కాసిపేట మండలంలో నైజాం కాలంలో ప్రారంభమైన అగ్రకుల దొరల అరాచకాలు ఎదిరించి నిలిచి బహుజనులకు అండగా చివరి శ్వాస వరకు ఉద్యమించిన బహుజన పోరాటయోధుడు బన్న ఆశలు మృతికి సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది.
బన్న ఆశాలు కాసిపేట మండలంలో అతడు సాగించిన ఉద్యమాలు, అతని జీవితంపై సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక కథనం.
Scv News Kasipet :--
అగ్రకుల దొరల కాసిపేట మండలం గా పేరు గాంచిన మండలంలో వారి అరాచకాలను ఎదిరించి బహుజనులకు కోసం పోరాడిన యోధుడు బన్న ఆశాలు. రాజ్యాధికారం,పోలీసులు,రెవెన్యూ యంత్రాంగాన్నిచేతిలో పెట్టుకొని బహుజన వర్గాలకు స్వేచ్ఛ లేకుండా అణచివేస్తూన్న రోజుల్లో 1981లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బహుజన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ పంచాయ తీరాజ్ ఎన్నికలు నిర్వహించింది. ఆ ఎన్నికల్లో రిజర్వేషన్ల వల్ల ఎస్సీ,ఎస్టీ, బీసీలు పంచాయతీ సర్పంచులు గా, సమితి ప్రెసిడెంట్లుగా ఎన్నిక కావడం ప్రారంభమైంది.తెలుగు దేశం ప్రభుత్వ హాయంలో 1985 లో మండల వ్యవస్థ ఏర్పడింది.మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపిపి,జడ్పిటిసి ఎన్నికలు మొదల య్యాయి.మండలస్థాయిలో సర్పంచి, ఎంపీపీ ఎలాంటి ఎన్నికలైనా దొరల కనుసన్నల్లోనే జరిగేవి. గ్రామాలలో వారికి బానిసలుగా ఉన్న వారిని వారి ఇండ్లలో ఊడిగం చేసే వారికి పదవులు కట్ట పెట్టేవారు. వారిని డమ్మీలుగా పెట్టుకొని అధికారమంత వారే చలాయించే వారు.వారికి వ్యతిరేకంగా ఎవరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలులేదు. వ్యతిరేకంగా ఎవరైనా ఎన్నికలో నిలిస్తే వారిని నానా రకాలుగా వేధింపులకు గురిచేసేవారు. వారిని ప్రశ్నించిన యువకులను నక్సలైట్లతో తిరుగు తున్నారని, వారి సానుభూతిపరులని ముద్రలు వేయించి పోలీసులచే వేధింపులు,హింసలకు గురి చేసేవారు. గ్రామాల్లో తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న యువకులను పోలీసులకు పట్టించి,మల్లి వారే విడిపించి తన అనుచరులుగా మార్చుకునేవారు.వారి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే కిరాయి గుండాలతో దాడులు చేయించే వారు.
ఇలాంటి కరడుకట్టిన వెలమ దొరల పాలనను దౌర్జన్యాలను ఎదిరించి, బహుజన వర్గాలకు అండగా ఉంటూ ఎన్నో కష్ట,నష్టాలకు ఓర్చి 50 ఏళ్లుగా బహుజనుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న బహుజన పోరాట యోధుడు బన్న ఆశన్న. మండలంలో వెలమ దొరల రాజకీయ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ నిలబడడం మామూలు విషయం కాదు. వెలమ దొరల ప్రలోభాలకు లొంగకుండా, దాడులకు భయపడకుండా ఓకే పార్టీలో ఉంటూ బహుజన ప్రజలకు అండగా ఉన్న నిజాయితీపరుడు బన్న అశన్న.
అప్పటి రోజుల్లో బహుజనుల పిల్లలను చదువుకుంటే వెలమ దొరలు సహించే వారు కాదు. 'చదువుకొని ఏం చేస్తార్రా ' అంటూ తల్లిదండ్రులను బూతులు తిడుతూ చిన్నతనం నుండే దొరల ఇళ్లల్లో పశువుల కాపరులుగా,పాలేరుగా, పంట చేనులకు కాపలదారులుగా వెట్టి చాకిరి చేయించుకునేవారు. బన్న ఆశన్న తండ్రి రాజయ్య దొరల మాటలు లెక్కచేయ కుండా అతికష్టంగా ఆశన్నను 8వ తరగతి వరకు చదివించాడు. చదువుకొని జ్ఞాన వంతుడు అయన ఆశన్న తన తోటి బహుజన పిల్లలు కూడా జ్ఞానవంతులు కావాలంటే చదివే ముఖ్యమని చిన్నప్పుడే తెలుసుకున్నాడు. చదువు ప్రాముఖ్యత తెలుసుకున్న ఆశాలు బహుజనుల పిల్లలు చదువు కుంటేనే జ్ఞానం పెరిగి అభివృద్ధి పథంలోకి వస్తారని గ్రహిం చాడు.తాను పాలేరుగా పనిచేస్తున్నప్పటి నుండి,సర్పంచ్ పదవిలోకి వచ్చిన తరువాత గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దొరలు ఎన్ని ఆటంకాలు కల్పించినా అంచెలంచెలుగా పదవ తరగతి, జూనియర్ కాలేజ్ వరకు పెంచడంలో క్రియాశీల పాత్ర పోషించాడు.
