మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలచరిత్రను తెలుసుకుందాం



Scv News Kasipet
:-
ఏజెన్సీ ప్రాంతమైన కాసిపేట మండల చరిత్రనుతెలుసుకుందాం!  ఆదివాసులకు నిలయం   ఏజెన్సీ ప్రాంతమైన కాసిపేట మండలానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. నేటి తరానికి ఆ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది. ఆదివాసుల నిలయమైన కాసిపేట మండలం చరిత్రలో గాంధారి లొద్దిగా పేరుంది. మంచిర్యాల కు వెళ్లే జాతీయ రహదారి పక్కన ఉన్నాబొక్కల గుట్ట వద్ద గాంధారి మైసమ్మ దేవాలయం ఉంది . 17వ శతాబ్దంలో గోండ్వానా రాజ్యంలో పడమట వైపు న ఎత్తైన గుట్టల మధ్యలో గాంధారి కోటను నిర్మించుకుని గోండు రాజులు పరిపాలించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయి.మహారాష్ట్రలోని చంద్రాపూర్ కేంద్రంగా గోండ్వానా రాజ్యములో భాగంగా గాంధారికోట ఉండేది. గోండు రాజులను ఓడించి బ్రిటిష్ వారు గోండ్వానా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ వారికి కప్పం చెల్లించి ఈ ప్రాంతాన్ని నిజాం ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. గాంధారి లొద్ది లో కాసిపేట, తిర్యాని మండలాల పరిధిలోని గ్రామాలు మాణిక్య పూర్, రొంపల్లి, గుండాల, మంగి ప్రాంతం వరకు ఉండేవి. ఈ ప్రాంతంలో నివషించే గోండు, నాయక్ పోడ్, పర్ధన్,తోటి, లంబాడి తెగ ఆదివాసీలు అడవులు నరికి పోడు వ్యవసాయం చేసేవారు. వర్షాధార పంటలైన తెల్ల జొన్న, కంది,పెసర, ఆముదము, నువ్వులు పంటలు పండించి జీవనం సాగించేవారు.
 గిరిజనుల భూములు గిరిజనేతరుల పరం 
నైజాం ప్రభుత్వ హాయంలో భూమిశిస్తు వసూలు చేసేందుకు పట్వారి, జాగిర్దార్ వ్యవస్థ ఉండేది. తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వెలమ,రెడ్డి, సామాజిక వర్గాల వారు నైజాం ప్రభుత్వ హాయంలో వారికి నమ్మినబంటుగా ఉంటూ గ్రామాల్లో భూమిశిస్తు,ఇతర పన్నులను వసూలు చేసి నైజాం ప్రభుత్వానికి చెల్లిస్తూ పట్వారి,జమీందారులుగా చలామణి అయ్యారు. నైజాం ప్రభుత్వ హాయంలో తెలంగాణలోని భూములన్నీ నైజాం నవాబు పేరిటే ఉండేవి. అమాయక గిరిజనులు అడవులు నరికి పంటలు పండించడమే తప్ప, సాగు భూములను ప్రభుత్వ రికార్డులు ఎక్కించే సోయి లేదు . ఇదే అదనుగా పట్వారీలు జమీందార్లు గ్రామాలలో భూమిశిస్తు వసూలు చేస్తూ నైజాం ప్రభుత్వానికి కప్పం కట్టి వేలాది ఎకరాల గిరిజనుల భూములను భూరికార్డుల లో తమ పేరిట ఎక్కించుకుని భూస్వాములు గా మారారు. భూముల పై సరైన అవగాహన లేని అమాయక గిరిజనులు భూములు కోల్పోయారు. ఆదివాసీలు గ్రామాలను విడిచి అడవి లోపటికి వెళ్లి మళ్లీ అడవులు కొడుతూ, పోడు వ్యవసాయం చేసుకుంటూ అడవి మధ్యలో నే గూడాలు ఏర్పరుచుకుని జీవనం సాగిస్తున్నారు. 1969లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళ రైతాంగ పోరాటం తర్వాత అటవీ ప్రాంతంలోని గిరిజనులకు హక్కులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తమై పోరాటాలకు దారి తీయకుండా ఉండేందుకు గిరిజన ప్రాంతాలలో నివసించే గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీని ఫలితంగానే ఏజెన్సీ ప్రత్యేక చట్టమైనా 1/70 తెచ్చింది . 1970 కి ముందు కాసి పేట, ముత్యం పల్లి, ధర్మారావుపేట, మలకపల్లి, దేవాపూర్ ప్రాంతాలలో గిరిజనులు అత్యధికంగా నివసించడం వల్ల ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటించింది. ఇప్పటికీ ఆ గ్రామాల్లో గిరిజన లేకున్న 1/70 చట్టప్రకారం ఏజెన్సీ ప్రాంతాలు గానే కొనసాగుతున్నాయి. మండలంలో అత్యధికంగా గిరిజనులు నివసిస్తున్నారని గుర్తించి 1987లో టిడిపి ప్రభుత్వ హయాంలో మండలాల ఏర్పాటు సమయంలో కాసిపేట మండలం ఏజెన్సీ మండలంగా ప్రకటించింది. ప్రస్తుతం మండలంలో 56 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 21 రెవెన్యూ గ్రామాలు ఉండగా, 22 గ్రామ పంచాయతీలు 9 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

సహజ సంపదలకు నిలయము కాసిపేట మండలం.
ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదలకు నిలయము కాసిపేట మండలం. మండలానికి పడమటి వైపున ఎత్తైన కొండలు గుట్టలు, దట్టమైన అడవులు ఉన్నాయి. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు నీరంతా దిగువకు ప్రవహించి  రాళ్లవాగు, సల్ పాలవాగు,దేవారం వాగుల గుండా గోదావరి లో కలుస్తాయి. వర్షాకాలంలో సల్పాల వాగు ప్రాంతం లోని రెండు గుట్టల మధ్య నుండి సల్ఫల వాగు ప్రవహిస్తూ చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. వాగు మధ్యలో ఉన్న వందల మీటర్ల వెడల్పు తో ఉన్న సల్ప బండలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. సలపాల వాగు ప్రకృతి రమణీయ దృశ్యాలు మంచిర్యాల జిల్లా వాసులను ఎంతో ఆకర్షిస్తున్నాయి . పాఠశాల విద్యార్థులు, సింగరేణి,ఓరియంట్ కార్మికులు పిక్నిక్ వచ్చి వర్షాకాలంలో ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసి ఎంతో ఆనంది ఇస్తుండడంతో సల్ పాలవాగు ప్రాంతం పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. వాగు సమీపంలో గిరిజనుల ఆరాధ్య దైవం అయిన భీమన్న దేవుడు, సల్పల్ దేవుడు, రామాలయం ఉన్నాయి. దీపావళికి ముందు ప్రతియేటా తుడుం దెబ్బ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో దండారి నృత్యాలు జరుగు తుంటాయి.



ఖనిజ సంపదకు నిలయం గాంధారి లోద్ది.
 అపారమైన ఖనిజ సంపదకు నిలయము కాసిపేట మండలంలోని గాంధారి లొద్ది ప్రాంతం. ఈ మండలంలో అపారమైన బొగ్గు నిల్వలు, సున్నపురాయి, ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. కాసిపేట సమీపంలో గోండు గిరిజన నాయకుడు సోమ్ పటేల్ పేరిట ఏర్పడిన సోమగూడెం గోండు గూడెం పరిసర ప్రాంతాలలో బొగ్గు నిక్షేపాలు వెలువడడంతో సింగరేణి యాజమాన్యం బొగ్గు తవ్వకాలు ప్రారంభించింది. గోండు నాయకుడికి పేరిట సోమగూడెం 1వ గనిని 1962లో ప్రారంభించింది. 1970లో సోమగూడెం 3, 1976లో సోమగూడెం 1A,1996 లో కాసిపేట ఒకటవ గని, 2019లో కాసిపేట 2 వ గని ఏర్పాటుచేసి బొగ్గు నిక్షేపాలను వెలికి తీస్తుంది. 2018లో మూతబడిన గనుల నుండి కూడా బొగ్గును వెలికి తీసేందుకు కేకే ఉపరితల గని ద్వారా కూడా బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తుంది.
ఆసియాలోనే అతిపెద్ద సిమెంట్ కర్మాగారం దేవాపూర్ ఓరియంట్.
