Scv News Kasipet :-
' నీకోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు' అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ సూక్తులను నిజం చేస్తూ బన్న ఆశన్న నిరంతరం బహుజనుల ప్రజల అభివృద్ధి కోసం పరితపించాడు.బహుజనుల పిల్లలు విద్య నేర్చుకుంటే గౌరవంగా జీవిస్తారని విద్యాభివృద్ధి కోసం ఎనలేని సేవలు చేశారు.అతడి బాల్య జీవితము,విద్యా భివృద్ధికి చేసిన కృషిని తెలుసుకుందాం.
* బన్న ఆశాలు జీవిత విశేషాలు.
కాసిపేట గ్రామానికి చెందిన బన్న రాజన్న, అంకమ్మ దంపతులకు 20 జులై 1937 బన్న ఆశాలు జన్మించారు.ముగ్గురు అన్నదమ్ములు ఒక చెల్లెలు.బన్న రాజo బెల్లంపల్లి రైల్వేలో ఉద్యోగం చేసేవాడు. బెల్లంపల్లి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వేమరమ్మతు పనులు చేసేవాడు. కొద్దికాలం సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే క్వార్టర్లలో నివాసం ఉన్నారు.ఆశాలు మొదట విద్యాభ్యాసం సికింద్రాబాదులోని రైల్వే కాలనీలో ప్రారంభమైంది. 1,2 వ తరగతి వరకు అక్కడే చదువు కున్నాడు. మూడవ తరగతి కాసిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.పాఠశాల లో మూడవ తరగతి వరకే ఉండేది. 4వ తరగతి పెద్దనపెల్లి రైల్వే స్టేషన్ పాఠశాల లో చేరాడు.ఇక్కడ 5,6, తరగతి, బెల్లంపెల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి,సి ఎస్ ఐ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేశాడు.
కుటుంబ పోషణ కోసం 1956లో స్థానిక భూస్వామి పోలీస్ పటేల్ సూర్యప్రకాష్ రావు వద్ద వంశపారంపర్యంగా వస్తున్న సుంకరి (వీఆర్ఏ) గా పనిలో చేరాడు. కొండాపూర్ రెవెన్యూ గ్రామానికి మొదటి సుంకరిగా విధులు నిర్వర్తించారు. కొండాపూర్ సుంకరి గా పనిచేస్తున్న క్రమంలోనే గ్రామ సుంకరులందరికీ మిలటరీలో శిక్షణ ఇచ్చి పంజాబ్లోని సైనిక బెటాలియన్ పంపాలని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. మండలంలోని కుసుమ రాజం, షేక్ హుస్సేన్, మహమ్మద్ హుస్సేన్ లతో పాటు బన్న ఆశలు కూడా బెల్లంపల్లిలో సైనిక శిక్షణ పొందాడు. తల్లిదండ్రులు వద్దనడంతో పంజాబ్ కు వెళ్ళలేదు. మూడు సంవత్స రాల తర్వాతవంతుల వారీగా వచ్చిన సుంకరిపోస్ట్ బంధువులకు అప్పజెప్పి సూర్యప్రకాష్ రావు దొర వద్దనే పాలేరుగా చేరాడు.నాలుగు సంవత్సరాలు పాలేరుగా పనిచేశారు. చదువుకొని పాలేరు పని చేయడం మనసొప్పక పని మానేసి మందమర్రిలో కాంట్రాక్టర్ల వద్ద కూలి పనికి వెళ్ళాడు. 1966లో సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగం దొరకడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. సోమగూడెం ఒకటో గనిలో లాడిసు కార్మికుడిగా విధుల్లో చేరి అనతి కాలంలోనే షార్ట్ ఫైరర్ గా పదోన్నతులు పొందాడు.
* బహుజనుల పిల్లల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి.
బహుజన వర్గాలు వెనుక బడటానికి చదువు లేకపోవడమే ప్రధాన కారణం అని గుర్తించిన బన్న ఆశాలు స్థానిక ప్రాథమిక పాఠశాల తరగతుల పెంపుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. 1959 వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి వరకే ఉండేది. గ్రామంలోని దొరల పిల్లలు, ధనికుల పిల్లలంతా పట్టణాలకు వెళ్లి చదువుకునే వారు. బహుజనులకు పిల్లలను చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మూడవ తరగతి వరకే చదివిపించి బడి మానేసి కూలి పనులకు,దొరల పొలాలకి పనికి పంపించేవారు. ఆశాలు పాలేరుగా దొరల వద్ద పనిచేస్తున్న క్రమంలోనే పాఠశాలలో తరగతుల పెంచేందుకు నడుము కట్టారు. 1962 -63 లో స్థానిక గౌరయ్య షావుకారి వద్ద వెయ్యి రూపాయల విరాళం తీసుకుని 4 నుండి 6 వ తరగతికి ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొచ్చాడు.1965లో ఏడవ తరగతి పెంపుదల కోసం కొక్కడపు పుల్లయ్య అనే స్థానిక చిన్న వ్యాపారి వద్ద వెయ్యి రూపాయల విరాళం తీసుకోని ప్రభుత్వానికి డొనేషన్ కట్టి ప్రాథమికోన్నత పాఠశాల గా మార్చారు. మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు ఏడవ తరగతి వరకు కాసిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో చదివేవారు.తరువాత 1975లో ఎనిమిదవ తరగతి కోసం వెలమ దొరల భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న ఆంధ్ర రైతుల వద్ద రెండు వేల విరాళాలు సేకరించి డొనేషన్ కట్టి అనుమతులు తెచ్చాడు. 1982లో తొమ్మిదవ తరగతి అనుమతి కోసం అప్పటి పాఠశాల ప్రధానో పాధ్యాయుడు హనుమాన్ల సార్ సహకారంతో స్థానికుల వద్ద రెండు వేల విరాళాలు సేకరించి అనుమ తులు తెచ్చారు. పదవ తరగతి కోసం మండలం లోని విద్యార్థు లంతా బెల్లంపల్లి మందమర్రి మంచిరాలకు వెళ్లేవారు. 1984లో తాను సర్పంచ్ గా ఉన్న సమయం లో పదవ తరగతి అనుమతి కోసం దరఖాస్తు చేశాడు. ప్రభుత్వం 56 వేల రూపాయల డొనేషన్ చెల్లిస్తే అనుమతులు ఇస్తామని సమాధానం ఇచ్చింది. అంత డబ్బు చెల్లించడం తమతో కాదని మళ్లీ దరఖాస్తు చేసుకుంటే రూ. 36,000 కట్టాలని విద్యాశాఖ అధికారులు కోరారు. అంతా కూడా వీలు కాదనడంతో చివరకు 12,102 రూపాయలు చెల్లిం చాలని విద్యాశాఖ తెలిపింది.