గ్రామాల అభివృద్ధిని, బహుజనులను చైతన్యం కావాలంటే రాజ్యాధికారమే ప్రధానమని గ్రహించాడు.1981లో రాజకీయ రంగప్రవేశం చేసి రెండుసార్లు సర్పంచ్ గా ఎన్నికయ్యారు.మండలం లోని మిగతా సర్పంచులు గ్రామాల అభివృద్ధికి వచ్చిన పంచాయితీ రోజ్ గార్ నిధులను అధికారులను బెదిరించి పాకెట్ మనీగా సొంతానికి వాడుకుంటే బన్నా ఆశాలు మాత్రం ప్రతి పైసా పంచాయతీ లోని గ్రామాల అభి వృద్ధికి కేటాయించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ గ్రామ పంచాయతీలో జరగని అభివృద్ధి కాసిపేట పంచాయతీలో చేసి రెండు సార్లు జిల్లా స్థాయి ఉత్తమ సర్పంచిగా ఎంపికయ్యాడు.పంచాయతీ పరిధిలోని గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం కల్పిం చాడు.కొత్తగా మూడు గ్రామాలను నెల కొల్పాడు. సోమగూడెంలో ట్యాంక్ బస్తీ, కాసిపేటలో అశోక్ నగర్, దుబ్బ గూడెం లో తూర్పువాడ తన హాయంలోనే ఇళ్లస్థలాలు ఇప్పించి గ్రామాలను నెలకొల్పాడు. సల్పల వాగు,రాళ్లవాగు లోని నీరంతా వృధాగా గోదావరిలో కలిసేది . సర్పంచిగా ఎన్నికైన తర్వాత 1984లో వాగు ఒడ్డున విద్యుత్ లైన్లు వేయించి ఎత్తిపోతల పథకాలకు మండ లంలో శ్రీకారంచుట్టిన రైతు బాంధవుడు బన్న ఆశన్న .మండలంలో మిగతా పంచాయితీలలో ఎక్కడా లేని విధంగా పంచాయితి భవనాన్ని నిర్మించాడు. ప్రజలు విజ్ఞానవంతులు కావాలని ముందుచూపుతో గ్రంథాలయాన్ని మంజూరు చేయించాడు. మండల కేంద్రంలో మొట్టమొదటిసారి అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాడు.సారా పోరాటం, కాసిపేట ఓపెన్ కాస్టు వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లాంటి ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రజల ఆదరాభిమానాలు పొందాడు.
ఆశన్న బహుజన ప్రజలను చైతన్యవంతం చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తు ప్రజాదరణ పొందుతూ ఉంటే దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తే వి. కొంతమంది వెలమ దొరలు భయంతో తమ రాజకీయ ఆధిపత్యం ఎక్కడ పోతుందోనని భయపడ్డారు. బహుజన వర్గాలలోని కొంతమంది ఎస్సీ,ఎస్టీ,బిసిలకు చెందిన బానిసలను చేరదీసి మందు, విందులకు అలవాటు చేసి వారిని పెంచి పోషించి కిరాయి రౌడీలుగా వాడుకునేవారు. వారిచే ఎన్నోసార్లు బన్న ఆశాలు పై దాడులు, హత్య ప్రయత్నాలు బంధువులను హత్యచేసిన ఉదంతాలు ఉన్నాయి. అయినా వెలమ దొరలదాడులకు భయపడకుండా బహుజనుల అభివృద్ధి కోసం నేటికి 86 ఏళ్ళ వయసులో కూడా పోరాడాడు అగ్రకుల దురహంకారాలు అరాచకాలను ఎదురించి బహుజన ప్రజలకు అండగా నిలిచిన మొట్టమొదటి బహుజన పోరాటయోధుడు బన్న ఆశాలు. బన్న ఆశన్న మృతి మండలంలోని బహుజన వర్గాలకు తీరని లోటు. ఆశన్న ఆశయాలను మేరకు మండలంలోని బహుజల వర్గాలంతా ఐకమత్యం తో ముందుకు వెళ్లడమే మహనీయు నికి ఇచ్చే అసలైన నివాళి.

