అంబేద్కర్ యువజన సంఘము లో అణగారిన వర్గాలు ఐక్యం కావడం శుభపరిణామం.
- ఏ రాజకీయ పార్టీలకు అంబేద్కర్ సంఘం అనుబందంగా పనిచేయదు
Scw News Kasipet :-
కాసిపేట మండలంలో అణగారిన కులాల ఐక్యత కోసం,అంబేద్కర్ - పూలే ఆలోచనలు, వారి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా ఏర్పాటయిన అంబేద్కర్ యువజన సంఘం జిల్లాలో ఎక్కడా లేని విధంగా చురుగ్గా పని చేస్తుండడం ఆనందదాయకం.
కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఇటీవల కాలంలో వరుసగా నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి,మనుధర్మ శాస్త్రం దహనం, భీమా కోరేగావ్ శౌర్యవిజయ దివాస్, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జన్మదిన కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, తెరాస, కాంగ్రెస్, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం శుభపరిణామం. కొన్నేళ్లుగా అంబేద్కర్ సంఘం పూర్తి కమిటీ లేకుండా అంబేద్కర్ జయంతి,వర్ధంతి కార్యక్రమాలకే పరిమితమై ఉండేది. అంబేద్కర్ వాదులుగా చలామణి అయ్యే కొందరు స్వార్ధపరులు అంబేద్కర్ మహనీయుని పేరు చెప్పుకొని అతని ఆశయాలకు తూట్లు పొడుస్తూ సంఘాలను వాడుకునేవారు. కులం పేరు చెప్పుకొని అట్రాసిటీ కేసుల బ్లాక్మెయిలింగ్ చేస్తూ డబ్బులు గుంజు కుంటూ బహుజనుల లోని కొన్ని వర్గాలను దూరం చేసుకున్నాయి. వీరి వెకిలి చేష్టల వల్ల అందరివాడైన ప్రపంచ మేధావి,బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావున్ని కొన్ని వర్గాల వాడే అనే భావన బిసి,మైనార్టీ వర్గాల్లో వచ్చి అంబేద్కర్ ను పట్టించుకో కుండా పోయింది. ఇలాంటి చర్యలవల్ల దేశంలో అంబేద్కర్ వాదం ముందుకు పోలేని పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో మండలంలోని కొంతమంది నీతి నిజాయితీ కి, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే చైతన్యశీలురు, మానవతావాదులు, అంబేద్కరిజం లోతుగా అధ్యయనం చేసి అంబేద్కర్- పూలే ఆలోచనలకు అనుగుణంగా మండలంలో అంబేద్కర్ యువజన సంఘం పునర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది .
అంబేద్కర్ యువజన సంఘం మాల-మాదిగ,నేతకానిల కే పరిమితం కాకుండా ఆదివాసీ గిరిజన,మైనార్టీ, బహుజన కులాల కు చెందిన బీసీలను కూడా చేర్చుకోవడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన పరిణామం.మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్,మాన్యశ్రీ కాన్షీరామ్ కలలు కన్నది కూడా ఇదే.
