మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దొరల కాసిపేట గురించి తెలుసుకుందాం!


 బహుజన పోరాటయోధుల
చరిత్రను తెలుసుకునే
ముందు నైజాం ప్రభుత్వ హాయంలో మొదలైన  దొరల కాసిపేట గురించి,నైజాం ప్రభుత్వం, దానికి  వ్యతిరేకంగా సాగిన  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి  తెలుసుకుందాం!.

Scv News Kasipet:--

గాంధారి లోద్ధి లోని కాసిపేట మండలం అంటేనే దొరల కాసిపేట అనే పేరు. కాసిపేట మండలం లోని సుమారు యాభై గ్రామాల పరిధిలోని భూములన్ని 80% వెలమ దొరల అధీనంలోనే ఉండేవి. రాజకీయ పెత్తనమంతా వారిదే. వెలమ దొరలు ఆదేశాలను ధిక్కరించి బహు జనుల అయినా ఎస్సీ, ఎస్టీ,బీసీలు, మైనారిటీలు ఏ పనిచేసే వారు కాదు. స్వేచ్ఛగా వారిని ఎదిరించి బ్రతికే వారు కాదు,వారి మాటే శాసనం . అందుకే కాసిపేట అంటేనే దొరల కాసిపేట అనే పేరు స్థిరపడింది.

భూస్వాములు ఎలా అయ్యారు!

నైజాం ప్రభుత్వ హాయంలో మండల పరిధిలోని గ్రామాల్లోని బహుజన కులాలకు చెందిన గిరిజనులు,దళితులు, వెనుక బడిన కులాలవారు  తమ రక్తాన్ని చెమటగా చేసి అడవులు నరికి పోడు వ్యవసాయం చేసి అటవీ భూములను సాగులోకి తెచ్చారు. వర్షాధారంగా జొన్న, కంది, పెసర,పండించుకుంటూ జీవనం సాగించేవారు. నైజాం ప్రభుత్వం వద్ద గ్రామాలలో భూమిశిస్తు పన్నులు వసూలు చేసే జాగీర్దారులుగా పట్వారీలుగా,పోలీస్ పటేల్ లు విధులను వెలమ దొరలు, రెడ్లు నిర్వహిస్తూ ఉండేవారు. బహుజన వర్గాలకు నిరక్షరాస్యత ,చైతన్యం లేకపోవడం వల్ల తాము సాగు చేసుకుంటున్న భూములకు రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేసుకోవాలనే సోయి లేకుండా ఉండేది. ఇదే అదనుగా నైజాం వద్ద తమ పలుకుబడిని ఉపయో గించి  వెలమ దొరలు, రెడ్లు గ్రామాల పరిధిలో ఉన్న చదునైన,సారవంతమైన వందలాది ఎకరాలభూములను నాగలితో దుక్కులు దున్న కుండ, చెమట చుక్కలు చిందించకుండా  తమ పేరిట,కుటుంబ సభ్యుల పేరిట వందలాది ఎకరాల సాగు భూములన్నింటిని రెవెన్యూ రికార్డు లలోఎక్కించుకుని  భూస్వాములుగా మారారు.

ప్రస్తుతం గాంధారి లోద్ధి పరిధిలోని మందమర్రి, కాసిపేట  తిర్యాని మండలాల పరిధిలోని  వేలాది ఎకరాల భూములు వెలమ దొరల ఆధీనంలోకి వెళ్లాయి. ఇందారం, నస్పూర్ జాగీర్దార్లు,హాజీపూర్ దొరలతో పాటు కాసిపేట,ముత్యంపల్లి ,మందమర్రి, మల్కపల్లి, ధర్మారావుపేట్  గ్రామాలకు చెందిన వెలమ దొరలు, ధర్మారావుపేటలో రెడ్డిల ఆదీనంలో వందల ఎకరాల భూములు ఉండేవి. మండలంలో సుమారు 70 శాతం భూములన్నీ రెండు మూడు కుటుంబాల చేతుల్లోనే ఉండేవి. పేదలకు భూపంపిణీ చేయాలని అంబేద్కర్ హయాంలోని రిపబ్లికన్ పార్టీ ఢిల్లీలో  చేసిన పోరాట ఫలితంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చింది. ప్రభుత్వం సీలింగ్ చట్టాల కింద భూస్వాముల  వద్ద ఉన్న వందలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని బహుజన వర్గాలకు పంపిణీ చేసింది. రాజకీయ ఆధిపత్యంలో ఉన్న వెలమ దొరలు,రెడ్లు రెవెన్యూ శాఖ తో కుమ్మక్కై సీలింగ్ భూములను పేదలకు పంచకుండా  వారి దగ్గర పనిచేసే పాలేర్లు,చాకలి,మంగలి దళితుల పేరిట నమోదు చేయించి భూమి పత్రాలను  వారి వద్దనే ఉంచుకున్నారు.సీలింగ్ భూములు తమ పేరిట ఉన్నాయన్న  విషయము నేటికీ బహుజనులకు తెలవదు.

