మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

గిరిజన పోరాట యోధుడు చెన్న వేణి భీమన్న వర్ధంతి నేడు

నేడు!

గిరిజన పోరాట యోధుడు

చెన్న వేణి భీమన్న వర్ధంతి.

 --మద్దిమాడ  పోలీసు

కాల్పుల ఘటనకు 35

ఏళ్లు...


Scv News Kasipet :--

తరతరాలుగా ఈ దేశ మూలవాసులైన గిరిజనులు భూమి, భుక్తి, విముక్తి కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా తమ హక్కుల కోసం పాలకవర్గాలతో పోరాడుతూనే ఉన్నారు. అటవీతల్లి నీడలో పెరిగిన ఆదివాసీలు తమ ప్రధాన సమస్యలైన అటవీ హక్కుల కోసం జల్,జంగల్, జమీన్ కోసం నేటికీ ఉద్యమిస్తూనే ఉన్నారు. గతంలో  బ్రిటిష్ వారి హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కు  చెందిన రాంజీగోండు, నైజాం ప్రభుత్వ హయాంలో జోడేఘాట్ కు చెందిన కొమురం భీంలు ఆదివాసీల కోసం,అటవీ హక్కుల కోసం పోరాడి దోపిడి పాలకవర్గాల  చేతుల్లో అసువులు బాశారు.  స్వాతంత్రం అనంతరం  నేటి పాలకులు కూడా  గిరిజనులకు అటవీ మీద  మీద హక్కులు లేకుండా అదే అణిచివేతకు  పాల్పడితే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని దున్నేవాడికే భూమి ఇవ్వాలని 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి లో గిరిజనులు పోరాటాలకు దిగారు.ఆ పోరాటాన్ని నాటి  ప్రభుత్వం పదుల సంఖ్యలో అమాయక గిరిజనులను కాల్చి చంపి ఉద్యమాన్ని అణచి వేసింది. అయినా గిరిజనులు తమ హక్కుల కోసం నేటికీ ఉద్యమించడం ఆపడం లేదు. గిరిజన పోరాట సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అటవి మీద ఆదివాసీల న్యాయమైన హక్కుల కోసం ప్రభుత్వంపై తిరగబడి తన ప్రాణాలను  సైతం బలి ఇచ్చిన గిరిజన  పోరాటయోధుడు కాసిపేట మండలం మద్దిమాడ  గ్రామానికి చెందిన  చెన్న వేణి భీమన్న. నేడు భీమన్న 35 వ వర్ధంతి సందర్భంగా 'Scv News ' ప్రత్యేక కథనం....

* రాష్ట్రంలో సంచలనం కలిగించిన మద్దిమాడ  పోలీస్ కాల్పులు.

కాసిపేట మండలం మద్దిమాడ గ్రామంలో 1988 ఏప్రిల్ 24న పోలీసులు కాల్పుల   ఘటనకు నేటికీ 35 సంవత్సరాలు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించాడు.  గిరిజనగూడలో ఉన్న గడ్డి ఇళ్ళను చూసి చలించి పోయాడు. వర్షాకాలంలో గడ్డి ఇళ్లలో గిరిజన కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నారని గిరిజన కుటుంబాలు ఎన్టీఆర్ కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గిరిజనులకు నివాసయోగ్యంగా ఉండేవిధంగా గడ్డికి బదులుగా బెంగుళూరు గునలను సరఫరా చేయాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి హామీ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడలలో గడ్డి ఇళ్లను తీసివేసి గున  కప్పుకునేందుకు గిరిజనులు ఇళ్లను  సంసి ద్ధత చేసుకునేందుకు ఇళ్లను ఇప్పు కున్నారు.ఇళ్లపై గున కప్పు కునేందుకు వీలుగా అటవీ నుండి కర్రలను తెచ్చు కోవడం ప్రారంభించారు. కాసిపేట మండలంలోని సోనాపూర్ వెంకటాపూర్, లక్ష్మీపూ ర్, ఘట్ రావు పల్లి ,దేవాపూర్, మద్దిమాడ  గ్రామాలలో గిరిజనులు  అడవి నుండి కలపను తెచ్చి ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. ప్రభుత్వం  నుండి తమకు ఆదేశాలు లేవని అటవీశాఖ అధికారులు గిరిజన గూడాలపై దాడులు చేస్తూ కలపను స్వాధీనం చేసుకుని గిరిజనులపై కేసులు నమోదు చేయడం ప్రారంభిం చారు. అందులో భాగంగానే 1988 ఏప్రిల్ 24న మద్దిమాడ  గ్రామం పై కూడా అటవీశాఖ అధికారులు పోలీసుల సహకారంతో  దాడులు నిర్వహించారు. కలప స్వాధీనం ప్రయత్నించారు.

అటవీశాఖ పోలీసులపై తిరగబడ్డ గిరిజన పోరాట యోధుడు చెన్న వేణి భీమన్న.

