మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనడం సరైంది కాదు

భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనడం సరైంది కాదు.

- కాసిపేట మండలం అంబేద్కర్ యువజన సంఘం ఖండన.





Scv News Kasipet :-

 ముఖ్యమంత్రి కెసిఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనడం   సరైంది కాదని  కాసిపేట మండల అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఖండించారు.కాసిపేట మండల కేంద్రంలో ఆదివారం వివిధ  రాజకీయ పార్టీలు,ప్రజాసంఘాల కలయికతో ఏర్పడ్డ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి యువజన సంఘ నాయకులు పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి,అంబేద్కర్ యువజన సంఘం సలహాదారు దాగం మల్లేష్  మాట్లాడుతూ  భారత రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని,కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా కెసిఆర్ మాట్లాడడం సరైంది కాదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటలను ఉపసంహరించుకుని ఇంకొకసారి రాజ్యాంగం జోలికి రావద్దని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులవల్లనే  బహుజనులు స్వేచ్ఛగా బతుకుతున్నారని అన్నారు. రాజ్యాంగం జోలికి ఎవరైనా వస్తే అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుడు, అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకుడు  వేముల కృష్ణ మాట్లాడుతూ దేశంలోని బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ,స్వాతంత్రాలు ఇచ్చినా భారత రాజ్యాం గాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అనడం సరైంది కాదని అన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్  నియంత పాలన సాగిస్తున్నారని అన్నారు. మతోన్మాద పార్టీ బిజెపి రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్నో సంవత్సరాలుగా  ప్రయత్నిస్తున్న వీలు కావడం లేదని అన్నారు . రాజ్యాంగాన్ని మార్చాలని ప్రస్తుతం కేసీఆర్ అన్న మాటలు బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. బహు జనుల ఉన్నతి కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జోలికొస్తే  తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సామాజిక చైతన్య వేదిక మండల అధ్యక్షుడు,అంబేద్కర్ యువజన సంఘం సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చడం ఎవరితరం కాదని ఈ విషయాన్ని ముందే పసిగట్టి అంబేద్కర్ రాజ్యాంగం లోని ఆర్టికల్ 13 లో  మార్చడానికి వీలు లేని నిబంధ నలు పెట్టారన్నారు. మనువాదులు భారత రాజ్యాంగాన్ని మార్చాలని అంబేద్కర్ బతికున్న కాలం నుండి డిమాండ్ చేస్తున్నారని అన్నారు.1996 -2004 కాంగ్రెస్,బిజెపి ప్రభుత్వాల హయాంలో రాజ్యాంగాన్ని సమీక్షించాలని జస్టిస్ వెంకటాచలం కమిషన్ వేసి రాష్ట్రపతికి పంపారని  అన్నారు. అప్పటి రాష్ట్రపతి కె.ఆర్ నారాయణన్ "రాజ్యాంగాన్ని సమీక్ష చేయడం కాదు, రాజ్యాంగాన్ని అమలు చేసే వారి మీద సమీక్ష చేయాలని పక్కకు పెట్టారన్నారు. " రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ కూడా రాజ్యాంగాన్ని  మార్చే ప్రయత్నాలు చేస్తున్నా  బహుజనుల నిరసనలకు భయపడి చేయలేక పోతుందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను  గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాలను బెదిరిస్తుంది అన్న కేసీఆర్ మాటలు వాస్తవమే నన్నారు. దీనికి రాజ్యాంగాన్ని మార్చాలనే మాట సరైంది కాదని రాజ్యాంగ సవరణలు చేస్తే సరిపోతుందన్నారు. కాసిపేట  మండలంలో అంబేద్కర్ యువజన  సంఘం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కలయికతో   అంబేద్కర్ ఆశయాలను మేరకు నడుస్తోందని అన్నారు. ఎ ఒక్క రాజకీయ పార్టీ సొంతంకాదని అన్నారు. మండల సిపిఐ నాయకుడు దాడి గట్టయ్య మాట్లాడుతూ  కెసిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనడం సరైందికాదని  అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని అన్నారు. అంబేద్కర్ సంఘం నాయకుడు  ఓరం కవిరాజ్ మాట్లాడుతూ రాజ్యాంగంలో లోపాలు ఉంటే సవరించుకోవాలి కానీ  కొత్త రాజ్యాంగం కావాలనడం  సరైంది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం సలహాదారు, సిద్ధం తిరుపతి, దేవాపూర్ ఎంపీటీసీ పార్వతి మల్లేష్, మండల కాంగ్రెస్ నాయకుడు అంబేద్కర్ యువజన సంఘం సంయుక్త కార్యదర్శి గోలేటి స్వామి, కుర్మా నరసయ్య,సిపిఐ మండల నాయకులు పులి శంకర్,దాగం  రాజ లింగు, అంబేద్కర్ యువజన సంఘం సంయుక్త కార్యదర్శి గొడిసెల సురేందర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గొడిసెల అజయ్ కుమార్, అభినవ్, అన్వేష్ కుమార్, అమరేందర్, గట్టయ్య దాసరి వంశీ, మంచర్ల మల్లేష్, పట్టెం రాజేశం, గాలి పెళ్లి రాజలింగు, రామకృష్ణ, బెంబడి  మహేష్, దుర్గం నవీన్ తదితరులు పాల్గొన్నారు.