ప్రస్తుత రోజుల్లో వెలమ దొరలు,రెడ్ల  వారసులు  భూముల ధరలు పెరగడంతో సీలింగ్ చట్టం  కింద ప్రభుత్వం  దొరల వద్ద  స్వాధీనం చేసుకుని పేదలకు పంచి న భూములను తిరిగి స్వాధీనం చేసుకొని బయట విక్రయిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వారి దగ్గర ఉన్న  భూములను సాగు చేయకుండా  బహుజన కులాలకు చెందిన  రైతులకు కౌలుకు ఇస్తూ వారి వద్ద కౌలు డబ్బులు తీసుకుంటూ, ప్రభుత్వం నుండి రైతుబంధు  పథకం ద్వారా లక్షల రూపాయలు తీసుకుని విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. 

నైజాం కాలంలో  దొరల పాలనలో బహుజనుల జీవితాలు ఎలా ఉండేవంటే...

అప్పటి దొరల పాలనలో బహుజనులకు ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఇవ్వ కుండా కనీసం మనుషుల్లాగా కూడా చూడకుండా  కట్టుబానిసలాగా వాడు కున్నారు.తమ వ్యవసాయ పనులు, ఇంటి పనులు  వారితో  చేయించుకుని ఎలాంటి ప్రతిఫలం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకున్నారు. వారు నివసించే భవనాలను గ్రామాలలో లోని కూలీలతో, రైతులతో వెట్టికింద కట్టించుకున్నారు . రైతులు ఎడ్లబండ్ల ద్వారా సమీపంలో ని అడవుల నుండి  విలువైన టేకు చెట్ల దుంగలను తెచ్చి తలుపులు దర్వాజాలు పెట్టుకున్నారు. వెలమ దొరలు బహుజన ప్రజలపై  మానవత్వం లేకుండా పైశాచికంగా వ్యవహరించేవారు. వారు  వేరే గ్రామాలకు ప్రయాణంపై  ఎడ్లబండి పై వెళ్తుంటే ముందు, వెనక చాకలి, మంగలి పరిగెత్తే వారు. పరుగెత్తే ఆసరా లేక కింద పడి చనిపోయిన వారు ఎందరో ఉన్నారు. వారి ఇళ్ల ముందు చెప్పులు వేసుకొని తిరగడం కూడా నేరంగా భావించేవారు.

బహుజనులకు ఏదైనా కష్టం వచ్చి గోడు చెప్పుకునేందుకు వారి గడిలకు వెళితే కూర్చునే వీలులేదు.వారిని తల ఎత్తుకొని చూడకుండా తలనేలకు వేసి చేతులు కట్టుకుని గంటల  తరబడి దర్వాజా ముందు నిలబడి వచ్చిన కష్టాలు దొరలతో చెప్పుకునే వారు. వారి  కళ్ళముందు  కొత్త బట్టలు వేయడం,ప్యాంటు షర్టు వేయడం, తల దువ్వుకుని అందంగా కనబడడం, చదువుకోవడం మహా నేరంగా భావించి శిక్షలు వేసిన సందర్భాలు కోకొల్లలు. చాకలి,మంగలి, మాల, మాదిగల  పరిస్థితి మరీ దారుణంగా ఉండేది.' బాంచెన్  కాల్మొక్త దొరా!' అంటూ రోజుల తరబడి ఇంట్లో వెట్టిచాకిరి చేస్తూ వారు  తినగా మిగిలింది  తింటూ కడుదీనంగా జీవిస్తూ  ఇంటి ముందే  కాపలా ఉండేవారు. వారిని 'ఓరేయ్, ఒసేయ్' అంటూ  బండ బూతులతో తిడుతూ  పిలిచేవారు. అప్పటి రోజుల్లో దొరలను ఎదిరించి బ్రతికి బట్ట కట్టిన బహుజనులు ఎవరూ లేరనడం అతిశయోక్తి కాదు .

దొరల దౌర్జన్యాలకు  వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాట్లు.