మద్దిమాడ  గ్రామానికి చెందిన  భీమన్న  చిన్నప్పటి నుండి కళ్లముందు అన్యాయం జరిగితే సహించేవాడు కాదు. ప్రశ్నించే తత్వం గలవాడు. గ్రామంలో  చురుకైన వ్యక్తి.  ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రజల తరుపున నిలబడి పాలకులను ప్రశ్నించే గొంతు భీమన్నది. గిరిజనులు గడ్డి ఇళ్లను తీసి గున కప్పుకోవాలని స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించిన హామీ మేరకే తాము కర్ర తెచ్చు కున్నామని  దీనికి తమ గిరిజనులను  ఎందుకు తప్పు పడుతు న్నారు తనకు అర్థం కాలేదు. తమ సమీప అటవీ  ప్రాంతంలో నుండి నిత్యం   విలువైన టేకు కర్రలు కలప స్మగ్లర్లు తరలిస్తూ అటవిని ధ్వంసం  చేస్తున్న అటవీశాఖ అధికారులు మామూళ్లు తీసుకుని  పట్టించుకోవడం లేదు. తమ నివాస కోసం తెచ్చిన కర్రను స్వాధీనం చేసుకొని తమపై దొంగల మీద పెట్టిన కేసులు పెట్టడమేమిటని  ఏమిటని మదన పడ్డాడు.అటవీ ప్రాంతంలో నివసించే  గిరిజనుడికి అడవిలోని కర్రతో ఇల్లు కట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ఆలోచించాడు. తమ గ్రామం పై దాడి చేసిన పోలీసు అధికారులను ప్రజల సమక్షంలో ఇవే ప్రశ్నలు అడిగాడు. వారు వినకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము దాడులు చేస్తున్నామని, కేసులు పెడుతున్నామని అన్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గిరిజనులు భీమన్న నాయకత్వంలో అటవీ పోలీసు అధికారులు తమ ఇళ్లలో సోదాలు చేయడాన్ని అడ్డుకోవడానికి నిర్ణయించారు. అనుమతులు లేకుండా కర్ర ఎలా తీస్తారు అని అటవీశాఖ పోలీస్ అధికారులు భీమన్న ను ప్రశ్నించారు. తమ ఇళ్లకు ముఖ్యమంత్రి గున  కప్పుకోవాలని ఆదేశించాడని గడ్డి ఇళ్లకు గున కప్పు కోవాలంటే  వాసాలు తప్పనిసరని అందుకే తెచ్చుకున్నామని ప్రజల తరఫున సమాధానం చెప్పాడు. అయినా  అటవీ శాఖ, పోలీస్ అధికారు లు  వినకుండా దౌర్జన్యంగా ఇళ్లలో చొరబడి కర్రలను స్వాధీనం చేసుకుని గిరిజనులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. సహనం కోల్పోయిన భీమన్న పోలీసు, అటవీ శాఖ అధికారు లకు తిరగబడి గిరిజనులతో కలిసి  కర్రలతో దాడులకు దిగాడు. గిరిజనుల ప్రతిఘటనకు తట్టుకోలేక పోలీసు కాల్పులు చేయడంతో భీమన్న అమరుడయ్యాడు.

పోలీస్ కాల్పులపై దద్ధరిల్లిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.

మద్దిమాడ  పోలీస్ కాల్పులపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గోండ్వానా  సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నేటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్యాధి కారులు బాలు, గోపి ల నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ప్రభుత్వం దిగివచ్చి తన తప్పును తెలుసుకుని సరిదిద్దే ప్రయత్నం చేసింది. అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గా ఉన్న సివీఎస్ కే శర్మ మద్దిమాడ గ్రామాన్ని సందర్శించి పలు హామీలు ఇచ్చారు. గ్రామంలోని నిరుద్యోగ యువతకు స్థానిక సిమెంట్ కర్మాగారం లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి నష్టపరిహారం తో పాటు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నేటికి 35 సంవత్సరాలు గడుస్తున్నా ఆ హామీలు నెరవేరలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పించేందుకు రాష్ట్రంలోనే  మొట్ట మొదటిసారి సోలార్ ప్లాంట్ ద్వారా మంచినీటి పథకాన్ని మాత్రం మంజూరు చేశారు. సరైన మరమ్మతు లేకుండా, పదేళ్ల లోనే చెడిపోయి పనికిరాకుండా పోయింది. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన గిరిజన పోరాట యోధుడు భీమన్న కుటుంబానికి ఎలాంటి సహాయం నేటికీ అందలేదు.

బహుజన వర్గాలు భీమన్న త్యాగాన్ని మరవద్దు.

అడవిబిడ్డల  న్యాయమైన అటవీ హక్కుల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన గిరిజన పోరాట యోధుడు భీమన్న ను కాసిపేట మండలం బహుజన వర్గాలు మర్చిపోవద్దు.  ప్రతి సంవత్సరం సంస్మరణ దినాన్ని మండల నాయకపోడ్ సేవా సంఘం ఘనంగా నిర్వహిస్తూనే ఉంది. గత సంవత్సరం గ్రామంలో భీమన్న శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. భీమన్న సంస్మరణ దినోత్సవలలో నాయక్ పోడు  గిరిజనులే కాకుండా అన్ని వర్గాల గిరిజనులు,బహుజనులు అంతా కూడా ఐకమత్యంతో పాల్గొని అతడి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని 'scv News' సోషల్ మీడియా గ్రూపు కోరుతుంది.