మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బన్న అశన్నా సర్పంచ్ 1981లో ప్రజా జీవితం ప్రారంభం.





Scv News Kasipet :--

 బహుజన వర్గాలలోని కొందరు వ్యక్తులు అగ్రకుల పెత్తందార్లు,దొరలు తమకు కనీస గౌరవం ఇవ్వకుండా హీనంగా చూస్తూ, పీడిస్తూ అన్ని రకాలుగా దోచుకున్న పట్టించుకోరు. వారు ఇచ్చే మందు విందు పార్టీలకు,వారి ప్రలోభాలకు ఆశపడి వారు ఎన్ని దుర్మార్గాలు చేసినా వారి గురించి గ్రామాలలో గొప్పగా ప్రచారం చేస్తుంటారు. బహుజన వర్గాలలోని ఒక దళితుడు తన ప్రజలకోసం అగ్రవర్ణ పెత్తందారులకు ఎదురు నిలిచి వారు గ్రామాలలో చేయ నటువంటి  అభివృద్ధి పనులు చేసిన వాళ్లు పట్టించుకోరు. కనీస గౌరవం ఇవ్వరు. అతడు చేసిన మంచి పనులను  పొగిడే ఎందుకు  వారి మనసు ఒప్పదు. బన్న ఆశన్న 18 ఏళ్ల సర్పంచ్ పదవి కాలంలో చేసిన అభివృద్ధి పనులను అగ్రవర్ణ పెత్తందార్ల అయిన సర్పంచులు చేసిన అభివృద్ధి పనులను పోల్చుకుని  చూస్తే తెలుస్తుంది. బన్నా ఆశన్న  చేసిన  పనులు ఏమిటో, అతని గొప్పతనం ఏమిటో.... మండల బహుజన సమాజమా గుర్తించండి!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి టి.అంజయ్య హాయంలో 1981లో పంచాయతీరాజ్ లో  రిజర్వేషన్లు ప్రకటించి పంచాయితీ ఎన్నికలు నిర్వహించింది.అప్పుడు కాసిపేట మండలంలో 6 పంచాయితీలు  కాసిపేట, ముత్యంపల్లి, పల్లం గూడెం, ధర్మారావుపేట, మల్కపల్లి, దేవాపూర్ పంచాయతీలు మాత్రమే ఉండేవి. బన్న ఆశాలు 1981లో కాసిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీచేసి సోమగూడెం పాతబస్తీకి చెందిన సిపిఐ అభ్యర్థి విలియం మీద 80 ఓట్ల తేడాతో గెలుపొందాడు. మిగతా 5 పంచాయతీల కు ముత్యంపల్లిలో పూస్కూరి వెంగల్ రావు, పల్లగూడెంలో నవనందుల తిరుపతి,ధర్మరావుపేట లో సీతారాం, మల్కపెళ్లిలో సిడం జంగు, దేవాపూర్ లో సామ లచ్చిరెడ్డిలు సర్పంచులు గా ఎన్నికయ్యారు.

- సర్పంచ్ గా గ్రామాల అభివృద్ధికి ఎనలేని కృషి.

బన్న ఆశాలు సర్పంచిగా మండలంలోని మిగతా పంచాయితీలలో జరగని అభివృద్ధి కాసిపేట పంచాయతీలో జరిగింది. మిగతా సర్పంచులు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే రోజ్ గార్ ఇతర నిధులను తమ సొంత అవసరాల కోసం వాడుకుని గ్రామాల అభివృద్ధిని విస్మరిస్తే, . బన్న ఆశాలు మాత్రం పంచాయతీ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన  ప్రతి పైసా పంచాయతీ కోసమే ఖర్చు చేసి గ్రామాలను అభివృద్ధి పథంలోకి నడిపాడు. మండల కాంగ్రెస్ నాయకుడిగా అప్పటి లక్షెట్టిపేట సమితి  ప్రెసిడెంట్ గా ఉన్న జీవీ శ్రీనివాసరావు అండతో పంచాయితీకి ప్రత్యేక నిధులు మంజూరు చేయించుకుని ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ  గ్రామాల అభివృద్ధి పనులు చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు సార్లు ఉత్తమ సర్పంచి అవార్డుకు  ఎంపికయ్యాడు.

సర్పంచిగా మొదట కాసిపేట గ్రామంలో వీధుల్లో  రహదారుల వెడల్పు.పంచా యతీలోని గ్రామాలన్నీటికీ విద్యుత్ సదుపాయం.

సర్పంచ్ గా ఎన్నికైన వెంటనే గ్రామంలో వీధులన్నీ ఆటోలు కూడ వెళ్లే పరిస్థితి లేక  ఇరుకుగా ఉండేవి. అలాంటి రహదారు లను వెడల్పు చేయించి మట్టి రోడ్లు వేయించాడు.ఇండ్లలోని మురికినీరు వెళ్లేందుకు డ్రైనేజీలు నిర్మాణం చేపట్టారు. కాసిపేట గ్రామానికి 1962లో సర్పంచి మేడ దుర్గయ్య హాయంలో  విద్యుత్తు వచ్చింది. విద్యుత్తును దొరల ఇండ్లకు వ్యాపారస్తుల ఇండ్లకు  మాత్రమే ఉండేది. బహుజనుల ఇండ్లకు, పంచాయతీలోని  ఇతర గ్రామాలకు 1984 వరకు కూడా  విద్యుత్ సదుపాయం లేదు. బన్న ఆశాలు  సర్పంచిగా వచ్చిన తర్వాత  పంచాయతీ పరిధిలోని 13 గ్రామాలకు సండ్రాల్ పహాడ్, పెద్దనపల్లి దుబ్బగూడెం, సోమగూడెం, లంబాడి తండ, మామిడి గూడెం, తదితర గ్రామాలన్నింటికీ విద్యుత్ సదుపాయం కల్పించారు.