ఆ డబ్బులు కూడా తల్లిదండ్రుల వద్ద లేకపోవడంతో స్థానిక నాయకులు మద్దినేని చిన్న భీమయ్య, కపిల్ టైలర్ పట్టెం వెంకటస్వామి, పాఠశాల ఉపాధ్యాయుడు సత్యనారాయణ సారు ను వెంటబెట్టుకుని మందమర్రి సురేందర్ రావు దొరను కలిసి పరిస్థితి వివరించడంతో పాఠశాలకు 5000 రూ విరాళం అందజేశాడు. దాంతోపాటు పాఠశాల పిల్లల తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో ఇంటింటికీ విరాళాలు సేకరించారు. విరాళాలు మొత్తం రూ.55,000 వసూల య్యాయి. పాఠశాలకు పదో తరగతి అనుమతులు రావడంతో పాటు పిల్లలు కూర్చునేందుకు బెంచీలు అల్మారా తదితర సామాగ్రిని కొనుగోలు చేశారు. ఇలా ఆశన్న ప్రత్యేక కృషితో మండలంలో మొట్ట మొదటిసారి పదవ తరగతి పాఠశాల ప్రారంభమైనది. అప్పటినుండి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బహుజన వర్గాల పిల్లలందరూ కాసిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువు కోవడం ప్రారంభించారు.
పాఠశాల స్థలానికి నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఎంతో కృషి.
కాసిపేట గ్రామం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 1 నుండి 10వ తరగతి వరకు ఒకే దగ్గర చదువుకోవడం, పాఠశాల గదులు ఇరుకుగా ఉండడంవల్ల పిల్లలకు చదువుకోవడం ఇబ్బంది గా మారింది. కాసిపేట గ్రామ శివారులో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల కోసం బిల్డింగ్ ల నిర్మాణం కోసం , ఆట స్థలం కోసం మాన్కు అనే గిరిజనుడి వద్ద నాలుగు ఎకరాల భూమి గ్రామస్తుల వద్ద విరాళాల సేకరించి కొనుగోలు చేయడంలో క్రియాశీల పాత్ర పోషించారు. బిల్డింగుల నిర్మాణం పూర్తయి 1984 లో గ్రామ శివారులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతుల బోధన ప్రారంభంమైంది.
పదవ తరగతి విద్యార్థులు స్థానికంగా పరీక్ష కేంద్రం లేకపోవడంతో బెల్లంపల్లి, మందమర్రి,మంచిర్యాల పట్టణాలకు వెళ్లి పరీక్షలు రాసేవారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు పదవతరగతి పరీక్షలు రాయడం ఇబ్బందిగా మారడంతో అప్పటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ రావు సార్ సూచన మేరకు పరీక్ష కేంద్రం ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేశారు. పదవ తరగతి పరీక్ష కేంద్రం అనుమతుల కోసం జిల్లా విద్యాశాఖను సంప్రదిస్తే రూ.20,000 డొనేషన్ కట్టాలనితెలిపింది. కాంగ్రెస్ నాయకుడు పెద్దపెల్లి ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రి గా ఉన్న జి. వెంకట స్వామి ని సంప్రదించాడు. వెంకట స్వామి కి ఆశన్న దగ్గర సన్నిహిత్యం ఉండడంవల్ల పరీక్ష కేంద్రం అనుమతి కోసం పదివేల రూపాయల విరాళం అందజేసి అనుమతులు ఇప్పించే బాధ్యత మంచిర్యాల్ లోని నర్సింహారెడ్డి కి అప్పజెప్పాడు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కమతం రాంరెడ్డి ద్వారా పరీక్ష కేంద్రానికి అనుమతులు తెప్పించారు. విద్యార్థులకు సైకిల్ పట్టుకోవడం సింగరేణి యాజమాన్యం తో మాట్లాడి షెడ్లు వేయించారు. తరువాత క్రమంలో మండలానికి జూనియర్ కాలేజ్ మంజూరు కావడంతో మొట్టమొదట అదే షెడ్లలో కాలేజీ ప్రారంభం చేశారు. ఇలా బన్న ఆశన్న మండల రాజకీయాలను శాసించే వెలమ దొరల ప్రమేయం లేకుండా బహుజనుల పిల్లలకు విద్యనందిం చేందుకు అహర్నిశలు కృషిన మహానీయుడు. కాసిపేట ఉన్నత పాఠశాల బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్లారంటే దాని వెనక బన్న ఆశన్న అహర్నిశలు కృషి దాగి ఉన్న సత్యాన్ని మండలంలో ని బహుజన వర్గాలు ఎప్పటికీ మర్చిపోవద్దు.
( రేపు సర్పంచ్ గా కాసిపేట పంచాయతీ లోని గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులపై కథనం.)



