయి.

దేవాపూర్ పెద్ద పటేల్  సిడాం జలపతి, తమ్ముడు బిలాజిలకు దేవాపూర్ ప్రాంతం లో వందలాది ఎకరాల భూములు ఉండే వి. తండ్రి వారసత్వంగా వచ్చిన భూముల ను ఇద్దరు అన్నదమ్ములు పంచుకున్నారు. జలపతి పటేల్ కు జంగు, రామస్వామి అనే ఇద్దరు కొడుకులు, దేవేంద్ర భాయి అనే కూతురు ఉంది. బిలాజి కి తెలంగారావు, రామ్ దాస్ అనే ఇద్దరు కొడుకులతో పాటు జంగుబాయి,లక్ష్మి, అల్లిరాణి అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. జంగు బాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది.

ఓరియంట్ కర్మాగార నిర్మాణంలో జలపతి పటేల్ కోల్పోయిన భూమి వివరాలు ఇలా ఉన్నాయి.

సర్వే నెంబర్ 84 / 66 లో 16.00 ఎకరాలు, సర్వే నెంబర్ 59లో 8.39 ఎకరాలు, సర్వే నెంబర్ 60 లో 6.34 ఎకరాలు, సర్వే నెంబర్ 61 లో 13.29 ఎకరాలు, సర్వే నెంబర్ 62లో 10.23 ఎకరాలు మొత్తం 56.0 5 ఎకరాల భూమి ఓరియంట్  కర్మాగారం నిర్మాణం లో కోల్పోయారు.

జలపతి పటేల్ తమ్ముడు బిలాజి కోల్పోయిన భూమి వివరాలు ఇలా ఉన్నాయి.

 సర్వే నెంబర్ 84 /53 లో 16 ఎకరాలు,సర్వేనెంబర్ 72 లో 6.06 ఎకరాలు, సర్వే నెంబర్ 60 లో  6.34 ఎకరాలు మొత్తం 29 ఎకరాలు సిమెంట్ కర్మాగారం నిర్మాణంలో కోల్పోయారు.

జలపతి పటేల్,బిలాజీ కుటుంబానికి వివిధ సర్వే నంబర్లలోని భూమి మొత్తం 85 ఎకరాల భూమి ఓరియంట్ నిర్మాణంలో కోల్పోగా కేవలం కొన్ని సర్వే నెంబర్లు కు చెందిన 35 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం, ఐదుగురి వారసులకు  ఉద్యోగాలు ఇచ్చారు.

జలపతి కుటుంబ వారసులు  ఉద్యోగాలు పొందిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

*జలపతి, బిలాజీ  కి చెందిన సర్వే నెంబర్ 59 లో 4.10 ఎకరాలు కోల్పోతే జలపతి మనుమడు( కొడుకు జంగు కుమారుడు ) అచ్యుతరావు కు, బిలాజి కొడుకు రామదాసుకు ఉద్యోగం ఇచ్చారు.

* సర్వే నంబర్  84/19 లో బిలాజి కి చెందిన 10.17 ఎకరాల భూమి కోల్పోతే అతడి ఇల్లరికపు అల్లుడు  టేకం రఘు కు ఉద్యోగం ఇచ్చారు.

* సర్వే నెంబర్ 84 / 53 లో  బిలాజి కి  చెందిన 4.14 ఎకరాల భూమి కోల్పోతే అతని పెద్ద కుమారుడు  తెలంగారావుకు ఉద్యోగం ఇచ్చారు.

* సర్వే నెంబర్ 62 / 2 లో జలపతి పటేల్ కి చెందిన 4.09 ఎకరాల భూమి కోల్పోతే అతని చిన్న కొడుకు సిడాం  రామస్వామి కి ఉద్యోగం ఇచ్చారు.

 ( జలపతి పటేల్ పెద్దకుమారుడు జంగు కు స్థానిక గిరిజనుల కోటాలో ఉద్యోగం ఇచ్చారు.)

 ఐదుగురు  పేరిటే ఒక్కొక్కరికి మూడు నాలుగు సార్లు ఉద్యోగాలు ఇచ్చినట్టు రెవెన్యూ అవార్డుల్లో ఓరియంట్ యాజమాన్యం చూపించింది. ( వాటికి సంబంధించిన పూర్తి వివరాలు  ' 'ఓరియంట్  ఉద్యోగాల్లో మోసాలు'శీర్షికన ఇచ్చే కథనాల్లో వెల్లడిస్తాను. )

ఓరియంట్ నిర్మాణంలో  కోల్పోయిన జలపతి పటేల్ కుటుంబానికి చెందిన 50 ఎకరాల భూమికి పరిహారం,ఉద్యోగాల కోసం  బిలాజీ పెద్ద కుమారుడు తెలంగా రావు గత 40 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేశాడు. ఓరియంట్ నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయడం కోసం గిరిజన సొసైటీ నాయకుడిగా  ఓరియంట్ లో కోల్పోయిన భూముల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా వెలికి తీసి న్యాయ పోరాటం చేస్తూ ఓరియంట్ యాజమాన్యం మోసాలను బాహ్య ప్రపంచానికి తెలిపాడు .

 రేపు  :- సిడాం తెలంగా రావు గత 40 ఏళ్లుగా సాగించిన అలుపెరుగని న్యాయ పోరాటం గురించి...