'పునాది లేని ఇల్లు, చరిత్ర తెలియని జాతి రెండు ఒకటే.పునాది లేకుంటే ఇల్లు నిలబడదు. చరిత్ర తెలియకుంటే జాతులు బాగుపడవు. చరిత్ర తెలియని వాడు చరిత్రను నిర్మించ లేరు' అన్న అంబేద్కర్ మహానుభావుడి సూక్తులను స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమాలను రూపకల్పన చేసుకోవడం జరుగుతుంది. యువజన సంఘాన్ని అంబేద్కర్ జయంతి,వర్ధంతి లకే పరిమితం కాకుండా అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో మూలవాసుల సిద్ధాంతాన్ని బహుజన పోరాటయోధుల జీవిత చరిత్రలను మన వర్గ ప్రజలకు తెలియజేస్తూ చైతన్యవంతం చేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది . భవిష్యత్తులో అన్ని కులాల,వర్గాల పోరాటయోధుల జన్మదినాలను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకున్నాం. సర్వాయి పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ,, కొండా లక్ష్మణ్ బాపూజీ, శ్రీకాంతాచారి,ప్రొపెసర్ జయశంకర్ లాంటి అమరవీరుల జన్మదిన కార్యక్రమాలు కూడా అంబేద్కర్ చౌక్ లో నిర్వహించడం జరుగుతోంది. కొద్దికాలంగా మనం చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర, జిల్లాలోని అంబేద్కర్ సంఘాల అన్నింటికీ ఆదర్శంగా నిలుస్తూ ఉండడం మన సంఘానికి గర్వకారణం. ఇదే స్ఫూర్తితో మండలంలోని అన్ని గ్రామాలలో అంబేద్కర్ యువజన సంఘం కమిటీలు వేస్తూ అందులో ఆదివాసీ గిరిజన,బహుజన కులాలవారిని,మైనారిటీ వర్గాల వారినందరిని అందులో సభ్యులుగా చేర్చుకుంటూ సంఘాన్ని విస్తరించడం జరుగుతుంది.
బురదజల్లే వారిపై అప్రమత్తంగా ఉండాలి.
మండలంలో అంబేద్కర్ యువజన సంఘం కొత్త ఆలోచనలతో అణగారిన కులాల అందరిని ఐక్యం చేసుకొని ముందుకు వెళుతుంటే కొన్ని వర్గాలకు మింగుడు పడడం లేదు.
ఈ దేశంలో తరతరాలుగా అనిగిమనిగి ఉన్న బహుజన కులాలు స్వేచ్చ, స్వాతంత్రం కోసం ముందుకు వెళుతుంటే అడ్డుకొని చీలికలు తేవడం అగ్రవర్ణాలకు మనువాదులకు సర్వ సాధారణమే. మన బహుజన వర్గంలోని కొంతమంది మేధావులుగా చలామణి అయ్యే నకిలీ అంబేద్కర్ వాదులు సంఘం లో చీలికలు తెచ్చేందుకు మన సంఘం అంటే గిట్టని కొన్నివర్గాలు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం . ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బహుజనుల చైతన్యాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని ఆ వర్గాలు గుర్తించాలి. అంబేద్కర్ యువజన సంఘం కార్యక్రమాలపై దుష్ప్రచారాన్ని మానుకొని కలిసి వచ్చే వారందరికీ స్వాగతిస్తాం. బహుజన వర్గాల ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించేవారు చరిత్రహీనులుగా మిగులుతారని గుర్తించుకోవాలి.
ఒకసారి మన దేశ చరిత్రను గుర్తుచేసుకుందాం!
దేశ జనాభాలో 85 శాతం ఉన్న బహుజన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు మనువాదులు కుట్రల వల్ల వేలాది సంవత్సరాలుగా కులాలుగా, మతాలుగా,వర్గాలుగా విడిపోయి మనలో ఐక్యత లేకుండా పోయింది. వారి స్వార్థ ప్రయోజనాల కోసం మన ప్రజలను అజ్ఞానం లోనే ఉంచి పరిపాలన సాగించేందుకు మన వర్గాలకు చదువుకు దూరం చేశాయి. వేలాది కులాలుగా విడిపోవడం వల్ల మనలో ఐక్యత లోపించి మనలో మనమే కొట్టు కోవడం అగ్రవర్ణాలకు,మను వాదులకు కలిసి వచ్చింది. దేశ స్వాతంత్రం వచ్చిన డెబ్భై నాలుగు సంవత్సరాలుగా జనాబాలో 15 శాతం కూడా లేని అగ్రవర్ణాలు, మనువాదులు అధికారాన్ని వారి చేతుల్లో పెట్టుకొని మనలను పాలిస్తున్నారు. అదికారం చేజారకుండా బహుజన వర్గాలలో చీలికలు తెచ్చి మనలోని కొంతమందిని చేరదీసి డబ్బులు ఇచ్చి, పదవులిచ్చి ప్రలోభాలకు గురి చేసి వారికి అనుకూలంగా పనిచేసే వారిగా గా మార్చుకొన్నారు. మన బహుజన మిత్రులే వారి స్వార్థ ప్రయోజనాల కోసం అగ్రవర్ణాలకు, మను వాదులకు అనుకూలంగా పనిచేస్తూ మనలను మన వర్గాలను గందరగోళానికి గురి చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకు పరిపాలన సాగాలి. ఈ దేశంలో 85 శాతం ఉన్న బహుజన వర్గాలను 15 శాతం ఉన్న అగ్రవర్ణాలు పరిపాలిస్తున్నన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత డెబ్భై నాలుగు సంవత్సరాలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని బహుజన వర్గాలలోని కొంతమంది స్వార్ధ పరుల అండదండలతో అగ్రవర్ణాలు మనలను పరిపాలిస్తున్నాయి.
