నేడు
మరాఠా బహుజన
పోరాట యోధుడు
చత్రపతి
శివాజీ 392 వ జన్మ
దినోత్సవం.
బహుజన పోరాట యోధుడు, మరాఠా వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం జరిపే హక్కు మనువాద శక్తులకు లేదు.
బహుజన సోదరులారా ! చత్రపతి శివాజీ చరిత్రను తెలుసుకోండి. గ్రామాల్లో జన్మదిన కార్యక్రమాలను చేయండి.
Scv News Kasipet :-
బహుజన పోరాటయోధుడు చత్రపతి శివాజీని జీవించి ఉన్న సమయంలో చక్రవర్తిగా గుర్తించని మనువాద బ్రాహ్మణ పురోహిత వర్గంకు చెందిన బిజెపి, విశ్వ హిందూ పరిషత్ లు నేడు శివాజీ హిందూ నాయకుడంటూ శోభా యాత్రలో చేయడాన్ని బహుజన సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది.
భారతదేశంలో 16వ శతాబ్దంలో ముస్లిం మతానికి చెందిన ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు మొగలాయి సామ్రాజ్యాన్ని మహారాష్ట్రలో విస్తరించకుండా అడ్డుకొని ఎదిరించి పోరాడిన బహుజన పోరాటయోధుడు చత్రపతి శివాజీ. మహారాష్ట్రలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మరాఠా యోధుడు బహుజన సామాజిక వర్గానికి చెందిన చత్రపతి శివాజీ మహారాజ్. విదేశీ లైన మొగలాయి సామ్రాజ్యాన్ని మహారాష్ట్ర నుండి తరిమికొట్టి ఢిల్లీ మొగలాయి సామ్రాజ్య సుల్తాన్ ఔరంగజేబును గడగడ లాడించిన చత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వాన్ని మాత్రం హిందూ మతోన్మాద లైన మనువాద బ్రాహ్మణులు అతడు జీవించినంత కాలం గుర్తించలేదు. శివాజీ పరిపాలిస్తున్న కాలంలోనూ అడుగడుగున అవమానిస్తూ చివరకు విషం ఇచ్చి అతని ప్రాణాలను బలితీసుకున్నారు. చత్రపతి శివాజీ ని అవమానించిన ఆనాటి మనువాద బ్రాహ్మణులే ఈరోజు శివాజీ హిందూవీరుడు అంటూ సిగ్గులేకుండా కాషాయ జెండాలు పట్టుకొని శోభ యాత్రలు నిర్వహిస్తూ జన్మదినోత్సవాలు జరపడం విడ్డూరంగా ఉంది.
బహుజన రక్షకుడు చత్రపతి శివాజీ
చత్రపతి శివాజీ షాహాజి భోస్లే,జిజియాబాయి లకు 1630 ఫిబ్రవరి 19న జన్మించాడు. తండ్రి మొగల్ చక్రవర్తి షాజహాన్ సైన్యంలో పని చేసేవాడు. తల్లి జిజియా బాయి దగ్గర శివాజీ చిన్నతనం నుండే ధైర్య సాహసాలను పెంపొందించే యుద్ధ కథలు, నీతి కథలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేసే పాలకుడు కావాలని కలలుకన్నాడు. 1646 లో పదహారేళ్ళ వయసు లోనే కత్తి పట్టి మరాఠ్వాడ పౌరుషాన్ని మొగలాయి సామ్రాజ్యానికి చూపెట్టాడు. స్థానిక మరాఠ యువకులతో చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తోర్ణ, రాజఘడ్ కోటలను స్వాధీనం చేసుకున్నాడు. బీజాపూర్ సుల్తాన్ ఆఫజల్ ఖాన్ ను ప్రతాప్ ఘడ్ వద్ద తల నరికి మరాఠా యుద్ధవీరుడుగా పేరు పొందాడు. బహుజనుల రైతులు అందరితో సైన్యం ఏర్పాటు చేసి గెరిల్లా యుద్ధ పద్ధతులలో మొగల్ సైన్యాలను ఓడించి కోటలను స్వాధీనం చేసుకుని మరట్వాడ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
శివాజీ మరాఠా రాజ్యంలో రైతులకు పన్నులు వసూలు చేయకుండా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ప్రజల రాజుగా పేరు పొందిన వాడు . స్త్రీలపై జరిగే అత్యాచారాలను అవమానాలను తీవ్రంగా వ్యతిరేకించే వారు. మహిళల రక్షకుడుగా పేరు పొందాడు. విదేశీ ముస్లింల పాలకులైన మొగలాయి సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఈ దేశ బహుజన పోరాట యోధుడు చత్రపతి శివాజీ ధైర్య సాహసాలను, పోరాటాలను మాత్రం మనువాద బ్రాహ్మణులు గుర్తించకుండా కించ పరిచారు.