 దేవాపూర్ ప్రాంతంలోని గుట్టలలో లభించే వందల ఏళ్లకు సరిపడా అపారమైన సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. సున్నపురాయి నిల్వలు ఆధారంగా 1981లో బిర్లా యాజమాన్యం ఆసియాలోనే అతిపెద్ద సిమెంటు కర్మాగారాలు లో ఒకటైన ఓరియంట్ సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.1/70 చట్ట నిబంధనల ప్రకారము ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి కర్మాగారాలు,కట్టడాలు నిర్మించరాదు. సిమెంటు కార్మాగారం ఏర్పాటువల్ల గిరిజన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం భావించి ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. బిర్లా యాజమాన్యం కూడా ఓరియంట్ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుచేసిన పరిసర ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాలకు అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, నిరుద్యోగ గిరిజనులకు ఉపాధి కల్పిస్తూ, విద్య, వైద్యం ఉచితంగా అందించి గిరిజన గూడాల అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చి  అనుమతి పొందింది. ఓరియంట్ యాజమాన్యం 1982లో 3,500 టన్నుల ఉత్పత్తిసామర్థ్యంతో మొదటి యూనిట్ ప్రారంభించింది. 1987లో 2,700 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రెండవ ప్లాంటు ప్రారంభించింది. 2009లో 2,500 టన్నుల సామర్థ్యంతో మూడవ ప్లాంటు ప్రారంభించింది. ప్రస్తుతం మూడు యూనిట్ల ద్వారా 10,700 టన్నుల సిమెంటును యాజ మాన్యం ఉత్పత్తి చేస్తుంది. నాలుగవ ప్లాంటు ఏర్పాటు కూడా ప్రభుత్వం నుండి అనుమతులు పొంది నిర్మాణం చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతోపాటు మహారాష్ట్రలోని బిర్లా యాజమాన్యం ఆధ్వర్యంలో ని సిమెంట్ కర్మాగారాలకు రోజు సుమారు 3,500 టన్నుల సిమెంట్ క్లీన్కర్ వ్యాగన్ల ద్వారా సరఫరా చేసుకుంటుంది. సోనాపూర్, వెంకటాపూర్, లక్ష్మీపూర్ గుట్టలలో ఇనుప ఖనిజ నిలువలు ఉన్నాయని కర్మాగారాలు ఏర్పడతాయని ప్రచారం జరుగుతుంది. సోనాపూర్ ప్రాంతాల్లోని గిరిజనుల వద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తున్నామని కొంతమంది దళారులు భూములు కూడా తీసుకున్నారు.   
 నిరుపయోగమైన చెరువులు, వృధా అయిన ప్రభుత్వ నిధులు! 
 మండలంలోని పడమటి కొండలు, దట్టమైన అడవులలో వర్షాకాలంలో కురిసిన వర్షాలకు కురిసిన నీరంతా చిన్నచిన్న వాగుల ద్వారా రాళ్లవాగు, సలపాలవాగులలో కలిసి దిగువకు ప్రవహించి గోదావరిలో కలిసి వృథా అయ్యేది. వృధాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకుంటూ బీడు భూములకు సాగు నీరు అందించి సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో టిడిపి,కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో సుమారు 50 కోట్ల నిధులు మంజూరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయములో జలయజ్ఞంలో భాగంగా 18 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించేందుకు 42 రెండు కోట్ల నిధులను మంజూరు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా మండలంలో వాగుల మీద 12 చెరువులను నిర్మించారు. అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లు గా వ్యవహరించి నిధులు స్వాహా చేయడంతో చెరువులన్నీ నిరుపయోగం అయ్యాయి. 42 కోట్లు వ్యయం చేసిన వేయి ఎకరాల కూడా సాగునీరు అందడం లేదు. ప్రభుత్వ నిధులు వృధా అవడంతో చెరువులన్నీ అలంకార ప్రాయంగానే ప్రజాధనం నిరుపయోగమైన ది.
నాయకులంతా అభివృద్ధి పై దృష్టి సారించాలి!
మండలంలో లభించే ఖనిజ సంపద, సహజ సంపదలను సద్వినియోగం చేసుకుంటే మండలము ఎంతో అభివృద్ధి పథంలో పయనిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి తో పాటు మండలంలోని గ్రామాలు కూడా అభివృద్ధి పథంలో నడుస్తాయి దీనిపై మండలంలోని రాజకీయ పార్టీల నాయకులంతా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.