మండలంలోని పరిస్థితి కూడా ఇప్పటికీ ఇలానే కొనసాగుతుంది.
మండలంలో వందల సంవత్సరాలుగా అగ్రకులాల లోని రెండు,మూడు కుటుంబాలు రాజ్యాధికారం తమ చేతుల్లో పెట్టుకొని బహుజన కులాల పై ఆధిపత్యం చెలాయిస్తూ మండలాన్ని శాసిస్తున్నారు. బహుజన వర్గాలు చైతన్యం కాకుండా స్వేచ్ఛగా ముందుకు వెళ్లకుండా ఎన్నో అవరోధాలు సృష్టిస్తూ అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నారు. వీరి స్వార్ధ రాజకీయ పెత్తనం మండల అభివృద్ధికి పెద్ద అవరోధాలు గా నిలుస్తున్నారు. మన బహుజన ప్రజాప్రతినిధులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ, స్వతంత్ర లేకుండా పోయాయి.
ఉదాహరణకు:-కాసిపేట మండలంలో 99% బహుజన వర్గాలకు చెందిన వారే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మనవారు జెడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచులుగా ఉన్నా ఒక్క శాతం ఉన్నవారే వారిపై పెత్తనం చెలాయిస్తూ అధికారమంతా వారి కనుసన్నల్లోనే సాగిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. బహుజన ప్రజాప్రతి నిధులంతా ఎలాంటి అధికారాలు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. ఈ పరిస్థితులు అంతా మారాలి. బహుజన ప్రజాప్రతినిధుల అందరిని అగ్రకుల నాయకులు కూడా పాత ఆలోచన పద్ధతులను మార్చుకుని సముచిత గౌరవించడం నేర్చుకోవాలి.అగ్ర కులాలకు చెందిన నాయకులు కూడా అంబేద్కర్ పూలే ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ మండల అభివృద్ధి కోసం పని చేయాలనుకుంటే తమ సంఘంలో చేరేందుకు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం.
రాజకీయ పార్టీల నాయకులకు సూచన
మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ 99% బహుజన కులాలకు చెందినవారే. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ ఫలాల వాలనే పదవులు అనుభవిస్తున్న మనే విషయాన్ని మరవద్దు. తమ పదవీ కాలంలో బహుజనుల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఆశించిన రీతిలో పని చేయాలని కోరుతున్నాం. అంబేద్కర్ యువజన సంఘం ఏ ఒక్క రాజకీయ పార్టీ కి అనుబంధంగా పనిచేయదు. తెరాస , కాంగ్రెస్, బి ఎస్ పి, బిజెపి, సిపిఐ,సిపిఎం పార్టీలు మాకు సమానమే. ఎన్నికల సమయాల్లో నాయకులు ఆయా పార్టీలలో ప్రచారం చేసుకోండి. అంబేద్కర్ సంఘం ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వదు. స్వతంత్రంగానే పనిచేస్తుంది. మండల అభివృద్ధి కోసం బహుజనుల ఐక్యత కోసం, చైతన్యవంతం చేసేందుకు మాత్రమే అంబేద్కర్ యువజన సంఘం పని చేస్తుందని మండల వాసులంతా గుర్తించాలి.
ఇట్లు...
అంబేద్కర్ యువజన సంఘం. మండల శాఖ
(