శివాజీని బ్రాహ్మణ మనువాదులు ఎందుకు అవమానించారు?
భారతదేశంలో మూడు వేల ఏళ్లకు పైగా ఆధిపత్యం చెలాయిస్తున్న మనువాద బ్రాహ్మణుల చాతుర్వర్ణ వ్యవస్థ ప్రజలను నాలుగు వర్ణాలుగా విభజించి పరిపాలించారు. మను ధర్మశాస్త్రాన్ని రచించి దాని ప్రకారమే పరిపాలన సాగించారు. మను ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించిన వారిని శిక్షించేవారు. చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం క్షత్రియులు మాత్రమే రాజ్యపాలన చేయాలి. శూద్ర జాతికి చెందిన చత్రపతి శివాజీ కత్తిపట్టి యుద్ధం చేసి మొగలాయి సైన్యాన్ని మట్టి కరిపించి మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం హిందూ పురోహిత వర్గానికి ఇష్టం లేదు.
శివాజీ ని రాజుగా గుర్తించేందుకు నిరాకరించారు. "విదేశీ యులు అయిన మొగలాయిలు పాలించడానికి మేము ఇష్టపడతాము కానీ శూద్ర జాతికి చెందిన శివాజీ రాజ్యమేల డాన్ని మేము సహించము "అంటూ మనువాద బ్రాహ్మణులు బహిరంగంగా ప్రకటించారు. శివాజీకి మీర్జా రాజా జై సింగ్ తో యుద్ధం సమయంలో శివాజీ ఓడిపోవాలని, చనిపోవాలని కోటిచండీ యాగం చేసిన ఘనత బ్రాహ్మణ పురోహిత వర్గంది. మహారాష్ట్రలో చిన్న చిన్న రాజ్యాలు అన్ని జయించి మొగలాయి సామ్రాజ్యాన్ని అంతమొందించి మరాఠా సామ్రాజ్యం ఏర్పాటుచేసిన శివాజీని చక్రవర్తిగా గుర్తించేందుకు బ్రాహ్మణ పురోహిత వర్గం అప్పట్లో నిరాకరించింది.అప్పటి ఆచారాల ప్రకారం రాజు పట్టాభిషేకం అయిన తర్వాతనే సామంత రాజులు అతనికి లోబడి ఉండేవారు.
చత్రపతి శివాజీ పట్టాభిషేకం చేసేందుకు మరాఠాలోని బ్రాహ్మణ పురోహిత వర్గం నిరాకరిస్తే వారణాసి నుండి గగా బట్టు అనే బ్రాహ్మణ పురోహితుని తీసుకువచ్చి అతడు కోరినంత బంగారు నాణాలు బహుమానంగా ఇచ్చి పట్టాభిషేకం చేయించు కున్నాడు. గగా బట్టు అనే పురోహితుడు కూడా శూద్ర జాతికి చెందిన శివాజీని చేతితో ముట్టు అంటే మైల పడతానని ఎడమ కాలి బొటనవేలుతో తిలకం దీద్ది మరాఠా యోధుని అవమా నించాడు. ఈ ఘటన శివాజీ ని తీవ్ర మనస్థాపానికి గురి చేస్తుంది.మనువాద బ్రాహ్మణుల ఆగడాలను అరికట్టాలని నిర్ణయించుకుంటాడు. బౌద్ధ మతం వైపు ఆలోచన ప్రారంభిస్తాడు. విషయాన్ని పసిగట్టిన మనువాద బ్రాహ్మణులు శివాజీని అంతమొందిం చేందుకు కుట్ర చేస్తారు. శివాజీ కి ఇద్దరు భార్యలు మొదటి భార్య కుమారుడు శంభాజీ, రెండవ భార్య సోహరా బాయ్ కుమారుడు రాజారాం. మనువాద బ్రాహ్మణు డు శివాజీ రాజ్యంలో మంత్రిగా ఉన్న కులకర్ణి సహారాబాయిని లొంగ తీసుకున్నాడు.నీ కొడుకు రాజారామ్ ను మరాఠా సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తామంటూ ఆమె చేత శివాజీ కి విషమిచ్చి చంపించిన దుర్మార్గులు మనువాద బ్రాహ్మణ వర్గం . చత్రపతి శివాజీ విషప్రభావం తో 1680 ఏప్రిల్ 3 అమరుడ య్యాడు. ముందు తరాలకు బహుజన పోరాటయోధుడు శివాజీ చరిత్ర తెలియకుండా మనువాదులు కుట్రలు చేశారు.