 తెలంగాణలో నైజాం పరిపాలనకు , రజాకార్లు, జాగీర్దారుల, దొరల దోపిడీ, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల నుండి తిరుగుబాటు బయలు దేరింది. దానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ లోని అన్ని పల్లెలకు తాకింది. కమ్యూనిస్టు పార్టీ జాగీర్దారుల దొరలు దగ్గర ఉన్న   లక్షలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని ప్రజలకు పంపిణీ చేశారు. కమ్యూనిస్టుల పరిపాలనలోకి తెలంగాణ వెళుతుందని భయంతో అప్పటి  నెహ్రూ సైన్యాలు వచ్చి తెలంగాణలో పోలీసు చర్యలకు పాల్పడ్డారు. వెంటనే నైజాం నవాబు భారత సైన్యానికి లొంగిపోయారు. తర్వాత భారత ప్రభుత్వ సైన్యాలు కమ్యూనిస్ట్ దళాల అనిచివేత పాల్పడ్డాయి. వేలాది మంది కమ్యూనిస్టు యోధులను హతమార్చి కమ్యూనిస్టు రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచి వేశారు.

రైతాంగ సాయుధ పోరాట క్రమంలో భూస్వాముల అంతా పట్టణాలకు పారిపోయారు. నైజాం పాలన అంతమైన తర్వాత  కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీ టోపీలు పెట్టుకుని మళ్లీ గ్రామాలలో కి వచ్చారు.కమ్యూనిస్టులు స్వాధీనం చేసుకున్న లక్షలాది ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ భూస్వాములలైన వెలమ దొరలు రెడ్లకు  కట్టబెట్టారు. గ్రామాల్లోని పరిపాలన అంతా మళ్లీ  భూస్వాముల చేతుల్లోకి వెళ్లింది.

 కాసిపేట లో కమ్యూనిస్టు ఉద్యమం, గెరిల్లాల చేతిలో వెలమ దొర కాల్చివేత.

కాసిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో  కూడా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రైతాంగ సాయుధ పోరాటం  జరిగింది. సమీపంలోని అడవులలో కమ్యూనిస్టు  గెరిల్లా దళాలకు స్థావరంగా ఉండేది. రజాకార్లకు రొట్టెపెళ్లి కేంద్రంగా స్థావరం ఉండేది. మండలంలోని గ్రామాలలో రజాకార్లకు దొరల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఉద్యమాలు నడిపారు. కాసిపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి గ్రామంలో బహుజన ప్రజలను పీడించి ప్రజాకంఠకకుడి గా మారిన ఒక  వెలమ దొరను పట్ట పగలు నడిరోడ్డుపై కమ్యూనిస్టు గెరిల్లాలు కాల్చిచంపిన  సంఘటనలు ఉన్నాయి. నైజాం ప్రభుత్వం పతనమైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాసిపేట మండలంలో కూడా భూములు,పరిపాలన అంతా మళ్లీ  భూస్వాములైన వెలమ దొరల చేతుల్లోకి వెళ్లింది. 

 నేడు కూడా అప్పటి దొరల పాలన సాగుతోంది!

 నేడు కూడా నైజాం ప్రభుత్వ హాయంలో సాగిన అరాచక పాలన సాగుతోంది. బహుజనులను దొరలు అలానే హింసిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీలో చేరి రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తు మళ్లీ అవే అణచివేతకు దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడుతునే ఉన్నారు. మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి అంబేద్కర్ పుణ్యాన వచ్చిన రాజకీయ రిజర్వేషన్లు వల్ల బహుజనులకు పదవులు దక్కాయి. పంచాయతీరాజ్ ఎన్నికల్లో సర్పంచ్లుగా, ఎంపీపీ గా, జడ్పీటీసీలు గా బహుజనులు పదవులు పొందిన వారిని స్వేచ్ఛ గా పరిపాలనను సాగించనివ్వడం లేదు . బహుజనులలో తాను చెప్పిన మాట విని తన కింద బానిసలా బతికే వారిని కొందర్ని ఎంపిక చేసి ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించు కొని మండలంలో రాజకీయ పెత్తనం చెలాయిస్తున్నారు. వాళ్లను వ్యతిరేకిస్తే, వారి మాటలు వినకుంటే  వారి తాత,ముత్తాతల వలనే వీరు  వేదింపులకు గురిచేస్తూ  దాడులకు పాల్పడుతున్నారు.గ్రామాల అభివృద్ధికి వచ్చే ప్రభుత్వ  ధనాన్ని తమ స్వప్రయోజ నాలకు  వాడుకుంటూ  మండల గ్రామాల అభివృద్ధికి అవరోధాలుగా నిలుస్తున్నారు.

 (వెలమ దొరల అరాచకాలకు 50 ఏళ్లుగా  ఎదురునిలిచి బహుజన వర్గాలకు అండగా ఉంటూ గ్రామాలఅభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న అలుపెరుగని బహుజన పోరాటయోధుడు గురించి రేపు తెలుసుకుందాం.)