Scv News Kasipet :---
దశాబ్దం క్రితం వరకు కాసిపేట మండలం ముత్యం పల్లి గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.గ్రామంలో రహదారు లు,మురుగు కాలువలు,తాగునీరు లేక స్థానిక ప్రజలు ఎన్నో అసౌకర్యాల మధ్య జీవనం సాగించేవారు. దశాబ్దాలుగా ముత్యంపల్లి గ్రామం కరడు గట్టిన భూస్వామ్య,అగ్రకుల పెత్తందారులకు నిలయం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ప్పటి నుండి ఆ వర్గాలకు చెందిన వారే సర్పంచులుగా ఎన్నిక కావడం ఆనవాయితీ. దశాబ్దాలుగా మండల రాజ్యాధికారం తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తూ గ్రామాలను కూడా శాసించేది ముత్యంపల్లి నాయకులే కావడం గమనార్హం . తమ ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు సర్పంచులుగా ఎన్నికైన నాయకులు పంచాయతీ అభివృద్ధిని అంతగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అవినీతి, అక్రమాలు,అరాచక పాలన సాగించడం ప్రజలకు శాపంగా మారింది. వారి స్వార్థ రాజకీయాల కోసం పంచాయతీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి వచ్చిన నిధులను పప్పు, బెల్లాలుగా తన సొంత అవసరాలకు వాడుకోవడంతో గ్రామాల అభివృద్ధి అడుగంటి పోయింది. వారి అవినీతి అక్రమాలను ప్రశ్నించేవారు,ఎదిరించే వారు లేకపోవడంతో ఇష్టా రాజ్యంగా పాలన సాగింది.ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసేందుకు వారికి సహకరించిన ప్రభుత్వ అధికారు లు,సిబ్బంది సైతం ప్రభుత్వ చర్యలకు బలైన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వారి నిర్వాకం వల్ల గ్రామ పంచాయతీ అభివృద్ధి దశాబ్దాలుగా అంతంత మాత్రంగానే ఉండేది...
నేడు ..ఆ పరిస్థితి పూర్తి గా మారిపోయింది...
బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల పుణ్యాన బహుజన వర్గాలకు చెందిన యువకులు సర్పంచులుగా ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కావడం నిజాయితీ గా ప్రజల కోసం, గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుండడంతో పంచాయతీలోని గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. అగ్రకుల పెత్తందార్ల ఆరాచకాలు, వెలమ దొరల వేధింపులు కూడా తగ్గుముఖం పట్టాయి. వారి వారసుల్లో కూడా కొంత మార్పు వచ్చింది. ప్రజలతో మమేకమై గ్రామాభి వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో గ్రామాల స్వరూపాలే మారిపోతున్నాయి. ప్రస్తుతం తెరాస ప్రభుత్వ హాయంలో సర్పంచిగా గిరిజన యువకుడు ఆడే బాదు, ఉప సర్పంచ్ గా బీసీ వర్గానికి చెందిన బోయిని బాపు, ఎంపీటీసీగా వెలమ దొరల వారసుడు విక్రమ్ రావు తో పాటు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సహకారంతో పంచాయతీ అభివృద్ధికి ఈ మూడేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులు మంజూరయ్యాయి.
పంచాయతీలోని ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు,డ్రైనేజీ మంచినీటి సదుపాయం ఏర్పాటయింది. మారుమూల గ్రామాలకు రవాణా సదుపాయం కోసం వాగుల పై వంతెన,రహదారులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు వైద్యా సదుపాయం కోసం నూతన ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో పాటు, రైతులకు వ్యవసాయంలో మెలుకు వలు నేర్పేందుకు రైతు వేదికలు నిర్మించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనంతో పాటు ప్రజల ఆరోగ్యాలను మెరుగు పరిచేందుకు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు.
యువకులు చెడు మార్గాల వైపు వెళ్లకుండా సక్రమమైన మార్గంలో ప్రయాణించే విధంగా ఉండేందుకు క్రీడలపై ఆసక్తి కలిగించి తమ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు గ్రామంలో జిల్లా స్థాయిలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసు కున్నారు. తెరాస ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన క్రీడా ప్రాంగణాన్ని కూడా ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించాడు. దీంతో మండల క్రీడాభివృద్ధి ముత్యంపల్లి క్రీడా మైదానం వేదిక కానుంది.
తెలంగాణ రాష్ట్రంలో పల్లెటూరి వాతావరణంలో సినిమాల చిత్రీకరణకు ముత్యం పల్లి గ్రామము వేదిక అయింది.రాష్ట్ర ప్రజలకు వినోదాన్ని పంచేందుకు నాటి వెలమ దొరల గడి, భవనం సినిమా షూటింగులకు వేదికగా మారింది. ఇటీవల ఆ గ్రామంలో సినిమాల చిత్రీకరణ జరిగింది.చూసేందుకు కాసిపేట మండలం వాసులే కాక కోల్బెల్ట్ వాసులు కూడా పెద్ద ఎత్తున గ్రామానికి వచ్చారు. ముత్యం పల్లి గ్రామం పేరు రాష్ట్ర స్థాయి సినీ పరిశ్రమలో ప్రత్యేకత సాధించింది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వేదికైన ముత్యం పల్లి పంచాయతీ కాసిపేట మండలంలోని పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామ పంచాయితీ అభివృద్ధి పై Scv News రేపటి నుండి ప్రత్యేక కథనాలను అందిస్తుంది.
( సామాజిక చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ లో రేపు ప్రత్యేక కథనం ఇవ్వబడుతుంది.)