చత్రపతి శివాజీ చనిపోయిన 189 సంవత్సరాల వరకు మహావీరుడి సమాధి కూడా ఎక్కడుందో మరాఠా ప్రజలకు తెలియకుండా చేసారు. 1869 లో జ్యోతిరావు పూలే అతి కష్టంగా రాయగఢ్ లో శివాజీ సమాధి ని కనుగొని బయటి ప్రపంచానికి చూపాడు. మహారాష్ట్రలో మొదటిసారిగా 1870 నుండి జన్మ దినోత్సవ కార్యక్రమాలను పూలే ప్రారంభించాడు. జ్యోతిరావు పూలే శివాజీ చరిత్రను పరిశోధించి బాహ్య ప్రపంచానికి తెలపడంతో మరాఠా మహాయోధుడు చరిత్ర ఈనాడు మనకు తెలిసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 ఫిబ్రవరి 19న రాయగడ్ లోని శివాజీ సమాధిని సందర్శించి రోజంతా అక్కడే గడిపి మహాద్ చెరువు పోరాటానికి శ్రీకారం చుట్టాడు.
మనువాద బ్రాహ్మణ కుట్రలకు
ఎందరో బహుజన పోరాటయోధుల చరిత్ర
కనుమరుగు.
ఈ దేశంలో మనువాద బ్రాహ్మణ కుట్రల వల్ల బహుజన పోరాటయోధుల చరిత్రలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి.మన తెలంగాణలో చత్రపతి శివాజీ సమకాలికుడైన బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ ను కూడా మనువాద బ్రాహ్మణులు గుర్తించలేదు. తెలంగాణలో 22 కోటలను నిర్మించి 34 సంవత్సరాలు రాజ్యపాలన చేసి చివరి దశలో గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర కూడా కనుమరుగు చేశారు. చరిత్రలో అతని పేరు లేదు. బహుజన పోరాట యోధులైన శివాజీ, సర్వాయి పాపన్నల చరిత్ర బహుజనులకు తెలిస్తే ముందు తరాలు మాపై తిరగ బడి మాకు పుట్టగతులు ఉండవు అని గుర్తించి ముందు తరాలకు చరిత్ర అందకుండా కను మరుగు చేశారు. ఇప్పుడు అదే హిందూ మనువాద బ్రాహ్మణ పురోహిత వర్గానికి చెందిన అనుబంధ సంస్థలైన బిజెపి, విశ్వహిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, ఏబీవీపీ, హిందూ మతోన్మాదులు శివాజీ మావాడు అంటూ కాషాయ జెండాలు పట్టుకుని శోభయాత్ర పేరిట ఊరేగింపులు నిర్వహిస్తు బహుజన సమాజాన్ని మోసం చేస్తున్నారు . చరిత్రలో తరతరాలుగా మనువాదులు బహు జనం కోసం పోరాడిన యోధులను వారి జీవిత కాలమంతా వ్యతిరేకించి వారు చనిపోయిన తర్వాత ప్రజల్లో ఉన్న ఆదరాభి మానాలను గుర్తు చేసుకుని తమ వాడుగా ప్రకటించు కోవడం మను వాదులు అలవాటే. ఉదాహరణకు: యజ్ఞయాగాదులను వ్యతిరేకించి, ఆత్మ లేదని నిరీశ్వర వాదాన్ని ప్రచారం చేసిన గౌతమ బుద్ధుని దశావతారాలు చేర్చుకోవడం, జీవితమంతా బహుజనుల కోసం పోరాడిన అంబేద్కర్ మావాడు అంటూ జన్మదినో త్సవాలు జరుపుతున్నారు. బహుజనుల మైన ఎస్సీ ఎస్టీ బీసీలము మాత్రం మన బహుజన పోరాట యోధులు బుద్ధుడు, పూలే, అంబేద్కర్ శివాజీ, సర్వాయి పాపన్నలను గుర్తించు కోకుండా నివాళులర్పించ కుండా గుడ్లప్పగించి చూస్తున్నాం. ఇప్పటికైనా బహుజన సోదరులు కళ్ళు తెరిచి బహుజన జాతి విముక్తికి పోరాడిన పోరాట యోధులను గుర్తు చేసుకుంటూ , మహాత్మ పూలే, అంబేద్కర్ సామాజిక ఉద్యమాలకు అంబేద్కర్ సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు పలకాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూప్ కోరుతుంది .