 విద్యుత్తు అనుమతుల కోసం వెళ్లి ప్రమాదంలో తీవ్ర గాయాలు.

మామిడిగూడానికి విద్యుత్ సదుపాయం అనుమతి కోసం 1984లో నిజామాబాద్ లోని విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి వస్తుండగా లక్సెట్టిపేట దగ్గర ఇటిక్యాల వద్ద లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.ఆ ప్రమాదంలో లారీ లోని  ఆరుగురు వ్యక్తులు చనిపోగా  ఆశన్నకు కాళ్లకు, తలకు, పక్కటెముకలు విరిగిపోయి తీవ్రంగా గాయపడి  ప్రాణాపాయస్థితి నుండి బయట పడ్డాడు.

 పంచాయతీలోని 213 మందికి ఇళ్ల స్థలాల పంపిణీ.  మూడు గ్రామాల ఏర్పాటు,ఆశన్న  పేరిట అశోక్ నగర్  ఏర్పాటు.

 1984- 85 మధ్య కాలంలో సోమగూడెం ట్యాంక్ బస్తిలో 150 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడంతో కొత్త కాలనీ ఏర్పాటు చేశారు. దుబ్బగూడెంలోని  తూర్పు వాడాలో 27 మందికి ఇంటి స్థలాలు చూపించడంతో కొత్త కాలని ఏర్పడింది.

 కాసిపేట లోని దళితవాడలో ని 36  కుటుంబాలకు సల్ఫల వాగు ఒడ్డున ప్రభుత్వ స్థలంలో ఇంటి స్థలాలు ఇచ్చి కొత్త కాలనీ ఏర్పాటు చేశారు. దళితులు  కృతజ్ఞతతో ఆశన్న పేరుతో  అశోక్ నగర్ కాలనీగా నామకరణ చేసుకున్నారు.

 బహుజన రైతుల ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం.

 కాసిపేట గ్రామానికి తూర్పు, దక్షిణ ప్రాంతాల గుండా సల్ఫల వాగు, రాళ్లవాగు, పెద్దనపల్లి వాగు లు   ప్రవహిస్తుంటాయి. వర్షాకాలంలో వాగుల నీరంతా వృథాగా గోదావరి లో కలిసి పోతు ఉండేవి. కాసిపేటకు 1962లో విద్యుత్తు రావడంతో వాగుల నీటిని  పెద్దపెద్ద మోటార్ల ద్వారా ఎత్తిపోతల పథకాలు పెట్టుకొని వెలమ దొరలు తమ సాగు భూములకు నీరందించుకుని పంటలు పండించుకునేవారు. వాగుల  ఒడ్డున బహుజన రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములు ఉన్న విద్యుత్ సదుపాయం లేక బీడు భూములుగానే ఉండేవి. 1984లో బన్న ఆశన్న వాగుల పై విద్యుత్ లైన్లు వేయించి స్థానిక సరస్వతి  గ్రామీణ బ్యాంకు నుండి విద్యుత్తు మోటార్లకు రైతులకు రుణాలు ఇప్పిం చడం జరిగింది. అప్పటి నుండి కాసిపేట, సండ్రాలపహాడ్, పెద్దనపల్లి, సోమగూడెం గ్రామాల పరిధిలో  బహుజన రైతులు  విద్యుత్ మోటార్లు పెట్టుకొని వందలాది ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించి  పంటలు పండించుకుంటూ సుఖ సంతోషాలతో ఉన్నారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా పంచాయతీ భవన నిర్మాణం.గ్రంథాలయం ఏర్పాటు.

బన్న ఆశన్న సర్పంచ్ గా  ఒకవైపు గ్రామాల అభివృద్ధి చేస్తూనే భవిష్యత్ తరాల కోసం పలు నిర్మాణాలు చేపట్టారు. అందులో పంచాయతీ భవనం నిర్మాణం, గ్రంధాలయ ఏర్పాటు ప్రధానమైనవి. పంచాయతీ భవనం నిర్మాణం 1984 శంకుస్థాపన జరిగి 1992లో ప్రారంభో త్సవం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ పంచాయితీలో లేనివిధంగా సుందరంగా నిర్మించారు. పంచాయతీరాజ్ అధికారులు జిల్లాలో ఉత్తమ పంచాయతీ భవనలకు పోటీలు నిర్వహించారు. ఆ పోటీలో నిర్మల్  జిల్లా గాజుల నర్సాపూర్ , కాసిపేట పంచాయతీ భవనం పోటీపడగా కాసిపేటకు  ప్రథమ బహుమతి వచ్చింది. పంచాయతీ భవనం గత 30 ఏళ్లుగా మండలంలోని రాజకీయ పార్టీలకు, బహుజన సంఘాల సమావేశాలకు వేదికగా నిలుస్తుంది.

ప్రజలను జ్ఞానవంతులు చేసేందుకు మండలంలో మొట్టమొదటిసారిగా 1982లో గ్రంథాలయయాన్ని మంజూరు చేయించారు. పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజలు నిర్మించి ఫర్నిచర్ సమకూర్చి గ్రంధాలయం నడిపించేందుకు కృషి చేశాడు. ఇలా సర్పంచిగా బన్న ఆశన్న అగ్రకుల సర్పంచులు  తమ పంచాయతీలలో బహుజన ప్రజలకు  చేయలేని పనులు తాను చేసి అభివృద్ధి అంటే ఏమిటో బాహ్య ప్రపంచానికి చూపించారు.( రేపు బన్న ఆశన్న ఉద్యమ జీవితం గురించి ఇవ్వడం జరుగుతుంది.)